అంతర్రాష్ట్ర దొంగల ముఠా ఆటకట్టు

అంతర్రాష్ట్ర దొంగల ముఠా ఆటకట్టు

దృష్టి మళ్లించి దొంగతనాలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర దొంగలను పోలీసులు అరెస్టు చేశారు.  ఈవిధంగా జరుగుతున్న దొంగతనాలపై జులై 2 న ఫిర్యాదు అందింది. దీంతో రంగంలోకి దిగిన ఎస్వోటీ ఎల్బీ నగర్, మహేశ్వరం పోలీసులు చోరుల ఆటకట్టించారు.  రాచకొండ కమిషనర్ మహేష్ భగవత్ కథనం ప్రకారం.. మహారాష్ట్రలోని ఆలంనేర్ ప్రాంతంలో విప్రో కంపెనీ లో సరుకుతో లోడ్ చేసిన లారీ కర్ణాటకకు బయలుదేరింది. అంతర్రాష్ట్ర దొంగలు హైదరాబాద్ శివారులో ఆ లారీని ఆపేసి.. డ్రైవర్లను మాటల్లో పెట్టారు. లారీతో సహా  సంతూర్ సబ్బుల  స్టాక్ ను తీసుకొని పరారయ్యారు.

ఒక బాక్స్ ను రూ.3 వేల కు..

స్టాక్ ను రుద్రం అనే గ్రామంలో రెండు షటర్స్ కిరాయికి తీసుకొని అందులో పెట్టారు.  ఆ తర్వాత స్టాక్ ను మచ్చ బొల్లారానికి షిఫ్ట్ చేశారు. మచ్చ బొల్లారం నుంచి ఆటోల ద్వారా సరుకును తరలించి అమ్మేశారు. సంతూర్ సబ్బుల ఒక బాక్స్ ను రూ.3 వేల కు విక్రయించారు. ఈ దొంగల ముఠాలోని రాజేష్ వేద్, సుశీల్ బేరాలను పోలీసులు అరెస్టు చేశారు.  మరో ఇద్దరు నిందితులు వెంకట్, పరీష్ పరారీలో ఉన్నారు. దొంగతనం జరిగిన సమయంలో రూ.39 లక్షలు విలువైన సంతూర్ సబ్బులు లారీ లో ఉన్నట్లు గుర్తించారు. నిందితుల నుంచి రూ.1.55 లక్షల నగదు, 1,112 బాక్స్ సంతూర్ సోప్స్, ఒక లారీ, హోండా స్కూటీ  స్వాధీనం చేసుకున్నారు. 

గిఫ్ట్ బాక్స్, గ్రీస్ బాక్స్ మాటున హాష్ ఆయిల్ సప్లై

హాష్ ఆయిల్ ముఠా గుట్టు రట్టు చేశారు రాచకొండ పోలీసులు. గిఫ్ట్ బాక్స్, గ్రీస్ బాక్స్ మాటున హాష్ ఆయిల్ సప్లై చేస్తున్నారని..లీటర్ కు 3లక్షలకు అమ్ముతున్నట్లు సీపీ మహేష్ భగవత్ తెలిపారు. పోలీసులకు అనుమానం రాకుండా ప్యాకింగ్ చేసి సప్లై చేస్తున్నట్లు చెప్పారు. గంజాయి, డ్రగ్స్ కేసు నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. మహారాష్ట్ర, హర్యానా కు చెందిన ఇద్దరు పాత నేరస్థులపై పీడీ యాక్ట్ నమోదు చేశామన్న సీపీ 1700  కేజీల గంజాయి రికవరీ అయిన కేసులో ఇద్దరని అరెస్ట్ చేసినట్లు తెలిపారు.