గత ప్రభుత్వ పాలనలో ఆర్థిక విధ్వంసం

గత ప్రభుత్వ పాలనలో ఆర్థిక విధ్వంసం
  •   ప్రొఫెసర్‌‌ జి.హరగోపాల్‌‌
  •     తెలంగాణ ఆర్థిక వ్యవస్థపై హనుమకొండలో మేధావుల సదస్సు

హనుమకొండ, వెలుగు :  ‘కేసీఆర్ ప్రభుత్వం పదేండ్లలో ఆర్థిక విధ్వంసం చేసింది.. రైతుబంధు నిధులను ధనికులకు దోచిపెట్టింది.. కాళేశ్వరం పేరుతో లెక్కకు మించి ఖర్చు చేసి, రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టింది’ అని పలువురు మేధావులు విమర్శించారు. తెలంగాణ ఉద్యమకారుల వేదిక రాష్ట్ర చైర్మన్‌‌ ప్రొఫెసర్‌‌ కూరపాటి వెంకటనారాయణ, ఫోరం ఫర్‌‌ బెటర్‌‌ వరంగల్‌‌ అధ్యక్షుడు పుల్లూరు సుధాకర్‌‌ ఆధ్వర్యంలో ‘అప్పుల ఊబిలో తెలంగాణ- ఆర్థిక వ్యవస్థ – కారణాలు, పర్యావసానాలు, ప్రస్తుత పరిష్కారాలు’ అనే అంశంపై హనుమకొండలోని హరిత కాకతీయలో ఆదివారం మేధావుల సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు ప్రొఫెసర్‌‌ జి.హరగోపాల్‌‌, ఉన్నత విద్యా మండలి వైస్‌‌ చైర్మన్‌‌ పురుషోత్తం, డీఎన్‌‌.రెడ్డి, రమణమూర్తి హాజరయ్యారు. 

ఈ సందర్భంగా హరగోపాల్‌‌ మాట్లాడుతూ గత పాలకుల విధానాల వల్ల రాష్ట్రంలో విద్య, వైద్య రంగాలు నాశనం అయ్యాయన్నారు. ఫీజు రీయింబర్స్‌‌మెంట్‌‌తో ప్రైవేట్‌‌ కాలేజీలు, ఆరోగ్యశ్రీతో కార్పొరేట్ హాస్పిటల్స్‌‌ మాత్రమే బాగుపడ్డాయని, సర్కారు బడులు, హాస్పిటల్స్‌‌ను మాత్రం ఎవరూ పట్టించుకోలేదన్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత కేసీఆర్‌‌ను కలిసి విద్య, వైద్యం, వ్యవసాయం తదితర రంగాలపై చర్చలు జరిపామని, కానీ ఆయన హేళనగా మాట్లాడారని ఆవేదన వ్యక్తం చేశారు. 

పౌర సమాజం నిశ్శబ్ధంగా ఉంటే ప్రజాస్వామ్యానికే ప్రమాదం అన్నారు. తెలంగాణ ఉద్యమకారుల వేదిక రాష్ట్ర కన్వీనర్ సోమ రామమూర్తి, ఆల్ ఇండియా ఓబీసీ జేఏసీ చైర్మన్‌‌ సాయిని నరేందర్, తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు అన్నమనేని జగన్‌‌మోహన్‌‌రావు, సంగాని మల్లేశ్వర్, వల్లాల జగన్‌‌గౌడ్‌‌, చాపర్తి కుమార్‌‌ గాడ్గే 
పాల్గొన్నారు. 

ఆర్థిక వ్యవస్థను కూల్చిన కేసీఆర్ : రమణమూర్తి

వ్యవసాయం అంటే కేవలం వరి అన్నట్లుగానే పాలకులు వ్యవహరించారని హైదరాబాద్‌‌ సెంట్రల్‌‌ యూనివర్సిటీ ప్రొఫెసర్‌‌ రమణమూర్తి చెప్పారు. రూ. 50 వేల కోట్లు ఖర్చు చేసి.. రూ.68 వేల కోట్ల విలువైన వడ్లను పండిస్తూ.. మిగతా పంటలను నిర్లక్ష్యం చేశారన్నారు. కాగ్‌‌ అభ్యంతరం చెప్పిన కాంట్రాక్టర్లకే కాళేశ్వరం పనులు అప్పగించి, రూ.55 వేల కోట్లు ఖర్చయ్యే ప్రాజెక్టుకు రూ. 1.84 లక్షల కోట్లు ఖర్చు చేశారన్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్‌‌ ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేశారన్నారు.

సర్టిఫికెట్లు వస్తున్నాయి కానీ చదువు రావడం లేదు : పురుషోత్తం

గత ప్రభుత్వం విద్యా ప్రమాణాలను పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని ఉన్నత విద్యా మండలి వైస్‌‌ చైర్మన్‌‌ ప్రొఫెసర్ పురుషోత్తం అన్నారు. విద్యార్థులకు సర్టిఫికెట్లు వస్తున్నాయి.. కానీ చదువు మాత్రం రావడం లేదన్నారు. విద్య, వైద్యాన్ని మాత్రమే ఉచితంగా అందించి.. మిగతా అన్నింటినీ బంద్‌‌ చేయాలని కోరారు.