విత్ డ్రా చేసుకో అన్నప్లీజ్.. సర్పంచ్, వార్డు అభ్యర్థులకు బుజ్జగింపులు

 విత్ డ్రా చేసుకో అన్నప్లీజ్.. సర్పంచ్, వార్డు అభ్యర్థులకు బుజ్జగింపులు
  • పార్టీ నుంచి ఓట్లు చీలకుండా ప్రయత్నాలు
  • ఎంతో కొంత ముట్టజెప్తూ నామినేషన్ విత్ డ్రా చేసుకునేలా ఒత్తిడి
  • లేదంటే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో మద్దతు ఇస్తామని ఒప్పందాలు 

కరీంనగర్, వెలుగు :  మొదటి దశలో సర్పంచ్, వార్డు మెంబర్ల ఎన్నిక జరిగే గ్రామాల్లో నామినేషన్ల దాఖలు, స్క్రూట్నీ ప్రక్రియ ముగియడంతో పోటీలో ఉన్న అభ్యర్థులెవరో తేలిపోయింది. నామినేషన్ల ఉపసంహరణకు బుధవారం వరకు గడువు ఉండడంతో ఒక పార్టీ నుంచి ఒక్కరే పోటీ చేసేలా అభ్యర్థులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. తమ ప్రత్యర్థుల సన్నిహితులు, ఆయా పార్టీల లీడర్ల ద్వారా బుజ్జగింపులు, బేరాసారాలకు దిగుతున్నారు. సర్పంచ్ ఎన్నికల్లో తనకు సహకరిస్తే ఎంపీటీసీ ఎన్నికల్లో సహకరిస్తానని ఒప్పందం చేసుకుంటున్నారు. సర్పంచ్ తోపాటు వార్డు మెంబర్ స్థానాలకు బరిలో నిలిచిన అభ్యర్థులు కూడా ఇలాంటి వ్యూహాలనే అనుసరిస్తున్నారు. 

ఓట్లు చీలకుండా ప్రయత్నాలు..

రిజర్వేషన్ ప్రకారం సర్పంచ్ ఎన్నికలు జరుగుతుండడంతో కొన్ని గ్రామాల్లో ఒకే కులం నుంచి ఇద్దరు, ముగ్గురు పోటీలో నిలిచారు. దీంతో తమ సామాజికవర్గం ఓట్లే చీలే అవకాశం ఉండడంతో వారిలో ఒకరే పోటీలో ఉండేలా ఆయా కులాల పెద్దలు సయోధ్యకు వస్తున్నారు. అయితే మళ్లీ రిజర్వేషన్ కలిసి రావడానికి ఎన్నేండ్లు పడుతుందోనన్న ఆలోచనతో సర్పంచ్ పదవిపై ఆసక్తి ఉన్న అభ్యర్థులు నామినేషన్ల ఉపసంహరణ విషయంలో వెనక్కి తగ్గడం లేదు. కొన్ని చోట్ల ఎమ్మెల్యేలు, పార్టీ నియోజకవర్గ ఇన్ చార్జీలను కూడా కాదని బరిలో నిలుస్తున్నారు. సాధారణంగా స్థానిక సంస్థల్లో అధికార పార్టీకే ఎక్కువగా గెలుపు అవకాశాలు ఉండడంతో ఈ సారి ఎక్కువ సంఖ్యలో నామినేషన్లు కాంగ్రెస్ లీడర్ల నుంచే దాఖలైనట్లు తెలుస్తోంది. 

బుజ్జగింపులు.. బేరసారాలు..

కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ నాయకులు సర్పంచ్ ఎన్నికల్లో ఏకగ్రీవం కోసం తీవ్రంగా ప్రయత్నించారు. అయితే ఉమ్మడి జిల్లాలో రెండు, మూడు చోట్ల మినహా ఎక్కడా వారి ప్రయత్నాలు ఫలించలేదు. పోటాపోటీగా నామినేషన్లు దాఖలు చేశారు. చాలా గ్రామాల్లో సర్పంచ్ స్థానానికి మూడు నుంచి 10 వరకు నామినేషన్లు రావడం, ఒకే పార్టీకి చెందిన నాయకులు ఇద్దరు, ముగ్గురు బరిలో ఉండడంతో ఆయా పార్టీల నాయకులకు తలనొప్పిగా మారింది. పోటీ కాస్తా తక్కువగా ఉన్న గ్రామాల్లో ఒకరినే పోటీలో ఉండేలా చేసి మిగతా ఒకరిద్దరు అభ్యర్థులను బరిలో నుంచి తప్పించి ఏకగ్రీవం చేయాలని ప్రయత్నిస్తున్నారు. 

పోటీ నుంచి తప్పుకుంటే రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు. భవిష్యత్ లో ఇతర పదవులు ఇప్పిస్తామనే భరోసానిస్తున్నారు. అలాగే వచ్చే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో రిజర్వేషన్ కలిసి వస్తే మీరే పార్టీ అభ్యర్థి అని, ఎన్నికల ఖర్చు కూడా చూసుకుంటామని ముందస్తుగా హామీలు ఇస్తున్నారు. లేదంటే గ్రామాల్లో జరిగే రూ.5 లక్షల పనో, రూ.10 లక్షల పనో అప్పగిస్తామని చెప్తున్నట్లు తెలిసింది.   

విత్ డ్రా కావాలంటూ బెదిరింపులు..

గంగాధర మండలం గర్శకుర్తిలో వార్డు మెంబర్ అభ్యర్థిగా పోటీచేస్తున్న వ్యక్తిని విత్ డ్రా కావాలంటూ అవతలి వైపు వారు బెదిరింపులకు దిగారు. ఈ విషయం కాస్తా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అధికారుల దృష్టికి వెళ్లడంతో సోమవారం గ్రామంలో విచారణ చేపట్టారు. గంగాధర మండలం గర్శకుర్తిలోని ఓ వార్డులో గత ఎన్నికల్లో  పోటీ చేసి వార్డు మెంబర్ గా ఓడిపోయిన వ్యక్తిని తొలుత ఏకగ్రీవం కోసం ప్రయత్నించారు. 

అదే వార్డుకు చెందిన ఓ వ్యక్తి పోటీలో ఉంటానని ముందుకు రావడంతో పెద్దమనుషులు అతడితోమాట్లాడి రూ.50 వేలు ఇప్పించేందుకు సిద్ధమయ్యారు. ఓ పెద్దమనిషి వద్ద ఆ డబ్బులు పెట్టారు. అయితే సదరు వ్యక్తి నామినేషన్ వేయడంతో పెద్ద మనుషులతోపాటు గతంలో ఓడిపోయిన వ్యక్తి అతడిని బెదిరింపులకు దిగినట్లు తెలిసింది. దీంతో సదరు అభ్యర్థి పోలీసులు, ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేశారు.