నటనపై ఇష్టం అలా వచ్చింది : తాన్యా మణిక్తల

నటనపై ఇష్టం అలా వచ్చింది : తాన్యా మణిక్తల

చారెడేసి కళ్లు, నుదిటి మీద బొట్టు, ముక్కుకు ముక్కెర, అందమైన నవ్వు, ఆకట్టుకునే నటనతో మెస్మరైజ్ చేస్తోంది తాన్యా మణిక్తల. వీధి నాటకాల నుంచి, యూట్యూబ్, వెబ్​ సిరీస్​లు, ఇప్పుడు సినిమాల వరకు ఇంట్రెస్టింగ్ జర్నీ తనది. ఇంగ్లీష్​ లిటరేచర్​ చదివి, యాక్టింగ్​ కెరీర్​గా ఎంచుకుంది.

‘‘మాది ఢిల్లీ. శివాజీ కాలేజ్‌లో ఇంగ్లీష్‌ లిటరేచర్‌ డిగ్రీ చదివా. ఆ తర్వాత ‘ది సోషల్‌ రష్‌’ అనే మీడియా వెబ్‌సైట్‌లో కాపీ రైటర్‌గా చేరా. 2018లో నా పేరుతో ఒక యూట్యూబ్‌ ఛానెల్‌ పెట్టా. ఆ ఛానెల్‌ పెట్టడం వల్లే నాకు ‘ఫ్లేమ్స్‌’ సిరీస్‌లో నటించే అవకాశం వచ్చింది. అదే టైంలో ‘ది టైమ్‌లైనర్స్‌’ అనే యూట్యూబ్‌ ఛానెల్‌లోనూ ఆఫర్ వచ్చింది. ఈ రెండింటితో డిజిటల్‌ మీడియా ఆడియెన్స్​కి దగ్గరయ్యా. ‘ఫ్లేమ్స్’ మొదటి సీజన్ అప్పుడు నేను చదువుకుంటున్నా. అందులో నా క్యారెక్టర్​ ‘ఇషిత’ కూడా కాలేజీ స్టూడెంట్​. ఆ క్యారెక్టర్​ నా బెస్ట్​ ఫ్రెండ్​ అయిపోయింది. టీనేజీ అమ్మాయి నుంచి వయసు పెరిగేకొద్దీ క్యారెక్టర్​లో మార్పు కనిపిస్తుంది. ఈ ఏడాది అక్టోబర్​లో ‘ఫ్లేమ్స్’ సీజన్​3 కూడా రిలీజ్​ అయింది. ‘ఫ్లేమ్స్‌’తో సంపాదించుకున్న అభిమానమే ఆ సిరీస్‌ సీక్వెల్స్​లోనూ నటించేందుకు ఛాన్స్ ఇచ్చింది. 

నటనపై ఇష్టం.. అలా వచ్చింది

నిజానికి నాకంటే మా అక్కకి నాటకాలు, సినిమాలు చూడటమంటే చాలా ఇష్టం. తనతోపాటు నన్ను తీసుకెళ్లేది. అలా నాకు నాటకాల మీద ఇంట్రెస్ట్​ పెరిగింది. చిన్నప్పుడు స్టేజీ మీద ఫ్యాషన్​ షో, డాన్స్ పర్ఫార్మెన్స్ చేసేదాన్ని. కాలేజీలో ఉన్నప్పుడు ఒకసారి స్టేజీ మీద పర్ఫార్మ్​ చేసే ఛాన్స్ వచ్చింది. కానీ, సీనియర్స్ గోల చేయడంతో ఆడిటోరియం నుంచి బయటికెళ్లాల్సి వచ్చింది. ఆ తర్వాత ఒక ఏడాదిపాటు వీధి నాటకాల్లో నటించా. అప్పుడు నాకు శివమ్ పరిచయం అయ్యాడు. అతనికి ‘ఫ్లేమ్స్’​ డైరెక్షన్​ టీంలో ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్లకు శివమ్ నా నెంబర్ ఇచ్చాడు. అలా నాకు ఆడిషన్ కాల్ రావడం, సెలక్ట్​ అవ్వడం జరిగింది. అయితే, ఆ ఆడిషన్​ కాల్ వచ్చినప్పుడు భయపడ్డా.. ‘ఎవరు అడిగారు? నా పేరు ఎందుకు చెప్పారు?’ అని సీరియస్​ అయ్యా. వెళ్లడానికి అస్సలు ఇంట్రెస్ట్ చూపించలేదు. అప్పుడు కూడా మా అక్క నాకు నచ్చజెప్పి, ఆడిషన్​కి ఒప్పించింది. 

అటాచ్​మెంట్ ఎక్కువ


మా ఫ్యామిలీతో, ముఖ్యంగా నా తోబుట్టువులతో నాకు అటాచ్​మెంట్ చాలా ఎక్కువ. అక్క సాన్యా, అన్న అభిజిత్ హయ్యర్​ స్టడీస్​ కోసం ఫారిన్ వెళ్లడానికి రెడీ అవుతున్నారు. అప్పుడు నేను యాక్టింగ్​ చేస్తున్నా. అప్పటికి నా డిగ్రీ కూడా పూర్తి కాలేదు. ఇండస్ట్రీలో ఎవరూ తెలియదు. ఒక ప్రాజెక్ట్​ అయిపోతే.. రెండోది ఎప్పుడు వస్తుందో తెలియదు. అప్పటివరకు ఓపికగా ఎదురుచూడాలి. కానీ, నేనేమో ఒక క్లాస్​ అయిపోగానే నెక్స్ట్ క్లాస్​ ఎప్పుడు? అన్నట్టే నెక్స్ట్​ ప్రాజెక్ట్ కోసం ఎదురుచూసేదాన్ని. ఆ టైంలో అక్కని, అన్నని చాలా మిస్సయ్యేదాన్ని. వాళ్లు లేకుండా నేను ఇదంతా ఎలా చేయగలుగుతున్నా? అనిపించేది ఒక్కోసారి. 

ఫ్యూచర్​ లేదనిపించి..

మొదట్లో ఒక సిరీస్ చేస్తే చాలు.. ఆ తర్వాత ఆఫర్లు అవే వస్తాయనుకునేదాన్ని. ‘ఫ్లేమ్స్’ మొదటి సీజన్​ తర్వాత అదే ఉత్సాహంతో కొన్ని ఆడిషన్స్​కి వెళ్లా. కానీ, వాటిలో రిజెక్ట్​ అయ్యా. దాంతో ఇకపై నాకు యాక్టింగ్​లో ఫ్యూచర్​ లేదనిపించింది. అందుకని ఒక కంపెనీలో కాపీరైటర్​గా జాబ్ చేయడం మొదలుపెట్టా. కాపీరైటింగ్ జాబ్ చేసేటప్పుడు మెట్రోలో వెళ్లేదాన్ని. ఢిల్లీ నుంచి గుర్గావ్​కి జర్నీ అది. అప్పుడు పాటలు వింటూ ఎంజాయ్ చేసేదాన్ని. ఆ జాబ్ దాదాపు నాలుగు నెలలు చేశా.

 

టర్నింగ్​ పాయింట్​!

నేను నటించిన ‘ఎ సూటబుల్‌ బాయ్‌’ సిరీస్‌ను నవల ఆధారంగా తీశారు. నాకు పుస్తకాలు చదవడమంటే చాలా ఇష్టం. ఈ నవల రచయిత విక్రమ్‌ సేథ్‌ రాసిన బుక్స్‌ కొన్ని చదివా. ఇది మాత్రం చదవలేదు. ఒకరోజు మా యూనివర్సిటీ థియేటర్‌ గ్రూప్‌లో ఒక ఫ్రెండ్‌ ఫోన్‌ చేసి, ‘బీబీసీ వాళ్ల కోసం మీరా నాయర్‌ ఓ సిరీస్‌ తీస్తున్నారట. ఆడిషన్స్‌ ఉన్నాయి రా’ అని చెప్తే వెళ్లా. ఆడిషన్స్​లో ఫస్ట్‌ రౌండ్‌లో సెలక్ట్‌ అయ్యా. నన్ను మీరా నాయర్‌ ఇంటర్వ్యూ చేసి, అందులో సెలెక్ట్‌ అయ్యాక మళ్లీ ఆడిషన్స్‌ తీసుకుంటారని చెప్పింది ఆ టీం. 

ఆ తర్వాత ఆవిడ తీయబోయే సిరీస్‌ ‘ఎ సూటబుల్‌ బాయ్‌’ నవల అని తెలిసింది. అది వినగానే స్టన్ అయ్యా. ఎందుకంటే ఆ బుక్‌ చదవలేదు. మా ఫ్రెండ్‌తో చెప్తే ‘అయితేనేం? నేను చదివా’ అంటూ ఆ కథ మొత్తం నాకు చెప్పింది. ఆ తర్వాత నా ఇంటర్వ్యూ అయిపోయింది. నాకయితే ఈ ఆడిషన్స్‌లో సెలక్ట్ అవుతానని నమ్మకంలేదు. దాంతో నేను హయ్యర్ స్టడీస్​ కోసం ఆస్ట్రేలియా వెళ్లాలనుకున్నా. అక్కడికి వెళ్లడానికి పదిహేను రోజుల ముందు ఫైనల్ ఆడిషన్‌ కోసం కాల్ వచ్చింది. అందులో కూడా సెలక్ట్​ కావడంతో ‘లతా మెహ్రా’ పాత్రకు తీసుకున్నారు. అందుకని అప్పటి నుంచి నేను నా లైఫ్​ని ప్లాన్​ చేసుకోకూడదు అని డిసైడ్ అయ్యా. లైఫ్ ఇచ్చే అవకాశాలను అంకితభావంతో చేస్తూ వెళ్లాలనుకున్నా.  

అదో కొత్త అనుభూతి

‘చుట్జ్​పా’ డైరెక్టర్​ సిమర్​, నేను నాటకాల్లో కలిసి పనిచేశాం. అప్పుడు తను నా సీనియర్. ‘చుట్జ్​పా’లో నా రోల్ తను చెప్పినప్పుడు ఎగ్జైట్ అవ్వలేదు. ఆ తర్వాత కాస్త కన్విన్స్ చేసి, ఒప్పించాడు. ఎందుకంటే సిమర్ క్యారెక్టర్స్​ని ఎలా చూపిస్తాడో నాకు తెలుసు. చాలా సెన్సిటివ్​గా ఉంటాయి క్యారెక్టర్స్. అందుకే కొంచెం ఆలోచించా. అలాగే ఇందులో కో– యాక్టర్స్ ఎవరూ ఉండరు. కెమెరా ముందుకెళ్లి నటించి వచ్చేయాలి. అది చాలా ఛాలెంజింగ్​గా అనిపించింది. ఎందుకంటే కో–యాక్టర్స్ ఉంటే వాళ్ల రియాక్షన్​ని బట్టి నటించొచ్చు. కానీ, ఇక్కడ అలా లేదు. వాళ్లు ఉన్నట్టు, ఏదో చెప్తున్నట్టు ఊహించుకుని నటించాలి.’’ 

 నా గురించి...

మాది జాయింట్​ ఫ్యామిలీ.  హిందీ, ఇంగ్లీష్‌లాగే స్పానిష్‌ కూడా బాగా మాట్లాడతా.     ఎక్కడున్నా రోజూ పొద్దున్నే మెడిటేషన్ చేస్తా. రాత్రి పడుకునే ముందు మ్యూజిక్ వింటా.  నేను ఎప్పుడూ ఒక్కదాన్నే ఎక్కడికీ వెళ్లలేదు. ఒకసారి మాత్రం హరిద్వార్​కి సోలో ట్రిప్​ వెళ్లా. అది అనుకోకుండా జరిగింది. అది నేను చేసిన ఏకైక అడ్వెంచర్​.  విజయ్ సేతుపతి నటించిన ‘ముంబైకర్​’లో ఒక రోల్​లో కనిపించా.  వెబ్​ సిరీస్​ల విషయానికొస్తే.. 2018లో స్కూల్ డేస్ చేస్తున్నప్పుడు ‘ఫ్లేమ్స్’ ఆఫర్ వచ్చింది. తర్వాత ‘ఎ సూటబుల్ బాయ్’, ‘ఫీల్స్ లైక్​ ఇష్క్’, ‘చుట్జ్​పా’ చేశా.  ప్రజెంట్ ‘హౌ టు ఫాల్ ఇన్​ లవ్’, ‘మీనా’ వెబ్​ సిరీస్​లలో యాక్ట్ చేస్తున్నా. ఫీచర్స్ కూడా రాస్తున్నా.

‘‘ఒక నటిగా ఎదగాలంటే నా సత్తాని నిరూపించుకోవాలి. కెరీర్​లో​ ముందుకు వెళ్లేకొద్దీ కచ్చితంగా ఒత్తిడి ఉంటుంది. ఆ ఒత్తిడి ఉండటమే మంచిది. దానివల్లే ఇంకాస్త ఎక్కువ కష్టపడాలి అనిపిస్తుంది. కరోనా టైంలో ‘ఎ సూటబుల్ బాయ్​’ రిలీజ్​ అయింది. అప్పుడు దేశం మొత్తం లాక్​డౌన్​లో ఉంది. దాంతో అందరూ ఇండ్లలోనే ఉన్నారు. సినిమాలు, సిరీస్​లు చూస్తూ ప్యాండెమిక్ ఆలోచన నుంచి మైండ్​ని రిలాక్స్ చేసుకునే ప్రయత్నం చేశారు. అలా మా సిరీస్​ కూడా ఆడియెన్స్​కి బాగా రీచ్​ అయింది. అప్పుడు నాకు 24 ఏండ్లు. ఆ వయసులో ఒక కొత్త నటికి అది చాలా పెద్ద సక్సెస్​.’’