మరో 5 రోజుల్లో ఇంటర్ పరీక్షలు.. హాల్‎టికెట్లపై ప్రిన్సిపాళ్ల సంతకం అవసరం లేదు

మరో 5 రోజుల్లో ఇంటర్ పరీక్షలు.. హాల్‎టికెట్లపై ప్రిన్సిపాళ్ల సంతకం అవసరం లేదు

కరోనాతో వాయిదా పడ్డ ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు నిర్వహించేందుకు ఇంటర్ బోర్డ్ అన్ని ఏర్పాట్లు చేస్తోంది. షెడ్యూల్ ప్రకారం ఈ నెల 25 నుంచి నిర్వహించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే హాల్ టికెట్లను ఇంటర్ బోర్డు వెబ్‎సైట్ నుంచి డైరెక్ట్‎గా డౌన్ లోడ్ చేసుకోవచ్చని తెలిపిన అధికారులు.. హాల్ టికెట్లలో తప్పులు సరిదిద్దుకోవడానికి తమను సంప్రదించాలని సూచించారు. 

కరోనాతో గతేడాది ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు నిర్వహించలేదు. విద్యార్థుల భవిష్యత్‎ను దృష్టిలో పెట్టుకొని... ఈ నెల 25 నుంచి వచ్చే నెల 3 వరకు పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందుకోసం ఇంటర్ బోర్డు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. విద్యార్థులు తమ హాల్ టికెట్స్ ఇంటర్ బోర్డ్ వెబ్ సైట్ నుంచి డైరెక్టుగా డౌన్ లోడ్ చేసుకోవచ్చన్నారు. హాల్ టికెట్ పై వివరాలు సరి చూసుకోవాలని సూచించారు. పేరు, ఫోటో, సబ్జెక్టులు, సంతకం లాంటి వివరాల్లో తప్పులుంటే విద్యార్థులు... తమ కాలేజీ ప్రిన్సిపాళ్ల ద్వారా జిల్లా ఇంటర్ విద్యాధికారి దృష్టికి తీసుకురావాలని ఇంటర్ బోర్డ్ సెక్రటరీ ఒమర్ జలీల్ సూచించారు. కాగా.. డౌన్‎లోడ్  చేసుకున్న హాల్ టికెట్లపై కాలేజీల ప్రిన్సిపాళ్ల సంతకం అవసరం లేదన్నారు. ప్రైవేట్ కాలేజీలు విద్యార్థులను ఫీజుల కోసం వేధించకుండా ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. 

రాష్ట్రవ్యాప్తంగా 4 లక్షల 59 వేల 8 మంది విద్యార్థులు ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు రాయనున్నారు. కరోనా రూల్స్ పాటిస్తూ పరీక్షలకు ఏర్పాట్లు చేస్తున్నామని ఇంటర్ బోర్డు అధికారులు తెలిపారు. పరీక్ష కేంద్రాల దగ్గర శానిటైజర్స్ అందుబాటులో ఉంచుతామని.. జ్వరం, జలుబు, దగ్గు లాంటి సమస్యలు ఉంటే పరీక్షా కేంద్రాల్లోని ఇంఛార్జీలకు, సెంటర్ నిర్వాహకులకు చెప్పాలని విద్యార్థులకు సూచించారు. పరీక్షలపై సందేహాలుంటే  ఆయా కాలేజీ ప్రిన్సిపాళ్లతో పాటు బోర్డు అధికారులను సంప్రదించాలని బోర్డు సెక్రటరీ జలీల్ తెలిపారు. కరోనా కారణంగా క్లాసులు సక్రమంగా నిర్వహించకపోవడంతో ఈ సారి 70 శాతం సిలబస్‎తోనే పరీక్షలు నిర్వహిస్తున్నామని ఇంటర్ బోర్డు తెలిపింది.