దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ జంటగా హను రాఘవపూడి తెరకెక్కించిన ‘సీతారామం’ చిత్రం ఎంతలా మెప్పించిందో తెలిసిందే. ముఖ్యంగా ఈ చిత్రంలో దుల్కర్, మృణాల్ ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ హైలైట్‌గా నిలిచింది. వీరిద్దరి కాంబినేషన్‌లో మరో సినిమా వస్తే చూడాలని అభిమానులు ఆశించారు. సినిమా అయితే చేయలేదు కానీ జంటగా ఓ పాటలో కలిసి కనిపించారు.
ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ కంపోజ్ చేసిన ‘భీగీ భీగీ రాత్ మే’ అనే వీడియో సాంగ్‌లో వీళ్లిద్దరూ కలిసి నటించారు. రెహమాన్ కొడుకు అమీన్‌తో పాటు జస్లీన్ రాయల్ ఈ పాట పాడారు. ఆశించిన స్థాయిలో పాట లేదనే విమర్శలు వస్తున్నా, ఇందులో దుల్కర్, మృణాల్ కెమిస్ట్రీ సూపర్ అని ప్రశంసలు లభిస్తున్నాయి.
అనుకోకుండా ట్రైన్ జర్నీలో ఎదురుపడ్డ దుల్కర్, మృణాల్.. తమ గత జన్మ స్మృతులను గుర్తు చేసుకుంటున్నట్టుగా ఈ పాటను చిత్రీకరించారు. ఇక ప్రస్తుతం ‘ఆకాశంలో ఒక తార’ చిత్రంతో పాటు మరో తెలుగు చిత్రంలో దుల్కర్ నటిస్తుండగా, అడివి శేష్‌కు జంటగా ‘డెకాయిట్’లో మృణాల్ నటిస్తోంది.
