
ముంబై: ఆర్ బీఐ ఇటీవల రెపోరేటును పావుశాతం తగ్గించడంతో బ్యాంకులు కూడా ఆ ప్రయోజనాన్ని తమ ఖాతాదారులకు బదిలీ చేస్తున్నాయి. ప్రభుత్వబ్యాంకు ఎస్‌బీఐ మంగళవారం తన మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్‌డ్ లెండింగ్ రేట్ (ఎంసీఎల్ ఆర్ )ను, హోంలోన్ రేట్లను తగ్గిస్తున్నట్టు ప్రకటించింది.కొత్త రేట్లు బుధవారం నుంచే అమల్లోకి వస్తున్నాయని తెలిపింది. ఎంసీఎల్ఆర్ కు సంబంధించిన అన్ని లోన్లపై వడ్డీరేట్లు ఐదు బేసిస్ పాయింట్లు తగ్గుతాయి. రూ.30 లక్షల వరకు ఉన్న హౌసింగ్‌లోన్ల వడ్డీరేట్లను 10 బేసిస్ పాయింట్ల వరకు తగ్గిస్తారు. ఇక నుంచి వడ్డీరేటు 8.90 శాతం నుం చి8.60 శాతానికి తగ్గుతుంది. ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు కూడా ఎంసీఎల్ ఆర్ ను ఐదు బేసిస్ పాయింట్లు తగ్గించింది. ఏడాది కాలపరిమితిగల లోన్లకు వడ్డీరేట్లు తగ్గుతాయని తెలిపింది.ఫలితంగా హౌసింగ్, వెహికిల్ వంటి లోన్లు చవకఅవుతాయని తెలిపింది. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర గతవారం ఎంసీఎల్ ఆర్ ను తగ్గించింది. ఈ నెలఏడు నుంచి కొత్త రేట్లు అమల్లోకి వచ్చాయి. మరికొన్ని బ్యాంకులు కూడా ఎంసీఎల్ ఆర్ ను తగ్గించే అవకాశాలు ఉన్నాయని ఆర్థికరంగ నిపుణులు చెబుతున్నారు. వృద్ధిరేటుతో పాటు ద్రవ్యోల్బణం తక్కువగా ఉండడంతో ఆర్ బీఐ గత వారం కీలక రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించడం తెలిసింది.ఫలితంగా రెపోరేటు ఆరు శాతానికి తగ్గింది.