
- గత తీర్పులు, ఇతర రాష్ట్రాల రిజర్వేషన్లు ప్రస్తావించేందుకు ఏర్పాట్లు
- వెయిట్ అండ్ సీ’ధోరణిలో ప్రతిపక్షాలు
- ఇప్పటికే స్థానిక ఎన్నికలకు షెడ్యూల్ ఇచ్చిన ఎస్ఈసీ.. డైలమాలో ఆశావహులు
హైదరాబాద్, వెలుగు: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల పెంపుపై ఈ నెల 8న హైకోర్టు ఏం చెబుతుందనేది ఉత్కంఠ రేపుతున్నది. బీసీ రిజర్వేషన్లను 42శాతానికి పెంచుతూ ఇచ్చిన జీవో నంబర్ 9కి కోర్టు గ్రీన్‌సిగ్నల్ ఇస్తుందా? లేదంటే జీవో అమలును నిలిపేస్తుందా? ఒకవేళ జీవోపై హైకోర్టు స్టే ఇస్తే షెడ్యూల్‌ప్రకారం ఎన్నికలు జరుగుతాయా? వాయిదా పడ్తాయా? ప్రభుత్వం దగ్గర ఉన్న ప్రత్యామ్నాయ వ్యూహం ఏంటి? అనే చర్చ జరుగుతున్నది.
నిజానికి సెప్టెంబర్ 29నే రాష్ట్ర ఎన్నికల సంఘం లోకల్‌బాడీ ఎలక్షన్ షెడ్యూల్ ప్రకటించింది. పెరిగిన రిజర్వేషన్ల ప్రకారం బీసీలకు, 2011 జనాభా లెక్కల ప్రకారం ఎస్సీ, ఎస్టీలకు స్థానాలను (సుమారు 69%) కేటాయిస్తూ గెజిట్కూడా విడుదలైంది. దీంతో ఆయాచోట్ల పోటీచేసేందుకు కొందరు ఆశావహులు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అదే సమయంలో జీవోకు వ్యతిరేకంగా కోర్టు తీర్పు వస్తే రిజర్వేషన్లు తారుమారవుతాయని ఆందోళన చెందుతున్నారు. ఎంతకైనా మంచిది కోర్టు తీర్పు తర్వాత ఆలోచిద్దామని మరికొందరు ఆశావహులు ఆలోచిస్తున్నారు. ఈ నెల 8న హైకోర్టు ఏం చెబుతుందో చూశాకే ఒక నిర్ణయానికి రావాలని భావిస్తున్నారు. ప్రతిపక్షాలు ‘వెయిట్ అండ్ సీ’ ధోరణిలో ఉన్నాయి.
బీసీ రిజర్వేషన్లకు అనుకూలంగానే తీర్పు వస్తుందని భావిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం.. ఎందుకైనా మంచిదని ప్లాన్‌బీ కూడా రెడీ చేసుకున్నట్లు తెలు స్తున్నది. ఒకవేళ బీసీ రిజర్వేషన్ల జీవోపై కోర్టు స్టే ఇస్తే సుప్రీం నిబంధనలకు తగ్గట్టు బీసీలకు వచ్చే 22శాతం రిజర్వేషన్లు పోగా, మిగిలిన 20% రిజర్వేషన్లు పార్టీపరంగా ఇవ్వాలనుకుంటున్నది. ఇప్పటికే రిజర్వేషన్లు ఖరారైన స్థానాల్లోంచే కాంగ్రెస్ పార్టీ పరంగా రిజర్వేషన్లు ఇస్తూ, మిగి లిన పార్టీలు కూడా ఇచ్చేలా ఒప్పించాలని భావి స్తున్నది. తద్వారా కోర్టు తీర్పెలా వచ్చినా షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు జరిగేలా ముందుకెళ్తున్నదని అధికారవర్గాలు చెప్తున్నాయి.
ఎవిడెన్స్‌తో సర్కార్!
కోర్టు తీర్పు అనుకూలంగా వస్తుందనే ధీమాతో కాంగ్రెస్ ఉంది. ఇందుకోసం ప్రభుత్వం తరఫున అన్ని రకాలుగా రిజర్వేషన్ల పెంపు సరైందేనని కోర్టుకు చెప్పేందుకు సిద్ధమైంది. తమిళనాడులో అమలవుతున్న రిజర్వేషన్లతో పాటు దేశవ్యాప్తంగా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లకు ఇచ్చిన సడలింపుతో ఎప్పుడో పరిమితి 50 శాతం దాటిందనేది కూడా తెలియజేయనుంది. ఇక గవర్నర్, రాష్ట్రపతి దగ్గర బిల్లులు పెండింగ్ లో ఉన్నప్పుడు జీవో ఇవ్వవచ్చా అనేదానిపై కూడా అంతా సిద్ధం చేసుకున్నది.
గతంలో ఎస్టీల రిజర్వేషన్ల పెంపు బిల్లు రాష్ట్రపతి దగ్గర పెండింగ్‌లో ఉండగానే గత ప్రభుత్వం జీవో ఇచ్చి అమలు చేసింది. ఇదే విషయాన్ని కోర్టుకు ప్రస్తుత ప్రభుత్వం తెలియజేయనుంది. ఫలితంగా అనుకూలమైన తీర్పే వస్తుందని అధికార వర్గాలు భావిస్తున్నాయి. ఇందుకోసం ఉన్నతాధికారులు కూడా గతంలో ఉన్న సుప్రీం తీర్పులు, ఇతర రాష్ట్రాల్లో పెండింగ్ బిల్లుల విషయంలో ఇచ్చిన జీవోలను పరిశీలిస్తున్నట్లు తెలిసింది. .