
- కపాస్ కిసాన్ యాప్‌పై అవగాహన కల్పించాలి: కలెక్టర్ అభిలాష
నిర్మల్, వెలుగు: పత్తి పంట కొనుగోలు ప్రక్రియలో రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని నిర్మల్ కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులు ఆదేశించారు. పత్తి, సోయాబీన్, మొక్కజొన్న పంటల కొనుగోలు ప్రక్రియపై మంగళవారం సాయంత్రం కలెక్టరేట్‌లో రివ్యూ నిర్వహించారు. పత్తి కొనుగోళ్లను నిర్ణీత సమయానికి పూర్తిచేయాలన్నారు. రైతులు అమ్మాకాలు చేపట్టేలా రూపొందించిన ‘కపాస్ కిసాన్’ యాప్ వినియోగంపై రైతులకు విస్తృత అవగాహన కల్పించాలని ఆదేశించారు. రైతులు పత్తి అమ్మకాలకు సంబంధించి టోల్ ఫ్రీ నంబర్ 1800-599-5779 లేదా వాట్సప్ 8897281111ను సంప్రదించి సమాచారం పొందవచ్చని తెలిపారు.
తేమ శాతం విషయంలో రైతులు నష్టపోకుండా వారికి పూర్తి వివరాలు ముందుగానే తెలియజేయాలని సూచించారు. రైతులు పంటలు అమ్మిన వెంటనే డబ్బులు చెల్లించేలా చర్యలు తీసుకోవాలన్నారు. మొక్కజొన్న, సోయాబీన్ కొనుగోళ్లకు సైతం ముందస్తు ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. త్వరలోనే కేంద్రాలు ఏర్పాటు చేసి కొనుగోలు చేస్తామని తెలిపారు. ప్రైవేట్ వ్యక్తులకు విక్రయించి నష్టపోవద్దన్నారు.
ఈ సందర్భంగా కపాస్ కిసాన్ వాల్ పోస్టర్లను అధికారులతో కలిసి ఆవిష్కరించారు. సమావేశంలో అడిషనల్ కలెక్టర్ కిశోర్ కుమార్, భైంసా సబ్ కలెక్టర్ సంకేత్ కుమార్, మార్కెటింగ్ అధికారి గజానంద్, ఆర్డీవో రత్నకల్యాణి, మార్క్ఫోడ్ అధికారి ప్రవీణ్ రెడ్డి, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్లు భీంరెడ్డి, అబ్దుల్ హాదీ, జిన్నింగ్ మిల్లుల యజమానులు తదితరులు పాల్గొన్నారు.