ముగిసిన ఇంటర్ ఎగ్జామ్స్..జూన్ 20లోపే రిజల్ట్స్

ముగిసిన ఇంటర్ ఎగ్జామ్స్..జూన్ 20లోపే రిజల్ట్స్

హైదరాబాద్, వెలుగు: ఇంటర్ మెయిన్ ఎగ్జామ్స్ గురువారంతో ముగిశాయి. మరో నాలుగు రోజులు బ్రిడ్జి కోర్సు పరీక్షలు జరగనున్నాయి. శుక్రవారం నుంచి ఇంటర్ కాలేజీలకు వేసవి సెలవులు మొదలవుతాయి. ఈ నెల12 నుంచే ఇంటర్ స్పాట్ వాల్యుయేషన్ మొదలవ్వగా, 22 నుంచి పూర్తి స్థాయిలో ప్రారంభం కానుంది. రిజల్ట్ జూన్ 20లోపే ఇవ్వనున్నట్టు ఇంటర్ బోర్డు ప్రకటించింది. గురువారం రాష్ట్ర వ్యాప్తంగా 12 మందిపై మాల్ ప్రాక్టీస్ కేసులు నమోదయ్యాయి. పరీక్షలు విజయవంతంగా పూర్తయిన నేపథ్యంలో ఇంటర్ బోర్డు సెక్రటరీ ఉమర్​ జలీల్​ను ఇంటర్ విద్యా జేఏసీ చైర్మన్ మధుసూదన్ రెడ్డి నేతృత్వంలో ఉద్యోగులు సన్మానించారు. 

క్వశ్చన్ పేపర్లలో పొరపాట్లు నిజమే: ఉమర్ జలీల్ 

క్వశ్చన్ పేపర్లలో పొరపాట్లు జరిగాయని ఇంటర్ బోర్డు సెక్రటరీ ఉమర్ జలీల్ ఒప్పుకున్నారు. భవిష్యత్​లో ఇలాంటివి జరగకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఇంగ్లిష్, తెలుగు మీడియంలో వేర్వేరు ప్రశ్నలు వచ్చిన నేపథ్యంలో ఏ క్వశ్చన్​కు ఆన్సర్ రాసినా పరిగణలోకి తీసుకుంటామని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 9.07 లక్షల మంది ఎగ్జామ్స్ రాశారని, అందరి కృషితో పరీక్షలు విజయవంతంగా పూర్తయ్యాయన్నారు. 15 సెంటర్లలో స్పాట్ వాల్యుయేషన్​ జరుగుతోందని, 15 వేల మంది ఎంప్లాయీస్ పాల్గొంటున్నారని వెల్లడించారు. ఈ ఏడాది కొత్తగా నిర్మల్, సిద్దిపేట, మంచిర్యాలలో వాల్యుయేషన్ సెంటర్లు పెట్టినట్టు చెప్పారు. స్టూడెంట్లకు ఎలాంటి సందేహాలున్నా ట్రోల్​ ఫ్రీ నెంబర్​1800 599 9333కు కాల్ చేయాలని సూచించారు.