
ఇంటర్మీడియట్ బోర్డు తీరు మారలేదు. ఇప్పటికే మార్కుల గందరగోళంతో విద్యార్ధులను అయోమయానికి గురి చేసిన బోర్డు.. తాజాగా మరో తప్పిదం చేసింది. సప్లిమెంటరీ పరీక్ష కోసం ధరఖాస్తు చేసుకున్న విద్యార్థికి బోర్డు రెండు హాల్ టికెట్లు జారీ చేసింది. రెండు హాల్ టికెట్లలో వేర్వేరు సెంటర్లను కేటాయించింది. దీంతో పరీక్ష ఎక్కడ రాయాలో తెలియక ఆ విద్యార్ధి అయోమయానికి గురవుతున్నాడు.
వివరాల ప్రకారం.. ఇబ్రహీంపట్నం మండలం వేములకుర్తికి చెందిన న్యావనంది వినోద్ 2015-17 సంవత్సరంలో మెట్‌పల్లిలోని ఓ ప్రైవేటు కళాశాలలో ఇంటర్ చదివాడు. ఇందులో ఇంకా కెమిస్ట్రీ సబ్జెక్ట్‌లో ఉత్తీర్ణత కావాల్సి ఉంది. దీంతో ఈసంవత్సరం సప్లిమెంటరీ పరీక్ష రాయడానికి ఫీజు చెల్లించాడు. ఈ నెల 12న పరీక్ష రాయల్సి ఉండగా.. బోర్డు అధికారులు ఆ విద్యార్థికి రెండు హాల్‌టికెట్లను జారీ చేశారు. వీటిలో హాల్‌టికెట్ల నెంబర్లతో పాటు పరీక్షా కేంద్రాలు వేర్వేరుగా సూచించారు. ఏ కేంద్రంలో పరీక్ష రాయలో తెలియక వినోద్ అయోమయానికి గురవుతున్నాడు. ఈసమస్యను పరీక్షరించాలని బోర్డు అధికారులను ఆవిద్యార్థి వేడుకుంటున్నాడు.