టెన్త్, ఇంటర్ పరీక్షలు జరిగేది డౌటే

V6 Velugu Posted on Apr 08, 2021

  • షెడ్యూల్ ప్రకారం మే 1 నుంచి ఇంటర్,
  • 17 నుంచి టెన్త్ పరీక్షలు జరగాలి
  • కరోనా కేసులు పెరుగుతుండటంతో ఎగ్జామ్స్ నిర్వహణపై అనుమానాలు 
  • సర్కార్ నిర్ణయం కోసం అధికారుల ఎదురుచూపులు
  • ఏదో ఒకటి వెంటనే తేల్చాలంటున్న విద్యార్థులు, తల్లిదండ్రులు
  • ఇప్పటికే ఇంటర్ ప్రాక్టికల్స్ వాయిదా
  • పరీక్షలు లేకుంటే మరెట్ల..?

గతేడాది పబ్లిక్ పరీక్షలు నిర్వహించకుండానే టెన్త్ స్టూడెంట్లకు ఇంటర్నల్ పరీక్షల్లోని మార్కుల ఆధారంగా జీపీఏ పాయింట్లు కేటాయించి పాస్ చేశారు.  ఇంటర్లో ఫెయిల్ అయిన వాళ్లను, ఫీజు కట్టి పరీక్ష రాయనోళ్లను కూడా సప్లిమెంటరీ లేకుండానే మినిమమ్ మార్కులతో పాస్ చేశారు. ఈసారి పరీక్షలు నిర్వహించకపోతే ఎట్ల పాస్ చేయొచ్చనే దానిపై అధికారులు ఆల్టర్నేట్ విధానాలనూ పరిశీలిస్తున్నారు. ఈ అకడమిక్ ఇయర్లో టెన్త్ స్టూడెంట్లకు ఇంటర్నల్ పరీక్షలు కూడా సరిగ్గా జరగలేదు. అయితే గతేడాది ఆంధ్రప్రదేశ్లో టెన్త్ స్టూడెంట్లకు  ఇంటర్నల్ ఎగ్జామ్స్ కూడా లేకుండానే పాస్ చేశారు. అదే విధానాన్ని మన రాష్ట్రంలోనూ అమలు చేయవచ్చనే భావనలో ఆఫీసర్లు ఉన్నారు. ఇక, ఇంటర్ ఫస్టియర్ స్టూడెంట్లను మినిమమ్ మార్కులతో పాస్ చేయవచ్చని, సెకండియర్ వారికి మాత్రం తప్పకుండా పరీక్షలు పెట్టాల్సిందేనని ఆఫీసర్లు చెప్తున్నారు. జూన్లో కరోనా కేసులు కొంచెమైనా తగ్గితే అప్పుడు  ఇంటర్ సెకండియర్ ఎగ్జామ్స్ నిర్వహించవచ్చని ఆలోచిస్తున్నారు.
 

హైదరాబాద్, వెలుగు: మే నెలలో జరగాల్సిన ఇంటర్, టెన్త్  పబ్లిక్ పరీక్షల నిర్వహణ కష్టమేనని తెలుస్తోంది. రాష్ట్రంలో రోజురోజుకూ కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతుండటంతో ప్రభుత్వం పరీక్షలు పెడుతుందా లేదా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.  ఎప్పటిలాగే పరీక్షలు జరిపేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నా, సర్కారు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనే చర్చ నడుస్తోంది. రాష్ట్రంలో షెడ్యూల్ ప్రకారం మే 1 నుంచి 19 వరకు ఇంటర్ ఫస్టియర్, మే 2 నుంచి 20 వరకు సెకండియర్ స్టూడెంట్లకు ఎగ్జామ్స్ జరగాల్సి ఉంది. టెన్త్ స్టూడెంట్లకు మే17 నుంచి 26 వరకు ఎగ్జామ్స్ నిర్వహించాల్సి ఉంది. అకడమిక్ ఇయర్ జూన్ లో ప్రారంభం కావాల్సి ఉన్నా కరోనా ఎఫెక్ట్తో సెప్టెంబర్ నుంచి ఆన్లైన్ క్లాసులు ప్రారంభమయ్యాయి. ఫిబ్రవరి ఫస్ట్ నుంచి స్కూళ్లు, కాలేజీలు ఓపెన్ చేసి ఫిజికల్ క్లాసులు స్టార్ట్ చేశారు. అయితే కరోనా కేసులు పెరుగడంతో  మార్చి 24 నుంచి స్కూళ్లు, కాలేజీలు, హాస్టళ్లు బంద్ చేసి  మళ్లీ ఆన్లైన్ క్లాసులను కంటిన్యూ చేస్తున్నారు. ఆన్ లైన్ క్లాసులు అర్థంకావడం లేదని చాలామంది స్టూడెంట్లు చెప్తున్నారు. ఇలాంటి సమయంలో ఎగ్జామ్స్ రాసినా పెద్దగా ఉపయోగం ఉండదని అంటున్నారు. మరోపక్క ప్రైవేటు స్కూళ్లలో తమ పిల్లల చదువులకు ఫీజులు కట్టాం కాబట్టి ఎగ్జామ్స్ పెట్టాలని చాలా మంది పేరెంట్స్ కోరుతున్నారు. పరీక్షలు పెట్టకపోతే మెరిట్ స్టూడెంట్లకు నష్టమేనని అంటున్నారు. రాష్ట్రంలో వారం, పదిరోజుల్లోనే రెండు వందల పాజిటివ్ కేసుల నుంచి సుమారు రెండు వేలవరకు పెరిగింది. ఏప్రిల్ నెలాఖరుతో పాటు మే నెలలో కరోనా కేసులు భారీగా పెరిగే అవకాశముందని హెల్త్ ఆఫీసర్లు చెప్తున్నారు. దీంతో ఇంటర్, టెన్త్ ఎగ్జామ్స్ నిర్వహణపై అనుమానాలు మొదలయ్యాయి. 
ప్రాక్టికల్స్ వాయిదా
రాష్ట్రంలో మొత్తం 2,464  జూనియర్ కాలేజీలుండగా.. వాటిలో ఫస్టియర్లో 4,14,628 మంది, సెకండియర్లో 4,54,648 మంది చదువుతున్నారు. అయితే సోమవారం నుంచి ప్రారంభం కావాల్సిన ప్రాక్టికల్ ఎగ్జామ్స్ ను కరోనా ఎఫెక్ట్తో వాయిదా వేస్తున్నట్లు ఇటీవల ఇంటర్ బోర్డు ప్రకటించింది. ఆ పరీక్షలను మే 29 నుంచి జూన్ 7 వరకు నిర్వహించనున్నట్లు తెలిపింది. మరోపక్క ఫస్టియర్ స్టూడెంట్లకు ఈ నెల 1న జరగాల్సిన ఎథిక్స్ అండ్ హ్యూమన్  వ్యాల్యూస్, ఈ నెల 3న జరగాల్సిన ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ ఎగ్జామ్స్ను ఇంటి నుంచే రాసుకునే వెసులుబాటు కలిపించింది. 
టెన్త్  ప్రీ ఫైనల్స్ కూడా అనుమానమే
రాష్ట్రంలో 11,747 హై స్కూళ్లుండగా వాటిలో 5.20 లక్షల మంది టెన్త్  చదువుతున్నారు. వీరికి మే ఫస్ట్ వీక్లో ప్రీఫైనల్ ఎగ్జామ్స్ నిర్వహించేందుకు పరీక్షల విభాగం అధికారులు షెడ్యూల్ ఇచ్చారు. అయితే కరోనా ఎఫెక్ట్తో ఈ ఎగ్జామ్స్ నిర్వహణ కూడా కష్టమేనని కొందరు ఆఫీసర్లు చెప్తున్నారు. మే నెలాఖరు వరకూ కేసులు తగ్గితే పబ్లిక్ పరీక్షలు నిర్వహించే చాన్స్ ఉందని అభిప్రాయపడుతున్నారు. 
సర్కారు నిర్ణయమే ఫైనల్ అంటున్న ఆఫీసర్లు
కరోనా కేసులు పెరుగుతున్నా షెడ్యూల్ ప్రకారం ఎగ్జామ్స్ నిర్వహించేందుకు ఇంటర్, టెన్త్ బోర్డులు ఏర్పాట్లు చేస్తున్నాయి. ఇప్పటికే ఇంటర్  కోసం 1,771 పరీక్షా కేంద్రాలు, టెన్త్  కోసం 3,900కు పైగా పరీక్షా కేంద్రాలను ఆఫీసర్లు రెడీ చేశారు. ఒక్కోరూమ్కు పది నుంచి 15 మందిలోపు, బెంచ్కి ఒక్కరు చొప్పున జిగ్ జాగ్ విధానంలో కూర్చోబెట్టాలని నిర్ణయించారు. అయితే తాము ఎన్ని ఏర్పాట్లు చేసినా సర్కారు నిర్ణయమే ఫైనల్ అని ఆఫీసర్లు చెప్తున్నారు. 

పెడితేనే బెటర్
టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవుతున్నం. ఎగ్జామ్స్ రాసి మంచి జీపీఏతో పాసైతేనే మాకు సబ్జెక్టుల మీద ఎంత పట్టుందో తెలుస్తుంది. ఎగ్జామ్స్ పెట్టకుండా అందరినీ పాస్ చేయడం కరెక్ట్ కాదు. టెన్త్ ఎగ్జామ్స్  రాయకుండానే పాస్ అయినోళ్లు ఇంటర్లో సబ్జెక్ట్లు అర్థం కాక ఇబ్బంది పడుతరు. స్టూడెంట్లకు  కరోనా సోకకుండా ఎక్కువ సెంటర్లు ఏర్పాటు చేసి కొవిడ్ రూల్స్ పాటిస్తూ ఎగ్జామ్స్ నిర్వహించాలి. – సాయి వినయశ్రీ, టెన్త్ స్టూడెంట్, మంబోజిపల్లి, మెదక్ జిల్లా

ఎగ్జామ్స్ పెట్టాలి
కష్టపడి చదువుతున్నం. ఆన్ లైన్ క్లాసులతో ఇబ్బందులు ఉన్నా ప్రిపేర్ అవుతున్నం. ఎంతకష్టమైన ఎగ్జా మ్స్ రాస్తం.  కరోనా రూల్స్కఠినంగా అమలు చేస్తూ ఎగ్జామ్స్ పెట్టాలి. -నల్లాల అక్షిత, టెన్త్ క్లాస్, సిరిసిల్ల జిల్లా
స్పష్టత ఇవ్వాలి 
కరోనా కేసులు పెరుగుతున్నందున మే ఫస్ట్ నుంచి జరగాల్సిన ఎగ్జామ్స్జరుగుతాయనే నమ్మకం లేదు. ప్రస్తుతం కరోనా కేసులు పెరుగుతాయని హెల్త్ ఆఫీసర్లు చెప్తున్నారు. కాబట్టి జాతీయ, రాష్ట్ర స్థాయి పోటీ పరీక్షలను దృష్టిలో పెట్టుకొని స్టూడెంట్లు నష్టపోకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. రానున్న మూడు నెలల్లో జరిగే పరిణామాలపై హెల్త్ ఆఫీసర్ల నుంచి రిపోర్టు తీసుకొని ఎగ్జామ్స్ నిర్వహణపై  ప్రభుత్వం వెంటనే స్పష్టత ఇవ్వాలి. -మధుసూదన్ రెడ్డి, ఇంటర్ విద్య జేఏసీ చైర్మన్
టైమ్ ఉంటే బాగుండు
ఈ ఏడాది పాఠాలన్నీ ఆన్ లైన్లోనే చెప్పిర్రు. సిలబస్ రివిజన్ చేయలేదు. అప్పుడే ఎగ్జామ్స్ వచ్చినయ్. మరో వైపు కరోనా కేసులు పెరుగుతున్నయ్. ఇంకా కొంచెం టైమ్ ఉంటే బాగుండు. -బెల్లంకొండ ఆకాంక్ష, టెన్త్ క్లాస్, హుజూర్ నగర్, సూర్యాపేట జిల్లా.

పెట్టకపోవుడే మంచిది
మా పాప ఇంటర్ చదువుతున్నది. కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నయ్. మొన్నటి దాకా స్టూడెంట్లకూ కరోనా వచ్చింది. ఎగ్జామ్స్ టైంల ఒక్కో సెంటర్ల వందల మంది స్టూడెంట్స్ ఉంటరు కాబట్టి పరేషాన్ అయితది. ఎక్కువ మందికి వైరస్ అంటుకునే చాన్స్ ఉంటది. అందుకని ఇప్పుడు ఎగ్జామ్స్ పెట్టకపోవుడే మంచిది. -రాంచందర్ గౌడ్, పేరెంట్, చెన్నాపూర్, మెదక్ జిల్లా         

తర్వాతైనా పెట్టాలి
మా కూతురు సర్కారు జూనియర్ కాలేజీలో ఇంటర్ ఫస్టియర్ చదువుతున్నది.  ఎగ్జామ్స్కు ప్రిపేర్ అవుతున్నది. గవర్నమెంట్ ఎగ్జామ్స్ పెడుతుందా? లేదా? అన్నది అర్థమైతలేదు. కరోనా కేసులు పెరుగుతున్నందున ఇబ్బందయితది  అనుకుంటే పోస్ట్పోన్ చేసి, తర్వాత అయినా ఎగ్జామ్స్ పెట్టాలి. అందరిని పాస్ చేస్తే కష్టపడి చదివిన స్టూడెంట్స్ నష్టపోతరు. -ముయాడి శ్రీనివాస్, పేరెంట్, శివ్వంపేట, మెదక్ 

Tagged Telangana, education, exams, study, coronavirus, intermediate exams, 10th exams

More News