బాగా చదవాలి : ఇంటర్ ఎగ్జామ్స్.. ఫిబ్రవరి 28 నుంచి.!

బాగా చదవాలి : ఇంటర్ ఎగ్జామ్స్..  ఫిబ్రవరి 28 నుంచి.!
  • పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు
  • మార్చి 18 నుంచి టెన్త్  పరీక్షలు పెట్టే చాన్స్

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో వచ్చే ఏడాది ఫిబ్రవరి 28 నుంచి ఇంటర్ ఎగ్జామ్స్ నిర్వహించేందుకు బోర్డు సిద్ధమవుతున్నది. ఈ మేరకు ప్రభుత్వానికి ప్రపోజల్స్ పంపించింది. మరోవైపు ఇంటర్ ఎగ్జామ్స్ పూర్తయిన మరుసటి రోజు (మార్చి 18) నుంచే టెన్త్ పరీక్షలు నిర్వహించేందుకు ప్రభుత్వ పరీక్షల విభాగం ఏర్పాట్లు చేస్తున్నది. ఇటీవల ఇంటర్, టెన్త్ పరీక్షల నిర్వహణపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. ఈ నేపథ్యంలో పరీక్షల నిర్వహణకు అధికారులు కసరత్తు మొదలుపెట్టారు. త్వరలోనే ఇంటర్, టెన్త్ ఎగ్జామ్స్ షెడ్యూల్ రిలీజ్ చేసే అవకాశం ఉంది.  

లోక్​సభ ఎన్నికల నేపథ్యంలో.. 

దేశవ్యాప్తంగా త్వరలో లోక్ సభ ఎన్నికల హడావుడి ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఇంటర్, టెన్త్ పరీక్షలపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. ప్రతిఏటా ఇంటర్ ఎగ్జామ్స్ పూర్తయిన తర్వాతే టెన్త్ ఎగ్జామ్స్ నిర్వహిస్తుంటారు. ఈ ఏడాది ఇంటర్ బోర్డు అధికారులు రెండు రకాల ప్రతిపాదనలను సర్కారుకు పంపించారు. పరీక్షలను ఫిబ్రవరి 28 నుంచి ప్రారంభించాలని, లేదంటే మార్చి 1 నుంచి మొదలుపెట్టాలని ప్రపోజల్స్ పెట్టారు. దీంతో పాటు మార్చిలో ఎప్పుడూ పెట్టుకునే విధంగా తేదీ డిసైడ్ చేసేందుకు బ్లాంక్ షెడ్యూల్ కూడా ప్రతిపాదించినట్టు తెలిపింది. అయితే ప్రస్తుతం లోక్ సభ ఎన్నికల హడావుడితో పాటు ఎంసెట్, ఇతర పోటీ పరీక్షలు ఉన్న నేపథ్యంలో సాధ్యమైనంత త్వరగా పరీక్షలు నిర్వహించాలని ఇంటర్ బోర్డు భావిస్తోంది. సెంటిమెంట్​గా ప్రతిసారి బుధవారంతోనే పరీక్షలు ప్రారంభమవుతాయి. ఈ ఏడాది కూడా అదే సెంటిమెంట్ తో ఫిబ్రవరి 28 నుంచి మార్చి 16 వరకు నిర్వహించాలని భావిస్తోంది. దీనికి సర్కార్ ఆమోదం తెలిపితే, ఆయా తేదీల్లో పరీక్షలు నిర్వహించేందుకు రెడీగా ఉంది. మరోపక్క ఏపీలో మార్చి 1 నుంచి ఇంటర్ ఎగ్జామ్స్ మొదలుకానున్నాయి. అయితే ఫిబ్రవరి 28వ తేదీ నుంచి ప్రారంభించేందుకే సర్కార్ కూడా మొగ్గుచూపుతున్నట్టు తెలుస్తోంది. 

టెన్త్ పరీక్షల ప్రపోజల్స్ రెడీ.. 

ఇంటర్ ఎగ్జామ్ షెడ్యూల్ పైనే టెన్త్ పరీక్షల షెడ్యూల్ ఆధారపడి ఉంటుంది. ఈసారి మార్చి16తో ఇంట ర్ ఎగ్జామ్స్ ముగిసే అవకాశం ఉంది. దీంతో మార్చి 18 నుంచి టెన్త్ పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వ పరీక్షల విభాగం అధికారులు భావిస్తున్నారు. మార్చి 20 నుంచి ప్రారంభించేలా మరో ప్రపోజల్ రెడీ చేశారు. అయితే, ఏపీలోనూ మార్చి 18 నుంచే టెన్త్ పరీక్షలు ప్రారంభం కానున్న నేపథ్యంలో దాదాపు అదే తేదీ ఫైనల్ అయ్యే చాన్స్​ ఉందని అధికారులు చెప్తున్నారు. ఈసారి లోక్​సభ ఎన్నికల హడావుడి ఉంటుందని, అందుకే త్వరగా పరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు పేర్కొన్నారు. త్వరలోనే పరీక్షల షెడ్యూల్​పై స్పష్టత రానుంది.