
- హాస్టల్ గదిలో ఉరేసుకొని ఆత్మహత్య
- హనుమకొండలోని ఓ కార్పొరేట్ కాలేజీలో ఘటన
- తక్కువ మార్కులు వస్తే మీరు తట్టుకోలేరంటూ తల్లిదండ్రులకు లెటర్
వరంగల్, వెలుగు: ఇష్టంలేని కోర్సులో చేర్పించారనే మనస్తాపంతో ఓ ఇంటర్ విద్యార్థిని సూసైడ్ చేసుకున్నది. ‘‘నాకు చదువు అర్థం ఐతలే.. మీకు చెబితే అర్థం చేసుకుంటలే.. నాకు మొత్తం టెన్షన్ ఐతుంది. మైండ్ పోతుంది. మీరు చెప్పిన చదువు నాతోని ఐతలే.. నేను చదువుదాం అనుకున్న చదువుకు మీరు ఒప్పుకుంటలే నాకు చావే దిక్కయింది” అని సూసైడ్ లెటర్ రాసి.. ఉరేసుకుంది. ఈ ఘటన హనుమకొండ జిల్లా కేంద్రంలోని ఓ కార్పొరేట్ కాలేజీలో ఆదివారం చోటుచేసుకున్నది. మంచిర్యాలకు చెందిన మిట్టపల్లి శివాని (16) హనుమకొండలోని ఓ కార్పొరేట్ కాలేజీలో ఇంటర్ ఫస్టియర్ (ఎంపీసీ) చదువుతున్నది. ఆదివారం ఉదయం గదిలో ఎవరూ లేని టైంలో ఉరి వేసుకున్నది. కొద్దిసేపటి తర్వాత గమనించిన కాలేజీ యాజమాన్యం విద్యార్థిని తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వకుండా హడావుడిగా శివాని మృతదేహాన్ని వరంగల్ ఎంజీఎంకు తరలించారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని గది పరిసరాలను పరిశీలించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి, విచారణ చేపట్టారు. గుట్టుచప్పుడు కాకుండా డెడ్బాడీనీ దవాఖానకు తరలించడంపై అనుమానాలు కలుగుతున్నాయి.
సూసైడ్ నోట్‌లో ఆవేదన..
సంఘటనా స్థలంలో సూసైడ్ నోట్ దొరికింది. కాలేజీలో చేర్చే ముందు ఒక్కసారి ఆలోచించాలని ఆ లేఖలో శివాని తన ఆవేదన వ్యక్తం చేసింది. తన తల్లిదండ్రులు ఇష్టం లేని కోర్సులో చేర్పించడం వల్లే తక్కువ మార్కులు వచ్చాయని పేర్కొన్నది. తల్లిదండ్రులు ఫీజు కట్టడం వల్లనే చదివానని, తనకు అంత తక్కువ మార్కులు రావడం తట్టుకోలేకపోయానని అందులో రాసింది. ‘‘మమ్మీ.. చెల్లిని బాగా చదివించండి. మంచి కాలేజీలో మంచి గ్రూప్ తీసుకోమని చెప్పండి. నాలాగా అర్థంకాని చదువు దానికి వద్దు. కాలేజీలో జాయిన్ చేసేముందు ఎవరినైనా కొంచెం అడిగి చేర్పించండి. ఇష్టంలేని కోర్సులో చేరి ఎంత కష్టపడ్డా నాతో అయితలే. నేను చదువుకుందామన్న చదువుకు మీరు ఒప్పుకుంటలే. చివరికి నాకు చావే దిక్కయింది” అని నోట్‌లో రాసింది.
మాకు సమాచారం ఇయ్యలే: కుటుంబ సభ్యులు
తమ కూతురు శివాని ఆత్మహత్యకు కాలేజీ యాజమాన్యమే కారణమంటూ కుటుంబ సభ్యులు, బంధువులు కాలేజీ ముందు ఆందోళన చేపట్టారు. విద్యార్థి సంఘాలు కూడా ఆందోళనలో పాల్గొన్నాయి. ర్యాంకుల పేరుతో తీవ్రమైన ఒత్తిడి తీసుకురావడంతోనే శివాని బలవన్మరణానికి పాల్పడిందని ఆరోపించారు. శివాని ఒత్తిడికి గురవుతున్న విషయాన్ని యాజమాన్యం తమకు తెలియజేలేదని మండిపడ్డారు. ఎంజీఎంలో పోస్ట్ మార్టం అనంతరం మృతదేహాన్ని స్వస్థలానికి తీసుకెళ్లారు.