- ఆదివారం కాలేజీ నుంచి అదృశ్యం.. సోమవారం మృతదేహం లభ్యం
- వనపర్తి జిల్లా కొత్తకోట మండలంలో ఘటన
కొత్తకోట/వనపర్తి టౌన్, వెలుగు : కాల్వలో పడి ఓ ఇంటర్ స్టూడెంట్ చనిపోయాడు. ఈ ఘటన వనపర్తి జిల్లా కొత్తకోట మండలం అమడబాకులలో సోమవారం జరిగింది. వివరాల్లోకి వెళ్తే... మహబూబ్‌నగర్‌కు చెందిన నవీన్‌కుమార్ (16) అమడబాకుల శివారులోని మైనార్టీ బాయ్స్ జూనియర్ కాలేజీలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు. ఆదివారం సాయంత్రం స్టడీ అవర్ టైంలో అటెండెన్స్ తీసుకుంటుండగా నవీన్‌కుమార్ కనిపించలేదు.
కాలేజీ సిబ్బంది, లెక్చరర్లు చుట్టుపక్కల ఎంత వెదికినా నవీన్ ఆచూకీ దొరకకపోవడంతో తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చిన అనంతరం రాత్రి 7 గంటలకు కొత్తకోట పోలీసులకు ఫిర్యాదు చేశారు. సోమవారం ఉదయం అమడబాకుల సమీపంలో ఉన్న ఓ కాల్వలో స్టూడెంట్ మృతదేహం ఉన్నట్లు గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు ఘటనాస్థలానికి చేరుకొని కాలేజీ ప్రిన్సిపాల్ షా అంజుమ్‌కు సమాచారం ఇవ్వగా... చనిపోయింది స్టూడెంట్ నవీన్‌గా గుర్తించారు.
మృతుడి తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఎస్సై ఆనంద్ తెలిపారు. కాగా, కాలేజీ సిబ్బంది నిర్లక్ష్యం కారణంగానే స్టూడెంట్ చనిపోయాడని ఎమ్మార్పీఎస్, ఎంఎస్ఎఫ్ నాయకులు ఆరోపించారు. వనపర్తి జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చిన ఆర్డీవో సుబ్రహ్మణ్యం, మైనార్టీ సంక్షేమశాఖ అధికారి అఫ్జలుద్దీన్, తహసీల్దార్ రమేశ్ రెడ్డితో వాగ్వాదానికి దిగారు. స్టూడెంట్ మృతికి కారణమైన వారిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.
