మెదక్ జిల్లాలో ఇండస్ట్రియల్ ఏరియా పంచామెదక్ జిల్లాలో యతీల్లో కాస్ట్లీ పోరు

మెదక్ జిల్లాలో ఇండస్ట్రియల్ ఏరియా పంచామెదక్ జిల్లాలో యతీల్లో  కాస్ట్లీ పోరు
  • సర్పంచ్​ పదవికి కోటిన్నర వరకు ఖర్చుకు అభ్యర్థులు రెడీ 

మెదక్​/మనోహరాబాద్​/చిన్నశంకరంపేట, వెలుగు: మెదక్​ జిల్లాలో ఇండస్ట్రియల్​ ఏరియాలోని పలు  గ్రామ పంచాయతీల్లో అసెంబ్లీ ఎన్నికలను తలపించేలా కాస్ట్​ లీ పోరు జరగనుంది. ఆయా చోట్ల వివిధ రూపాల్లో ఇన్​ కమ్​ సోర్స్​ ఎక్కువగా ఉండడంతో ప్రధాన రాజకీయ పార్టీల తరపున పోటీ చేస్తున్న ఒక్కో అభ్యర్థి రూ.25 లక్షలు మొదలు కొని రూ.కోటిన్నర వరకు ఖర్చు పెట్టేందుకు రెడీ అవుతున్నారు.  

జిల్లాలోని నేషనల్​ హైవే 44 వెంట ఉన్న మనోహరాబాద్, తూప్రాన్, చేగుంట, చిన్నశంకరంపేట, వెల్దుర్తి, శివ్వంపేట  మండలాల్లో చిన్నా, పెద్దా కలిపి దాదాపు 350  పరిశ్రమలు ఉన్నాయి. అందులో  స్టీల్, ఫార్మా, ఫుడ్​ గ్రేయిన్​, కోళ్ల దాణా తయారీకి సంబంధించి పెద్ద పెద్ద కంపెనీలు ఉన్నాయి.  ఆయా పరిశ్రమల ద్వారా ట్యాక్స్​ల రూపంలో పంచాయతీలకు ఏటా లక్షల్లో ఆదాయం సమకూరుతుంది.

 లేబర్​ కాంట్రాక్ట్​ల ద్వారా, వెహికల్స్​ సమకూర్చడం ద్వారా పెద్ద మొత్తంలో ఆదాయం లభించనుంది. పరిశ్రమల విస్తరణ, కొత్త పరిశ్రమల ఏర్పాటు సమయంలో పంచాయతీ పర్మిషన్​ అవసరం ఉంటుంది కాబట్టి కంపెనీ యాజమాన్యాల నుంచి భారీ మొత్తంలో నజరానాలు అందే అవకాశం ఉంటుంది. దీనిని దృష్టిలో పెట్టుకొని ఎక్కువ సంఖ్యలో, భారీ  పరిశ్రమలు ఉన్న  పంచాయతీ సర్పంచ్​ స్థానాలకు తీవ్ర పోటీ నెలకొంది. మనోహరాబాద్ మండలంలో కాళ్లకల్, కొండాపూర్, కూచారం, ముప్పిరెడ్డిపల్లి గ్రామాల పరిధిలో భారీ పరిశ్రమలు ఉన్నాయి. 

ఇదే మండల పరిధి పర్కిబండ శివారులో మల్టీ  మోడల్​లాజిస్టిక్​ పార్క్​ ఏర్పాటు కానుంది. ఇక్కడ 350 ఎకరాల్లో వివిధ రకాల పరిశ్రమలు వెలియనున్నాయి. దీంతో ఈ ప్రాంతం పారిశ్రామికంగా ఎంతో అభివృద్ధి చెందనుంది. మనోహరాబాద్​ మండలంలోని వివిధ గ్రామ పంచాయతీల పరిధిలో అనేక ఫామ్​హౌజ్​లు, రిసార్ట్​ లు వెలిశాయి. మరికొన్ని రిసార్ట్​ లు ఏర్పాటు కానున్నాయి. 

వాటి పర్మిషన్​ల ద్వారా పెద్ద మొత్తంలో ఆదాయం సమకూరుతుంది. ఈ నేపథ్యంలో ఈ ప్రాంతంలోని గ్రామ పంచాయతీ సర్పంచ్ పదవులకు బాగా డిమాండ్​ ఏర్పడింది. ఇండస్ట్రియల్ ప్రాంతమైన కాళ్లకల్  మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్​ పదవికి పోటీ చేయనున్న అభ్యర్థులు కోటి రూపాయల నుంచి కోటిన్నర వరకు ఖర్చు చేసే అవకాశం ఉంది. కొండాపూర్ చిన్న గ్రామపంచాయతీ అయినా పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతం కావడంతో  ఇక్కడ సర్పంచ్​ పదవికి పోటీ చేసే అభ్యర్థులు సైతం రూ.50 లక్షల నుంచి రూ.75 లక్షల వరకు ఖర్చు పెట్టేందుకు సిద్ధమవుతున్నారు. 

ఎంతయినా ఖర్చు పెడతాం..

మరో ఇండస్ట్రియల్ ఏరియా గ్రామాలైన కూచారం సర్పంచ్​ పదవి ఎస్సీ మహిళకు, ముప్పిరెడ్డిపల్లి సర్పంచ్​ పదవి ఎస్సీలకు రిజర్వ్ కావడంతో అక్కడ ఉప సర్పంచ్ పదవి దక్కించుకోవడం కోసం వార్డు మెంబర్​ స్థానాలకు పోటీ చేసే పలువురు అభ్యర్థులు ఇప్పటి నుంచే లక్షల్లో ఖర్చు చేస్తున్నారు. మండల కేంద్రమైన చిన్నశంకరంపేట, రుద్రారం గ్రామ పంచాయతీల పరిధిలో పలు భారీ స్టీల్​పరిశ్రమలు ఉండడంతో పాటు, మరిన్ని కొత్త పరిశ్రమలు ఏర్పాటయ్యే అవకాశం ఉంది.

 దీంతో చిన్నశంకరంపేట సర్పంచ్​ పదవికి పోటీ పడుతున్న ఓ అభ్యర్థి  ఈ పాటికే లక్షల్లో ఖర్చు పెట్టగా, ఎలాగైనా సర్పంచ్​గా గెలవాలన్న టార్గెట్ తో కోటిన్నర వరకు ఖర్చు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. రుద్రారం గ్రామంలో ఓకే సామాజిక వర్గానికి చెందిన ఇద్దరు అభ్యర్థులు పోటా పోటీగా రూ.50 లక్షలకు వరకు ఖర్చు పెట్టే అవకాశం ఉంది. తూప్రాన్​, చేగుంట, వెల్దుర్తి, శివ్వంపేట మండలాల పరిధిలో పరిశ్రమలు ఉన్న పంచాయతీ సర్పంచ్​ పదవులకు పోటీ చేస్తున్న అభ్యర్థులు సైతం ఎన్నికల్లో గెలిచేందుకు రూ.20 నుంచి రూ.50 లక్షల వరకు ఖర్చు చేసేందుకు సిద్ధమవుతున్నారు.