- అట్టహాసంగా చెక్కుల పంపిణీ
లక్సెట్టిపేట, వెలుగు: మహిళలు ఆర్థికాభివృద్ధి సాధించేలా రాష్ట్ర ప్రభుత్వం వడ్డీ లేని రుణాలు అందజేస్తోందని మంచిర్యాల కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. మంగళవారం లక్సెట్టిపేట మండల పరిషత్ కార్యాలయం ఆవరణలో స్వయం సహాయక సంఘాల మహిళలకు వడ్డీ లేని రుణాల చెక్కులు పంపిణీ చేశారు.
నియోజకవర్గంలోని 1618 స్వయం సహాయక సంఘాలకు రూ.కోటి 43 లక్షల 61 వేల చెక్కును అందజేశారు. జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి కిషన్, స్పెషల్ ఆఫీసర్ అవినాశ్, తహసీల్దార్ దిలీప్ కుమార్, ఎంపీడీవో సరోజ, కాంగ్రెస్ నాయకులు త్రిమూర్తి, అంకతి శ్రీనివాస్, పి.రమేశ్, ఎండీ ఆరిఫ్, బి.తిరుపతి, అశోక్ తదితరులు పాల్గొన్నారు.
మహిళలు ఆర్థికాభివృద్ధి సాధిస్తేనే ప్రగతి
బెల్లంపల్లి, వెలుగు: మహిళలు ఆర్థికాభివృద్ధి సాధిస్తేనే ప్రగతి సాధ్యమని బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ అన్నారు. కోటి మంది ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి వడ్డీలేని రుణాలను ప్రభుత్వం ఇస్తోందన్నారు. బెల్లంపల్లి సబ్ కలెక్టర్మనోజ్తో కలిసి నియోజకవర్గ పరిధిలోని 2671 స్వయం సహాయక సంఘాలకు రూ.2.31 కోట్ల వడ్డీ లేని రుణాల చెక్కును అందజేశారు. ఏపీఎం విజయలక్ష్మి, కాంగ్రెస్ నాయకులు కె.రాంచందర్, నాతరి స్వామి, బి.రవి పాల్గొన్నారు.
మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యం: ఎమ్మెల్యే పాయల్ శంకర్
ఆదిలాబాద్, వెలుగు: మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం వడ్డీలేని రుణాలు అందిస్తోందని ఆదిలాబాద్ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. ఆదిలాబాద్ రూరల్ ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహించిన స్వయం సహాయక సంఘాల మహిళలకు వడ్డీలేని రుణాల పంపిణీ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్లు శ్యామలాదేవి, రాజేశ్వర్‌తో కలిసి పాల్గొన్నారు. జిల్లాకు కేటాయించిన రూ. 3.03 కోట్ల చెక్కులను మహిళా సంఘాలకు అందజేశారు. డీఆర్డీవో రవీందర్, ఎంపీడీవో వంశీ కృష్ణ, మహిళా సంఘాల సభ్యులు పాల్గొన్నారు.
వడ్డీ లేని రుణాలతో మహిళలు వ్యాపారవేత్తలుగా ఎదగాలి
జైపూర్, వెలుగు: వడ్డీ లేని రుణాలతో మహిళలు గొప్ప వ్యాపారవేత్తలుగా ఎదగాలని మంచిర్యాల ఆర్డీవో శ్రీనివాస్ రావు అన్నారు. జైపూర్ మండల కేంద్రంలోని రైతు వేదికలో చెన్నూరు నియోజకవర్గంలోని మందమర్రి, చెన్నూర్, భీమారం, కోటపల్లి, జైపూర్ మహిళా స్వయం సహాయ సభ్యులకు రూ.కోటీ 53 కోట్ల 73 వేల వడ్డీలేని రుణాల చెక్కును మహిళలకు అందచేశారు.
వడ్డీలేని రుణాలను మహిళలు సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా అభివృద్ధి చెందాలన్నారు. తహసీల్దార్లు వనజా రెడ్డి, సతీశ్‌కుమార్, మల్లికార్జున్, రాఘవేందర్ రావు, సదానందం, ఎంపీడీవో తదితరులు పాల్గొన్నారు.
