
ఐఏఎస్ అధికారి నవీన్ మిట్టల్పై...ఇంటర్ బోర్డు జేఏసీ చైర్మన్ మధుసూదన్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. ఇంటర్ ఆన్ లైన్ వాల్యుయేషన్ టెండరును గ్లోబరీనా సంస్థకు మారుపేరుతో అంటగట్టేందుకు నవీన్ మిట్టల్ రూ. 6 కోట్ల ముడుపులు తీసుకున్నారని వెల్లడించారు. గ్లోబరీనా సంస్థకు క్లీన్ చిట్ ఇచ్చేందుకు రూ. 3 కోట్లతో ఒప్పందం కుదుర్చుకున్నారని ఆరోపించారు. రూ. 6 కోట్ల ముడుపులు తీసుకుని గ్లోబరీనా సంస్థకు అనుకూలంగా నవీన్ మిట్టల్ పనిచేస్తున్నారని విమర్శించారు.
గ్లోబరీనా సంస్థ వల్ల 10లక్షల మంది విద్యార్థులు ఆగమయ్యారని మధుసూదన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. 20 మందికిపైగా విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారని గుర్తు చేశారు. ప్రీ బిడ్డింగ్ మీటింగ్కు coempt సంస్థ వచ్చిందా లేదా... అనే విషయంపై నవీన్ మిట్టల్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఫిబ్రవరి 9 వరకు బిడ్ల దరఖాస్తుకు చివరి గడువు ఉందని.... ఆ కంపెనీ బిడ్ వేసిందా లేదా బయట పెట్టాలన్నారు. గ్లోబరీనాకు, coempt సంస్థకు సంబంధం లేదని నవీన్ మిట్టల్ నిరూపించాలని సవాల్ విసిరారు. గ్లోబరీనా సీఈవో VSN రాజు.. coempt సంస్థకు సీఈవో అని వెల్లడించారు. తాను చెప్పినవన్నీ నిజాలని ఇంటర్ బోర్డు ఆవరణలోని అమ్మవారి ఆలయం వద్ద ప్రమాణం చేసేందుకు సిద్ధమని, అవన్నీ అబద్దమైతే నవీన్ మిట్టల్ ప్రమాణం చేయాలని సవాల్ విసిరారు.ఇంటర్ బోర్డు వ్యవవహరంలో సీఎం కేసీఆర్, మంత్రి సబితా ఇంద్రారెడ్డి జోక్యం చేసుకొని సమగ్ర విచారణ జరిపి నవీన్ మిట్టల్ పై చర్యలు తీసుకోవాలని మధుసూదన్ కోరారు.