
పరీక్షల నేపథ్యంలో స్టూడెంట్ల డౌట్లు తీర్చేందుకు చానెల్
హైదరాబాద్, వెలుగు: ఇంటర్ పరీక్షలు దగ్గరపడుతున్నాయి. స్టూడెంట్లకు చదువుతున్న పాఠాలపై డౌట్లు రావడం కామన్. కాలేజీలో అయితే ఓకేగానీ, ఇంట్లో చదివేటప్పుడు డౌట్లు వస్తే ఎలా? డౌట్ వచ్చిన ప్రతిసారీ లెక్చరర్ దగ్గరకు వెళ్లలేరు కదా. అందుకే లెక్చరర్ దగ్గరకు వెళ్లాల్సిన అవసరం లేకుండా ఆ డౌట్లు తీర్చుకునేందుకు ఓ యూట్యూబ్ చానెల్‌ను తీసుకురాబోతోంది సర్కార్. ‘తెలంగాణ ఇంటర్మీడియట్’ పేరిట చానెల్‌ను ప్రారంభించబోతోంది. ఇప్పటికే స్టూడెంట్ల కోసం ప్రత్యేకంగా ఫిర్యాదుల విభాగాన్నీ ఏర్పాటు చేసిన ఇంటర్ బోర్డు, ఇప్పుడు ఈ చానెల్‌ను స్టూడెంట్స్ కోసం అందుబాటులోకి తీసుకురాబోతోంది. మార్చి 4 నుంచి 23 వరకు ఇంటర్ పరీక్షలు జరగనున్నాయి. రాష్ట్రమంతటా ఫస్టియర్, సెకండియర్ కలిసి 9,65,840 మంది పరీక్షలు రాయనున్నారు. 1,339 పరీక్షా కేంద్రాలను సిద్ధం చేశారు.
సీనియర్లతో పాఠాలు.. వీడియోలు రెడీ
స్టూడెంట్స్‌ను పరీక్షలకు మానసికంగా సిద్ధం చేసేందుకు ఇప్పటికే ఇంటర్ బోర్డు కౌన్సిలర్లను నియమించింది. దాంతో పాటు పాఠాల్లో డౌట్లను తీర్చేందుకు సీనియర్ ఎక్స్‌పర్ట్‌లతో వివిధ సబ్జెక్టులపై పాఠాలు చెప్పించి వీడియోలు రెడీ చేసింది. ఆ వీడియోలను యూట్యూబ్ చానెల్లో అప్లోడ్ చేస్తారు. అయితే, ఆ చానెల్ ఈపాటికే మొదలు కావాల్సి ఉన్నా, సర్కారు అనుమతి కోసం అధికారులు ఎదురు చూస్తున్నట్టు తెలుస్తోంది. విద్యాశాఖకు గతంలో ఉన్న కార్యదర్శి హయాంలో యూట్యూబ్ చానెల్ నిర్ణయం తీసుకున్నారు. కానీ, ఆయన బదిలీపై వెళ్లారు. దీంతో ఇప్పుడు కొత్త కార్యదర్శి అనుమతి కోసం మరోసారి ఇంటర్‌బోర్డు అధికారులు ప్రతిపాదనలు పంపించారు. కాగా, యూట్యూబ్ చానెల్ ప్రారంభమైతే కొన్ని సబ్జెక్టుల్లో డల్‌గా ఉండే స్టూడెంట్లకు ఉపయోగపడుతుందని చెబుతున్నారు. స్టూడెంట్స్, పేరెంట్స్నుంచి ఫిర్యాదులు తీసుకునేందుకు, వారి డౌట్లు తీర్చేందుకు ఇంటర్ బోర్డు ప్రత్యేకంగా ఓ కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేసింది. పరీక్షలకు సంబంధించిన సమాచారం కోసం 040 – 24601010/ 24732369 నెంబర్లకు ఫోన్ చేయొచ్చని ప్రకటించింది.
తప్పులతో బుక్లెట్.. మెసేజ్తో రిజల్ట్స్
పోయినేడాది ఇంటర్ ఆన్సర్ షీట్లు దిద్దడంలో ఎన్నో తప్పులు దొర్లాయి. ఈసారి ఆ తప్పులేవీ జరగకుండా, ఆ తప్పులను ఒక దగ్గర చేర్చి ప్రత్యేకంగా ఓ బుక్‌లెట్‌ను తయారు చేశారు. దానిని ఎగ్జామ్స్ డ్యూటీ పడిన వాళ్లందరికీ ఇవ్వనున్నారు. వారికి స్పెషల్ ట్రైనింగ్ కూడా ఇవ్వనున్నారు. దాని వల్ల తప్పులు కొంతమేరైనా తగ్గే అవకాశముందని అధికారులు భావిస్తున్నారు. పరీక్ష ఫలితాలను నేరుగా స్టూడెంట్ల ఫోన్లకు నేరుగా పంపించాలని అధికారులు ఆలోచిస్తున్నారు. ప్రస్తుతం ఫలితాల కోసం చాలా మంది స్టూడెంట్లు ఇంటర్నెట్ సెంటర్ల దగ్గరకు వెళ్లాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలోనే హాల్‌టికెట్ నంబర్‌ను మెసేజ్ చేస్తే, ఫోన్‌కే రిజల్ట్ పంపించేందుకు అధికారులు కసరత్తులు చేస్తున్నారు.