
ఇంటర్మీడియట్ విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడటంపై హైకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది.’ప్రతి సమస్యకూ పరిష్కారం ఉంటుంది. సమస్య ఏదైనా చావు మాత్రం పరిష్కారం కాదు. పిల్లలంతా ధైర్యం గా ఉండాలి. కన్నపిల్లలు ఆత్మహత్యలకు పాల్పడితే వాళ్ల శవాల్ని ఎత్తుకుని మోసేందుకు ఏ తల్లిదండ్రులకూ చేతులు రావు. కళ్ల ముందు తిరిగే బిడ్డలు శవాలై కనిపిస్తే ఏ తల్లిదండ్రులకైనా గుండె కోతే. ఎవరూ దాన్ని భరించలేరు. జీవితాంతం మనోవేదనతో తల్లిడిల్లుతూనే ఉంటారు. అది తీరని గుండె కోతే. పిల్లలు ఆత్మహత్యలకు పాల్పడొద్దు. ధైర్యంగా ఉండాలి. సాఫ్ట్‌వేర్ సమస్య కారణంగా ఈపరిస్థితి తలెత్తిందని ప్రభుత్వం చెబుతోంది. ముందుగానే ఒక నిర్ణయానికి వచ్చేయడం సరికాదు. అన్ని పత్రాల్ని తిరిగి మూల్యాంకనం చేయాలని ఈదశలో కోరడమూ సబబు కాదు. అయినా ఆత్మహత్యలకు ప్రభుత్వం బాధ్యత వహిస్తుందని భావిస్తున్నాం” అని పేర్కొంది. ప్రభుత్వం చేయాల్సిన పనిని చేయనివ్వాలని అభిప్రాయపడింది. ఫెయిలైన విద్యార్థుల కౌంటింగ్ చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం , ఇంటర్ బోర్డులు హైకోర్టుకు హామీ ఇచ్చాయి. ఈకేసును 8న తిరిగి విచారిస్తామని కోర్టు చెప్పింది. రీ వెరిఫికేషన్/రీ కౌటింగ్‌ల్లో ఎందరు పాసైందీ నివేదిక ద్వారా తెలియజేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఆన్సర్ షీట్లన్నింటినీ రీ వాల్యుయేషన్ చేయాలన్న విజ్ఞప్తిపై ఆ తర్వాత ఆలోచన చేయొచ్చని ధర్మాసనం పేర్కొంది. ఇంటర్ పేపర్లను సరిగాదిద్దక విద్యార్థులు నష్టపోయారని, ఆత్మహత్యలు చేసుకున్నారని, బాధ్యులపై క్రిమినల్ కేసులు పెట్టాలని, ఆత్మహత్యలకు పాల్పడిన వారి కుటుంబాలకు రూ.50 లక్షలు చొప్పున ప్రభుత్వం పరిహారం చెల్లించేలా ఆదేశాలివ్వాలని కోరుతూ బాలల హక్కుల సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు పి.అచ్యుతరావు వేసిన పిల్‌ను తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్ర సింగ్ చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్ ఎ.రాజశేఖర్‌రెడ్డిల డివిజన్ బెంచ్ సోమవారం మళ్లీ విచారించింది. రీ వాల్యుయేషన్ కోరే స్టూడెంట్ల నుంచి ఫీజు తీసుకోవడం లేదని ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేసింది.ఇంటర్ పరీక్షలు రాసిన అందరి ఆన్సర్ షీట్లూ మళ్లీ దిద్దేలా ఉత్తర్వులివ్వాలని పిటిషనర్ తరఫు లాయర్ దామోదర్‌రెడ్డి కోరారు. ఆత్మహత్య చేసుకున్న స్టూడెంట్ల ఆన్సర్ షీట్లను హైకోర్టు ముందుంచేలా ప్రభుత్వాన్ని ఆదేశాంచాలని వాదించారు. రీ వెరిఫికేషన్, రీకౌంటింగ్‌తో సమస్య పరిష్కారం అవుతుందని కోర్టు ఆశాభావం వ్యక్తం చేసింది. విచారణకు విద్యా శాఖ కార్యదర్శి జనార్దన్‌రెడ్డి, ఇంటర్ బోర్డు కార్యదర్శి అశోక్ హాజరయ్యారు.