ఇంటర్ బోర్డు కీలక నిర్ణయం.. ఎంట్రెన్స్ టెస్టుల్లో ప్రశ్నలు రాని.. సిలబస్ ఎత్తివేత!

ఇంటర్ బోర్డు కీలక నిర్ణయం.. ఎంట్రెన్స్ టెస్టుల్లో ప్రశ్నలు రాని.. సిలబస్ ఎత్తివేత!

హైదరాబాద్, వెలుగు: ఇంటర్మీడియెట్​లో వివిధ సబ్జెక్టుల్లో భారీగా ఉన్న సిలబస్​కు కోత పెట్టేందుకు ఇంటర్ బోర్డు రంగం సిద్ధం చేసింది. కొంతకాలంగా జేఈఈ, నీట్, ఎప్ సెట్ సహా పలు ఎంట్రెన్స్ టెస్టుల్లో క్వశ్చన్లు రాని, ప్రాధాన్యత లేని సిలబస్​ను తొలగించాలని నిర్ణయించింది. ఈ కొత్త సిలబస్ ను 2026–27 విద్యా సంవత్సరం నుంచి అమల్లోకి తీసుకురానున్నది. ఈ పుస్తకాల్లో క్యూఆర్ కోడ్ ను ముద్రిస్తున్నారు. దీనికితోడు క్వాలిటీ పేపర్​తో పుస్తకాలను ప్రింట్ చేయించాలని ఇంటర్ బోర్డు డిసైడ్ అయింది. 

కేంద్ర ప్రభుత్వ పరిధిలోని ఎన్​సీఈఆర్టీ ఇంటర్ సిలబస్ లో మార్పులు చేసింది. దీన్ని తెలంగాణ ఇంటర్ పుస్తకాల్లో అమలు చేయాల్సి ఉంది. అయితే, 2023లోనే కొత్త సిలబస్​ తీసుకురావాలని ఇంటర్ బోర్డు కమిటీ తీర్మానించింది. కానీ, సిలబస్ తయారీలో ఆలస్యం, ఉన్నతాధికారుల నుంచి సకాలంలో పర్మిషన్ రాకపోవడంతో 2025–26లో అమలు చేయలేదు. దీంతో తాజాగా కేంద్ర నిర్ణయాలకు అనుగుణంగా సిలబస్​లో మరిన్ని మార్పులు చేయాలని ఇంటర్ బోర్డు నిర్ణయించింది. 

దీనికి అనుగుణంగా 80:20 నిష్పత్తిలో సిలబస్ లో మార్పులు చేయాలని డిసైడ్ అయింది. ప్రధానంగా ఫిజిక్స్, కెమిస్ట్రీ, జువాలజీ, బాటనీతో పాటు కామర్స్, ఎకానమిక్స్ తదితర సబ్జెక్టుల్లో ఎక్కువ కోత పడే అవకాశం ఉంది. ఈ క్రమంలోనే జేఈఈ, నీట్, ఎప్ సెట్ వంటి ప్రవేశపరీక్షల్లో ఐదేండ్ల నుంచి ఏఏ టాపిక్స్ నుంచి క్వశ్చన్లు రాలేదో.. వాటిని పూర్తిగా తొలగించాలని డిసైడ్ అయ్యారు. ఒకటో, రెండో సందర్భాల్లో రావడంతో పాటు తక్కువ ప్రయార్టీ ఉన్న వాటి కోసం అవసరమైతే సప్లిమెంటరీ బుక్ తీసుకురావాలని ఇంటర్ బోర్డు భావిస్తోంది. దీంతోపాటు ఇంటర్మీడియెట్ సిలబస్​లో ఏఐ, డేటాసైన్స్, రోబోటిక్స్, మిషన్ లెర్నింగ్ తదితర పాఠాలనూ అందుబాటులోకి తీసుకురానున్నారు. 

ఇక క్వాలిటీ పేపర్.. 

సర్కారు కాలేజీల్లో చదివే విద్యార్థులకు ప్రభుత్వమే పుస్తకాలను ఇస్తున్నది. వీటిని తెలుగు అకాడమీ ప్రింట్ చేస్తున్నది. టెక్స్ట్ బుక్స్ లో గతంలో వాడే పేపర్ ను కాకుండా.. వచ్చే ఏడాది మంచి క్వాలిటీ పేపర్​తో పుస్తకాలను స్టూడెంట్లకు అందుబాటులోకి తీసుకురావాలని ఇంటర్ బోర్డు నిర్ణయించింది. ఈజీగా చినిగిపోని విధంగా పేపర్ ఉండేలా ప్లాన్ చేస్తున్నారు.