సీఎంఆర్ లక్ష్యాలు త్వరగా పూర్తిచేయాలి : కలెక్టర్ కుమార్ దీపక్

సీఎంఆర్ లక్ష్యాలు త్వరగా పూర్తిచేయాలి : కలెక్టర్ కుమార్ దీపక్
  • కలెక్టర్ కుమార్ దీపక్

మంచిర్యాల/లక్సెట్టిపేట, వెలుగు: జిల్లాలోని రైస్ మిల్లులకు కేటాయించిన సీఎంఆర్ లక్ష్యాలను త్వరగా పూర్తిచేయాలని మంచిర్యాల కలెక్టర్ కుమార్ దీపక్ సూచించారు. మంగళవారం కలెక్టరేట్​లో అడిషనల్ కలెక్టర్ పి.చంద్రయ్య, జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి బ్రహ్మారావు, జిల్లా మేనేజర్ శ్రీకళతో కలిసి వైస్ మిల్లర్ల సంఘం ప్రతినిధులు, రైస్ మిల్లర్లతో రివ్యూ నిర్వహించారు. జిల్లాలోని రైస్ మిల్లులకు కేటాయించిన సీఎంఆర్ లక్ష్యాలను త్వరగా పూర్తిచేయాలన్నారు. ఇందుకు సంబంధిత శాఖల అధికారులు రైస్ మిల్లర్లు సమన్వయంతో పనిచేయాలన్నారు. వానాకాలం ధాన్యం కొనుగోలు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని తెలిపారు. బ్యాంకు గ్యారంటీ, డీఫాల్టర్ గా ఉన్న రైస్ మిల్లులకు ధాన్యం కేటాయించమని స్పష్టం చేశారు. రైస్ మిల్లుల వారీగా పెండింగ్ ఉన్న సీఎంఆర్ వివరాలను పరిశీలించారు.

హైవే విస్తరణ ప్రక్రియ స్పీడప్ చేయాలి

జిల్లాలో జాతీయ రహదారి విస్తరణ ప్రక్రియను స్పీడప్ చేయాలని, ప్రభావిత గ్రామాల్లో అవార్డుల జారీ ప్రక్రియ త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ కుమార్ దీపక్ అధికారులను ఆదేశించారు. మంగళవారం మంచిర్యాల ఆర్డీవో ఆఫీస్​లో అర్డీఓ శ్రీనివాస్ రావుతో కలిసి జాతీయ రహదారి విస్తరణలో ఆర్బిట్రేషన్ రికార్డులను పరిశీలించారు.

విద్యార్థులకు ఉత్తమ విద్యాబోధనే ప్రభుత్వ లక్ష్యం

ప్రభుత్వ విద్యాసంస్థలను బలోపేతం చేస్తూ విద్యార్థులకు అన్ని సదుపాయాలతో కూడిన ఉత్తమ విద్య అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోం దని కలెక్టర్ అన్నారు. మంగళవారం లక్సెట్టిపేటలోని కేజీబీవీని ఆకస్మికంగా సందర్శించి క్లాస్​రూమ్​లు, కిచెన్, మధ్యాహ్న భోజనం నాణ్యత, రిజిస్టర్లు, పరిసరాలను పరిశీలించారు. ప్రభుత్వ స్కూళ్లు, సంక్షేమ వసతి గృహాల్లో అన్ని సదుపాయాలు కల్పించి నిష్ణాతులైన టీచర్లతో ఉత్తమ విద్య అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. విద్యార్థులకు మెనూ ప్రకారం సకాలంలో పోషకాహారం అందించాలని, శుద్ధమైన తాగునీరు అందుబాటులో ఉంచాలని, వారి ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని సిబ్బందికి సూచించారు.