నెలాఖరులో ఇంటర్ రిజల్ట్స్​!

నెలాఖరులో ఇంటర్ రిజల్ట్స్​!

హైదరాబాద్, వెలుగు: ఇంటర్ సెకండియర్ స్టూడెంట్లకు ఇటీవల జరిగిన ఫస్టియర్ ఎగ్జామ్స్ రిజల్ట్స్ ను ఈ నెలాఖరు వరకు విడుదల చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. అక్టోబర్ 25 నుంచి ఈ నెల 3 వరకు ఎగ్జామ్స్​కు 4 లక్షల మందికి పైగా స్టూడెంట్లు అటెండ్ కాగా.. ఈ నెల 6 నుంచి 14 సెంటర్లలో స్పాట్ వాల్యుయేషన్ ప్రారంభమైంది. ఇది 22 వరకు జరుగుతుందని ఇంటర్ బోర్డు అధికారులు అంచనా వేసినా, ఈ నెల19 తోనే ముగియనుంది. ముందుగా కార్పొరేట్, ప్రైవేటు కాలేజీల నుంచి స్పాట్ కు లెక్చరర్లు అటెండ్ కాలేదు. దీంతో 300 కాలేజీలకు ఇంటర్ బోర్డు నోటీసులు ఇవ్వగా, లెక్చరర్ల అటెండెన్స్ పెరిగింది. అనుకున్న టైమ్​కంటే ముందుగానే వాల్యుయేషన్ ముగియనుంది. ఇప్పటికే స్పాట్ సెంటర్లలో ఇంగ్లిష్, సంస్కృతం మినహా అన్ని సబ్జెక్టుల వాల్యుయేషన్ పూర్తయింది. ఈ నెల 20 వరకు పోస్ట్ వాల్యుయేషన్ ప్రక్రియ పూర్తిచేసి, 21లోగా అన్ని సెంటర్ల నుంచి వివరాలు ఇంటర్ బోర్డుకు వచ్చేలా అధికారులు ఏర్పాట్లు చేశారు. వారంలో రిజల్ట్ ప్రాసెస్ పూర్తి చేసి, ఈ నెలాఖరుకు రిజల్ట్ ఇవ్వాలని భావిస్తున్నారు.

ఫైనల్ ఎగ్జామ్స్ లేట్..

ఈ రిజల్ట్ రిలీజ్ చేసిన వెంటనే ఈ ఏడాదికి గాను ఎగ్జామ్ ఫీజు షెడ్యూల్ రిలీజ్ చేయనున్నారు. ఈసారి మార్చి 23 నుంచి ఏప్రిల్ 12 వరకు ఫస్టియర్, సెకండియర్ ఎగ్జామ్స్ నిర్వహిస్తామని మొదట ఇంటర్ బోర్డు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే మధ్యలో పోయినేడాది ఎగ్జామ్స్ నిర్వహించడం, వాటి వాల్యుయేషన్ తో లెక్చరర్లు బిజీగా ఉన్నారు. స్టూడెంట్లకు క్లాసులు సరిగా జరగలేదు. దీంతో ఎగ్జామ్స్ ను ఏప్రిల్, మే నెలల్లో నిర్వహించాలని బోర్డు భావిస్తోంది.