- 18 బ్యాటరీలు, రూ.3,01,000 నగదు, పలు వాహనాలు స్వాధీనం
- సీపీ విజయ్ కుమార్
సిద్దిపేట రూరల్, వెలుగు: సెల్ ఫోన్ టవర్ల వద్ద బ్యాటరీ, డీజిల్ దొంగతనాలకు పాల్పడుతున్న అంతర్ జిల్లా ముఠాను అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి 18 బ్యాటరీలు, రూ.3,01,000 నగదు, ఓ కారు, ఆటో, టాటాఎస్, బైక్ ను స్వాధీనం చేసుకున్నట్లు సీపీ విజయ్ కుమార్ తెలిపారు. సోమవారం సీపీ ఆఫీస్ లో మీడియాకు వివరాలు వెల్లడించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన బత్తుల గురుస్వామి, బత్తుల సాయిరాం, అలకుంట లక్ష్మణ్ రావు, అలకుంట శంకర్, బత్తుల శ్రీను ముఠాగా ఏర్పడి సెల్ ఫోన్ టవర్ల వద్ద బ్యాటరీలు, డీజిల్ దొంగతనాలకు పాల్పడుతూ అమ్మగా వచ్చిన సొమ్మును పంచుకొని జల్సాలు చేసేవారని తెలిపారు.
ఈ క్రమంలో తొగుట వద్ద వాహన తనిఖీలు చేస్తున్న క్రమంలో వారిని పట్టుకున్నట్లు తెలిపారు. వారి వద్ద దొంగ సొత్తును కొనుగోలు చేసిన బండారి శ్రీనివాస్, పుట్ట అంజనేయులు, శీలసాగరం చంద్రం, మహ్మద్ అజీమ్, జోగు మహేశ్ ను అదుపులోకి తీసుకున్నట్లు వివరించారు. ముఠా సభ్యులు రాచకొండ, జగిత్యాల, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి, వరంగల్, జనగాం, మహబూబాబాద్ జిల్లాల పరిధిలో 33 దొంగతనాలకు పాల్పడినట్లు తెలిపారు. కేసు ఛేదనలో కీలకంగా వ్యవహరించిన సీఐలు లతీఫ్, అంజయ్య, ఎస్ఐలు రవికాంత్ రావు, మానస, అరుణ్ కుమార్ ను సీపీ అభినందించారు.
