
హైదరాబాద్, వెలుగు: నిబంధనలకు విరుద్ధంగా ఇంటర్ స్పాట్ వాల్యువేషన్ డ్యూటీలు వేశారని ఇంటర్ విద్యా పరిరక్షణ సమితి కన్వీనర్లు రామకృష్ణ గౌడ్, కొప్పిశెట్టి సురేశ్, కో ఆర్డినేటర్ మైలారం జంగయ్య ఆరోపించారు. కేవలం సర్కారు కాలేజీల్లోని లెక్చరర్లు, ప్రిన్సిపళ్లకు మాత్రమే డ్యూటీలు వేశారన్నారు. ప్రైవేటు, కార్పొరేట్ కాలేజీలను స్పాట్ వాల్యువేషన్ నుంచి మినహాయించడం ఏంటని బుధవారం ఒక ప్రకటనలో ప్రశ్నించారు. ప్రైవేటు కార్పొరేట్ కాలేజీలకు కొమ్ము కాస్తున్న బోర్డు సెక్రెటరీ ఉమర్ జలీల్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సర్కారు కాలేజీల్లోని సిబ్బంది అంతా స్పాట్లో ఉంటున్నారని.. ఎవరైనా హాజరుకాకపోతే షోకాజ్ నోటీసులు జారీచేస్తున్నారన్నారు. ఈ విధానం సరికాదన్నారు. స్పాట్‌తో సర్కారు కాలేజీల్లో తరగతులు జరగడం లేదని, ప్రైవేటు కాలేజీల్లో మాత్రం కొనసాగుతున్నట్లు పేర్కొన్నారు.
ఆస్తి పన్ను వివాదాల బాధ్యత జడ్సీలదే!
హైదరాబాద్, వెలుగు: ఆస్తి పన్నుకు సంబంధించిన వివాదాలను పరిష్కరించే పూర్తి బాధ్యతలను జోనల్ కమిషనర్(జడ్సీ)లకు అప్పగిస్తూ బల్దియా కమిషనర్ లోకేశ్ కుమార్ ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. ట్యాక్స్ ఎక్కువ విధించారని, పరిశీలించి తక్కువ చేయాలంటూ వచ్చే పిటిషన్లను ఇకపై జోనల్ అధికారులే పరిశీలించనున్నట్లు సమాచారం. ఇంతకు ముందు రూ.లక్ష లోపు పన్నుకు సంబంధించిన ఫిర్యాదులను డిప్యూటీ కమిషనర్లు పరిష్కరించేవారు. రూ.5 లక్షల కన్నా ఎక్కువ ఆస్తి పన్నుకు సంబంధించి నేరుగా కమిషనర్ పరిశీలించేవారు. రూ.లక్ష నుంచి రూ.5 లక్షల లోపు అయితే జోనల్ కమిషనర్లు చూసేవారు. ఇక నుంచి అన్నింటిని జోనల్ కమిషనర్లకే అప్పగిస్తూ ఆదేశాలు జారీ అయినట్లు సమాచారం.
రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ‘సురవరం’ నాటక ప్రదర్శన
సురవరం ప్రతాపరెడ్డి సాహిత్య వైజయంతి ట్రస్ట్ సభ్యుల వెల్లడి
ఖైరతాబాద్, వెలుగు: తెలంగాణ వైతాళికుడు, పత్రికా సంపాదకుడు ‘సురవరం ప్రతాపరెడ్డి’ జీవిత చరిత్రను నాటక రూపంలో రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ప్రదర్శించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు ‘సురవరం ప్రతాప రెడ్డి సాహిత్య వైజయంతి ట్రస్ట్’ సభ్యులు సురవరం కృష్ణవర్ధన్, పుష్పలత బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. ప్రతాపరెడ్డి 125వ జయంతి ఉత్సవాల్లో భాగంగా మంత్రి నిరంజన్ రెడ్డి సహకారంతో ఈ నెల 19న సాయంత్రం 7 గంటలకు వనపర్తి జిల్లా కేంద్రంలోని లక్ష్మయ్య ఫంక్షన్ హాల్లో ‘సురవరం’ నాటక ప్రదర్శన ఉంటుందన్నారు. ఈ నెల 20న సాయంత్రం విశ్వశాంతి అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏపీలోని కర్నూల్ పట్టణంలోనూ ప్రదర్శించనున్నట్లు వారు చెప్పారు.
ఎకో ఫ్రెండ్లీ గణపతికే జై
గతేడాదితో పోలిస్తే ఈసారి 25 నుంచి 30 శాతం పెరిగిన ఆర్డర్లు
నెలన్నర కిందటి నుంచే మొదలైన విగ్రహాల తయారీ
హైదరాబాద్, వెలుగు: ఈ సారి గణేశ్ పండుగకు ఎకో ఫ్రెండ్లీ విగ్రహాల తయారీకి ఆదరణ పెరుగుతోంది. సీడ్ గణేశ్, మట్టి గణపతులను కొనేందుకు జనం ఆసక్తి చూపిస్తునునారు. వీటిని తయారుచేసేందుకు సంస్థలు, స్టార్టప్‌లు కూడా పెరిగాయి. ఈ నెలలోనే వినాయక నవరాత్రులు ప్రారంభమవుతుండటంతో ఆర్డర్లు పెరిగాయని తయారీదారులు చెప్తున్నారు.
కార్పొరేట్ సంస్థల నుంచి బల్క్‌లో ఆర్డర్లు వచ్చాయని, వాటికి అనుగుణంగా విగ్రహాలను తయారు చేసినట్టు తెలిపారు. గతంలో ప్లాస్టర్ ఆఫ్ పారిస్(పీవోపీ)తో చేసిన కలర్ ఫుల్ వినాయకులను కొనేందుకు జనం ఆసక్తి చూపేవారు. కాలనీల్లోని మండపాల్లోనూ పీవోపీ విగ్రహాలే ఎక్కువగా కనిపించేవి. వోకల్ ఫర్ లోకల్, గ్రీన్ చాలెంజ్, ఎకో ఫ్రెండ్లీ లాంటివి ఎక్కువ ప్రచారంలోకి రావడంతో రెండేళ్లుగా పరిస్థితి మారింది. చాలామంది మట్టి విగ్రహాల వైపు ఆసక్తి చూపిస్తున్నారు. రెండేళ్లుగా వీటికి డిమాండ్ పెరుగుతోంది. 3 ఇంచుల నుంచి ఆరేడు ఫీట్లలో మట్టి విగ్రహాలు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. గతంతో పోలిస్తే ప్రస్తుతం 25 నుంచి 30 శాతం ఆర్డర్లు, అమ్మకాలు పెరిగాయని తయారీదారులు చెప్తున్నారు.
వివిధ రకాల్లో..
ప్రస్తుతం సిటీలో అనేకమంది మట్టి విగ్రహాలను తయారుచేస్తున్నారు. కస్టమర్లను ఆకట్టుకునేందుకు సీడ్ గణేశా వంటివి తీసుకొస్తున్నారు. ఇంకొందరు విగ్రహంతో పాటు పూజా సామగ్రి కూడా ఇస్తున్నారు. ఈ సారి సీడ్ విగ్రహంతో పాటు ఇండోర్ ప్లాంట్స్ కలిపి కాంబోలాగా అమ్ముతున్నామని తయారీదారులు చెప్తున్నారు.
కార్పొరేట్ సంస్థల ఆర్డర్లు..
పండుగకు నెలన్నర ముందు నుంచే తయారీ మొదలు పెట్టాం. మట్టి గణపతులు ఆరడానికి టైమ్ పడుతుంది. అందుకే ముందే తయారు చేసి పెడుతున్నాం. కార్పొరేట్ సంస్థల నుంచి సైతం ఆర్డర్లు వస్తున్నాయి.
- గణేష్, ప్లాన్ ఏ ప్లాంట్ సంస్థ నిర్వాహకుడు
అవేర్నెస్ పెంచడం కోసమే..
మా దగ్గర ఆరు ఇంచుల నుంచి ఆరు ఫీట్ల మట్టి గణపతులు అందుబాటులో ఉన్నాయి. జనాలు ఇంట్లోనే పూజ చేసి నవరాత్రుల తర్వాత అక్కడే నిమజ్జనం చేయాలనే ఉద్దేశంతో మట్టి గణపతుల తయారీని మొదలుపెట్టాం. దీనివల్ల పర్యావరణం, ట్రాఫిక్, చెరువులు బాగుంటాయని ఆశిస్తున్నాం.
- విజయ్ భాస్కర్, చైర్మన్, రోటరీ క్లబ్ ఆఫ్ గ్రేటర్ హైదరాబాద్
ఓయూ స్కాలర్‌కు ఐసీఎస్ఎస్‌ఆర్ అవార్డు
హైదరాబాద్, వెలుగు: ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ సోషల్ సైన్సెస్ రీసెర్చ్(ఐసీఎస్ఎస్ఆర్) అందించే పోస్ట్ డాక్టోరల్ ఫెలోషిప్(పీడీఎఫ్) అవార్డును ఉస్మానియా యూనివర్సిటీ స్కాలర్ డాక్టర్ బొల్లం తిరుపతి అందుకున్నారు. ఓయూ జర్నలిజం విభాగం ప్రొఫెసర్ బాలస్వామి పర్యవేక్షణలో ‘న్యూస్ ఛానల్స్ రేటింగ్స్ అండ్ క్రెడిబిలిటీ-: ఏ కేస్ స్టడీ ఆఫ్ ఏపీ అండ్ తెలంగాణ’ అనే అంశంపై రెండు రాష్ట్రాల్లో ఐదేండ్ల పాటు పరిశోధన చేసిన తిరుపతి.. 2017లో పీడీఎఫ్‌కు ఎంపికయ్యారు. జాతీయ స్థాయిలో తెలుగు రాష్ట్రాల నుంచి మొట్టమొదటిసారిగా జర్నలిజం డిపార్ట్‌మెంట్‌లో పీడీఎఫ్‌కు ఎంపికవడంతో పాటు, రిపోర్టును సమర్పించి అవార్డు పొందిన తొలి వ్యక్తిగా నిలిచారు. తన పరిశోధనలో భాగంగా న్యూస్ చానళ్లు రేటింగ్ కోసం అనుసరిస్తున్న విధానం, న్యూస్ క్రెడిబిలిటీపై 316 పేజీల రిపోర్ట్‌ను ఐసీఎస్‌ఎస్‌ఆర్‌కు తిరుపతి సమర్పించారు. రెండు రాష్ట్రాల నుంచి 4 వేల మందితో సర్వే నిర్వహించారు. క్రెడిబిలిటీ విషయంలో న్యూస్ చానళ్ల కంటే.. పత్రికలే మేలని పాఠకులు చెప్పినట్టు పరిశోధన పత్రంలో ఆయన పేర్కొన్నారు. కచ్చితమైన సమాచారాన్ని తెలుసుకునేందుకు పేపర్లపైనే ఆధారపడుతున్నట్టు పాఠకులు చెప్పినట్లు తెలిపారు.
కార్మిక వ్యతిరేక విధానాలపై కలిసి పోరాడాలి
సికింద్రాబాద్, వెలుగు: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంభిస్తున్న కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలపై కార్మికులంతా కలిసి పోరాటం చేయాలని ఆల్ ఇండియా రైల్వే మెన్ ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి శివగోపాల్ మిశ్రా పిలుపునిచ్చారు. రైల్ నిలయంలోని ఆడిటోరియంలో యూనియన్ జోనల్ ఉమెన్స్ కమిటీ ఏజీఎస్ సరోజినిరెడ్డి ఆధ్వర్యంలో బుధవారం దక్షిణ మధ్య రైల్వే మజ్దూర్ యూనియన్ 52వ వార్షిక జనరల్ కౌన్సిల్ సమావేశం జరిగింది. ముఖ్యఅతిథిగా శివగోపాల్ మిశ్రా హాజరై మాట్లాడారు. సమస్యల పరిష్కారానికి, హక్కుల సాధనకు సంఘటితంగా ఉద్యమించాల్సిన అవసరం ఉందన్నారు. మజ్దూర్ యూనియన్ ప్రధాన కార్యదర్శి సీహెచ్.శంకర్ రావు, యూనియన్ అధ్యక్షుడు కె.శ్రీనివాస్, ఏఐఆర్ఎఫ్ జాతీయ నాయకురాలు ప్రవీణ సింగ్, ప్రీతి సింగ్ తదితరులు పాల్గొన్నారు.
మహనీయుల త్యాగాలను స్మరించుకోవాలి:మేయర్ గద్వాల్ విజయలక్ష్మి
హైదరాబాద్,వెలుగు: సాలార్ జంగ్ మ్యూజియం ఆధ్వర్యంలో భాగ్యనగర్ సొసైటీ సహకారంతో ఏర్పాటు చేసిన పెయింటింగ్ ఎగ్జిబిషన్‌ను బుధవారం మేయర్ గద్వాల్ విజయలక్ష్మి ప్రారంభించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ.. స్వాతంత్య్ర సాaధనకు కృషి చేసిన మహనీయుల త్యాగాలను స్మరించుకోవడంతో పాటు 75 ఏండ్లలో దేశం సాధించిన ప్రగతి, భావితరాలకు స్ఫూర్తినిచ్చే విధంగా ఈ పెయింటింగ్స్ ఉన్నాయన్నారు. వజ్రోత్సవాల్లో కవులు రచయితలు, స్టూడెంట్లు, జానపద కళాకారులు ప్రతి ఒక్కరిని భాగస్వామ్యం చేసినట్లు చెప్పారు. వజ్రోత్సవాల్లో భాగంగా నిర్వహించిన డ్రాయింగ్ పోటీల్లో జేఎన్ఏ అండ్ ఫైన్ ఆర్ట్స్ వర్సిటీ, వెంకటేశ్వర ఫైన్ ఆర్ట్స్, తెలంగాణ యూనివర్సిటీ ఫైన్ ఆర్ట్స్, సెంట్రల్ యూనివర్సిటీ ఫైన్ ఆర్ట్స్ స్టూడెంట్లు పాల్గొన్నట్లు ఆమె తెలిపారు. ఈ పోటీలో పాల్గొన్న 75 మంది ఫైన్ ఆర్ట్స్ స్టూడెంట్లు వేసిన పెయింటింగ్‌లను ప్రదర్శనకు ఉంచామన్నారు. కార్యక్రమంలో సాలార్ జంగ్ మ్యూజియం డైరెక్టర్ డాక్టర్ నాగేందర్ రెడ్డి, కన్సల్టెన్సీ వీరేందర్, భాగ్యనగర్ ఫైన్ ఆర్ట్స్ సొసైటీ బాధ్యుడు వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.
విద్యా వలంటీర్లను రెన్యువల్ చేయాలి
ఖైరతాబాద్, వెలుగు: ప్రభుత్వ స్కూళ్లల్లో పనిచేస్తున్న 16వేల మంది విద్యా వలంటీర్లను వెంటనే రెన్యువల్ చేయాలని తెలంగాణ నిరుద్యోగ జేఏసీ డిమాండ్ చేసింది. ఈ మేరకు జేఏసీ నేతలు మంత్రి సబితారెడ్డి ఆఫీసును బుధవారం ముట్టడించారు. వివిధ జిల్లాల నుంచి పెద్దఎత్తున విద్యా వలంటీర్లు తరలి వచ్చారు. టీచర్లు, విద్యా వలంటీర్లు లేకుండా కేవలం నిధులతో స్కూళ్లు ఎలా అభివృద్ధి చెందుతాయని జేఏసీ చైర్మన్ నీల వెంకటేష్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. స్టూడెంట్లకు పాఠాలు ఎవరు చెబుతారని నిలదీశారు. ఈ విద్యా సంవత్సరం ప్రభుత్వ బడుల్లో 4 లక్షల మంది కొత్త స్టూడెంట్లు చేరారని.. వారి సంఖ్యకు తగినట్లుగా టీచర్లను, విద్యా వలంటీర్లను నియమించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.ఇప్పటికైనా సీఎం కేసీఆర్, విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్పందించి విద్యా వలంటీర్లను నియమించి వారిని ఆదుకోవాలని కోరారు.ఈ ముట్టడిలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ కన్వీనర్ గుజ్జ కృష్ణ , బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కృష్ణ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పగిడాల సుధాకర్, విష్ణు ప్రియ, అరీఫా, సుద్దాల మల్లయ్య, భావన, హప్సా బజీజ్, అనంతయ్య, రాజేందర్, బీసీ వెంకట్, భాస్కర్ ప్రజాపతి పాల్గొన్నారు.
19న కొర్వి కృష్ణ స్వామి జయంతి వేడుకలు
పద్మారావునగర్, వెలుగు: హైదరాబాద్ నగర మొదటి మేయర్ కొర్వి కృష్ణస్వామి 129వ జయంతి వేడుకలను ఈ నెల 19న బోయిగూడలో నిర్వహించనున్నట్లు రాష్ట్ర ముదిరాజ్ మహాసభ నాయకులు పేర్కొన్నారు. బుధవారం ముదిరాజ్ భవన్ లో ఈ వేడుకలకు సంబంధించిన పోస్టర్‌ను రిలీజ్ చేశారు. అనంతరం నాయకులు మాట్లా
డుతూ.. ముదిరాజ్‌ల ఐక్యత, హక్కుల కోసం కృష్ణస్వామి పోరాటం చేశారన్నారు. ముదిరాజ్ లను బీసీ ‘డి’ నుంచి ‘ఎ’లో చేర్చాలన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర ముదిరాజు మహాసభ నాయకులు టి. సురేందర్, దొడ్ల సదానందం, నీలం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
హాస్టళ్ల సమస్యలు పరిష్కరించకుంటేమంత్రులు, ఎమ్మెల్యేలను అడ్డుకుంటం
టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు రవీందర్
మెహిదీపట్నం, వెలుగు: సంక్షేమ హాస్టళ్లలోని సమస్యలను వారం రోజుల్లో పరిష్కరించకుంటే మంత్రులు, ఎమ్మెల్యేలను అడ్డుకుంటామని టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు రవీందర్ హెచ్చరించారు. బుధవారం మధ్యాహ్నం మాసబ్ ట్యాంక్ తెలుగు సంక్షేమ భవన్‌వద్ద టీఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా రవీందర్ మాట్లాడుతూ.. సంక్షేమ హాస్టళ్లలో పురుగుల అన్నం, నీళ్ల చారు పెడుతున్నారని, గుడ్డు కూడా ఉండట్లేదని మండిపడ్డారు. ఒక్కో స్టూడెంట్‌కు మూడు పూటల ఫుడ్పెట్టేందుకు ప్రభుత్వం రూ.37 ఇస్తోందని, సీఎం కేసీఆర్మనుమడి తిండికి కూడా రూ.37 సరిపోతాయా అని ప్రశ్నించారు. ఇప్పటికే సంక్షేమ హాస్టల్లోని సమస్యలను ప్రభుత్వం దృష్టికి తెచ్చామని గుర్తుచేశారు. మెస్‌చార్జీలు పెంచాల్సిన అవసరం ఉందని, బాలికలకు కాస్మోటిక్ వస్తువులు ఇవ్వడం లేదన్నారు. మాజీ ఎమ్మెల్యే ప్రసన్న మాట్లాడుతూ కనీసం బాత్రూంలు, మరుగుదొడ్లు లేనిచోట బాలికలు ఎలా ఉంటారని ప్రశ్నించారు. పోలీసులు ఆందోళనకారులను అరెస్టు చేసి పీఎస్‌కు తరలించారు.
ప్రభుత్వ భూమిలో అక్రమ నిర్మాణాలను అడ్డుకోవాలె
పెద్ద అంబర్ పేటలో తట్టి అన్నారం వాసుల ధర్నా
ఎల్బీ నగర్,వెలుగు: ప్రభుత్వ భూములు కబ్జాకు గురవుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదంటూ పెద్ద అంబర్ పేట మున్సిపల్ ఆఫీసు ముందు తట్టి అన్నారం వాసులు బుధవారం ఆందోళన చేపట్టారు. తట్టి అన్నారం రెవెన్యూ పరిధి సర్వే నం.127/2,127/3లోని ప్రభుత్వ భూమి ఆక్రమణలకు గురవుతుందని ఎన్నిసార్లు కంప్లయింట్ చేసినా అధికారులు చర్యలు తీసుకోవట్లేదని మున్సిపల్ ఆఫీసు ముందే వంటావార్పు నిర్వహించి నిరసన తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ.. కబ్జాదారులు అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారని ఏడాది కాలంగా ధర్నాలు చేస్తూ.. కమిషనర్‌కు కంప్లయింట్ చేసినప్పటికీ ఫలితం లేదన్నారు. ఆందోళనలో సీపీఎం నాయకులు పాల్గొన్నారు.