వివాదాలకు కేంద్రంగా మారుతోన్న ఇంటర్ బోర్డు

వివాదాలకు కేంద్రంగా మారుతోన్న ఇంటర్ బోర్డు

వివిధ కారణాలతో రికగ్నైజేషన్​ ఇయ్యని ఇంటర్ బోర్డు  

హైదరాబాద్, వెలుగు: ఇంటర్మీడియెట్ బోర్డు వివాదాలకు కేంద్రంగా మారుతోంది. మిక్స్డ్ ఆక్యుపెన్సీ భవనాల్లో ఉన్న ప్రైవేట్ కాలేజీలకు రెండ్రోజుల కింద గుర్తింపును ఇచ్చిన బోర్డు.. వివిధ కారణాలతో ఇంకో 24 కాలేజీలకు నో చెప్పింది. అఫిలియేషన్లకు దరఖాస్తు గడువు కూడా ముగియడంతో ఆ కాలేజీల్లో చదువుతున్న స్టూడెంట్ల పరిస్థితిపై సందేహాలు నెలకొన్నాయి. 

ఆ కాలేజీల్లో 6 వేల స్టూడెంట్లు 

రాష్ట్రంలో మిక్స్​డ్ ఆక్యుపెన్సీ భవనాల్లో కొనసాగుతున్న 375 కాలేజీలకు ప్రభుత్వం రెండేండ్లు కొనసాగేందుకు ఇటీవలే అవకాశమిచ్చింది. దీన్ని బేస్ చేసుకుని ఇంటర్ బోర్డు ఆయా కాలేజీల నుంచి దరఖాస్తులు తీసుకున్నది. వీటిలో 24 కాలేజీలకు లీజ్ తేదీల గడువు తక్కువగా ఉండటం, ఒరిజినల్ సర్టిఫికెట్లు చూపించకపోవడం, ఇతర కారణాలతో అఫిలియేషన్ ఇవ్వలేదు. ఈ కాలేజీల్లో ఫస్టియర్, సెకండియర్ స్టూడెంట్లు కలిపి 6 వేల మంది చదువుతున్నట్టు చెప్తున్నారు. కాలేజీలకు గుర్తింపు లేకపోవడంతో వారంతా ఎగ్జామ్స్ రాసే అవకాశం లేకుండా పోయింది. దీంతో ఆయా కాలేజీల్లో చదివే సెకండియర్ స్టూడెంట్లను దగ్గరలోని సర్కారు జూనియర్ కాలేజీల నుంచి ఎగ్జామ్స్ ఫీజు కట్టించి, పరీక్షలు రాయించాలని డీఐఈవోలను ఇంటర్ బోర్డు సెక్రటరీ నవీన్ మిట్టల్ ఆదేశించారు. ఫస్టియర్ స్టూడెంట్లను ఇతర గుర్తింపు పొందిన కాలేజీల ద్వారా పరీక్షలు రాయించాలని సూచించారు. ఈ మేరకు డీఐఈవోలకు, జిల్లా ఇంటర్ నోడల్ ఆఫీసర్లకు ఉత్తర్వులు జారీచేశారు. అయితే ఆ స్టూడెంట్లు, పేరెంట్లు సర్కారు కాలేజీల నుంచి ఎగ్జామ్స్​ రాసేందుకు ఒప్పుకుంటారా? లేదా? అనేదానిపై అయోమయం నెలకొన్నది. 

ఇప్పుడు గుర్తింపు లేదంటే ఎట్లా? 

2022–23 అకడమిక్ ఇయర్ జూన్/జులైలో మొదలైతే, 2023 జనవరిలో గుర్తింపు లేదని ప్రకటించడం ఏంటని మేనేజ్‌మెంట్లు ప్రశ్నిస్తున్నాయి. కిరాయి భవనాల్లో కొనసాగే కాలేజీల లీజ్ గడువు మార్చి వరకు ఉన్నా కొన్నింటికి గుర్తింపు ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. మార్చి తర్వాత అగ్రిమెంట్లు మార్చుతారని, కానీ బోర్డు అధికారులు మాత్రం మార్చి తర్వాత అగ్రిమెంట్లు కూడా ఇప్పుడే అడగడం సరికాదని అంటున్నారు. అయితే అధికారింగా గుర్తింపు లేని కాలేజీల వివరాలను మాత్రం బోర్డు అధికారులు వెల్లడించలేదు.

రెండ్రోజులే ఫీజు గడువు

మిక్స్ డ్ ఆక్యుపెన్సీ భవనాల్లోని ప్రైవేటు కాలేజీల్లో చదివే స్టూడెంట్లు ఈ నెల 7,8 తేదీల్లో ఎగ్జామ్ ఫీజు చెల్లించాలని బోర్డు సెక్రటరీ నవీన్ మిట్టల్ ఒక ప్రకటనలో తెలిపారు. రూ. 100 ఫైన్​తో  ఫీజు చెల్లించాలని సూచించారు. అయితే ఆయా స్టూడెంట్లకు ముందుగా రూ.1000 ఫైన్ తో కట్టాలని మేనేజ్మెంట్లను బోర్డు ఆదేశించింది. దీనిపై విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి, విద్యాశాఖ సెక్రటరీ వాకాటి కరుణను కలిసి విన్నవించినా ఫలితం లేకుండా పోయిందని మేనేజ్మెంట్లు ఆవేదన వ్యక్తం చేశాయి. చివరికి ఎంపీ అసదుద్దీన్ ఒవైసీని కలిస్తే.. ఆయన సీఎస్ సోమేశ్​ కుమార్​కు ఫోన్ లో విషయం చెప్పడంతో ఫైన్ ను రూ.100కు తగ్గించారని చెప్తున్నారు.