
భైంసా, వెలుగు : నిర్మల్ జిల్లా భైంసాలోని గవర్నమెంట్ బీసీ కాలేజీ హాస్టల్లో శనివారం స్టూడెంట్ఒకరు పురుగుల మందు తాగి ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డాడు. వార్డెన్ రాజు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం... ముథోల్ మండలం బ్రహ్మణ్ గావ్ గ్రామానికి చెందిన శ్రీకాంత్ (16) బీసీ కాలేజీ హాస్టల్లో ఉంటూ ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు. శనివారం తన మిత్రుని ఇంట్లో జరుగుతున్న వివాహ వేడుకలకు వెళ్లేందుకు పేరెంట్స్కు ఫోన్ చేసి డబ్బులు కావాలని అడిగాడు. పరీక్షలు ఉన్నప్పుడు ఎక్కడికి వెళ్లకుండా బుద్ధిగా చదువుకోవాలని చెప్పగా.. డబ్బులు కావాలని మారం వేశాడు. పరీక్షలు బాగా రాసి మంచి మార్కులు తెచ్చుకోవాలని, డబ్బులు కూడా ఇబ్బందిగా ఉందని సముదాయించారు. ఫోన్ కట్ అయిన తర్వాత శ్రీకాంత్ హాస్టల్ బిల్డింగ్ పై ఉన్న స్టోర్ రూమ్లో ఉన్న పురుగుల మందు తీసుకొని తాగి ఆత్మహత్యకు యత్నించాడు. గుర్తించిన తోటి స్టూడెంట్స్, స్థానికులు వెంటనే ఏరియా హాస్పిటల్కు తరలించి చికిత్సలు అందించారు. ఎలాంటి ప్రమాదం లేదని వైద్యులు తెలిపారు.