- చాలాచోట్ల వెనక్కి తగ్గిన రెబల్స్
- ఫలించిన బుజ్జగింపులు, వార్నింగ్‌లు
- మధ్యాహ్నం 3 గంటల్లోగా విత్‌డ్రాలు
మంచిర్యాల, వెలుగు: మున్సిపల్ ఎన్నికల్లో కౌన్సిలర్లు, కార్పొరేటర్లుగా ఆయా పార్టీల నుంచి నామినేషన్లు వేసిన లీడర్లకు టికెట్ టెన్షన్ పట్టుకున్నది. మంచిర్యాల కార్పొరేషన్‌తో పాటు ఉమ్మడి జిల్లాలోని పది మున్సిపాలిటీలకు ఎన్నికలు జరుగుతున్నాయి. వీటి పరిధిలోని ఒక్కో డివిజన్, వార్డు నుంచి ఇద్దరు ముగ్గురు నాయకులు నామినేషన్లు దాఖలు చేయడంతో అన్ని పార్టీల్లో పోటీ నెలకొన్నది. దీంతో టికెట్ల కోసం ఎమ్మెల్యేలను ప్రసన్నం చేసుకోవడమే గాకుండా ఎవరి స్థాయిలో వారు పైరవీలు సాగించారు.
అయితే వారిలో ప్రజాదరణ ఉన్నవారెవరు? ఎన్నికల ఖర్చులు భరించేంత ఆర్థిక స్తోమత ఉన్నదా? అని ప్రధాన పార్టీలు ఆరా తీశాయి. సర్వే రిపోర్టుల ఆధారంగా క్యాండిడేట్లను సెలెక్ట్ చేశాయి. మంచిర్యాల కార్పొరేషన్ పరిధి లోని 60 డివిజన్లకు రెండు రోజుల క్రితమే అధికార కాంగ్రెస్ అభ్యర్థులను ప్రకటించి ముందు వరుసలో నిలిచింది. బీజేపీ పది డివిజన్ల నుంచి పోటీ చేసేవారి లిస్టు రిలీజ్ చేసింది. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ సోమవారం సాయంత్రం వరకు అన్ని వార్డులు, డివిజన్లకు క్యాండిడేట్లను కన్ఫమ్ చేసినప్పటికీ పేర్లు ప్రకటించకపోవడంతో టికెట్ ఎవరికి వస్తుందనే ఆందోళన నెలకొన్నది.
నేడు బీఫామ్‌ల అందజేత....
జనవరి 28 నుంచి 30 వరకు నామినేషన్లు స్వీకరించగా, 31న స్ర్కూటినీ చేపట్టారు. నామినేషన్ల విత్‌డ్రాకు మంగళవారం మధ్యాహ్నం 3 గంటల వరకు గడువుంది. ఆయా పార్టీల తరఫున బరిలో ఉండే అభ్యర్థులు నేడు 3 గంటల్లోగా బీఫామ్స్ సమర్పించాల్సి ఉంటుంది. ఈలోగా బీఫామ్స్ అందజేసిన వారికి మాత్రమే పార్టీ గుర్తులు దక్కుతాయి. మిగిలిన వారిని ఇండిపెండెంట్లుగా పరిగణించి ఇతర గుర్తులు కేటాయిస్తారు.
ముందుగానే అభ్యర్థులను ప్రకటిస్తే టికెట్ రానివారు తిరుగుబాటు చేయడం, పార్టీ ఫిరాయించే చాన్స్ ఉందన్న భయం అన్ని పార్టీల్లోనూ కనిపించింది. ఈ కారణంగా చివరి నిమిషం వరకూ బీఫామ్స్ ఇవ్వకుండా హోల్డ్‌లో పెట్టినట్టు చర్చ నడుస్తోంది. ఇప్పటికే అభ్యర్థుల విషయమై ఇంటర్నల్‌గా లీకులు ఇచ్చిన పార్టీలు మంగళవారం ఉదయం బీఫామ్స్ అందించడానికి అంతా రెడీ చేశాయి.
రెబల్స్‌కు బుజ్జగింపులు
మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్‌తోపాటు పాటు జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీ, ఉమ్మడి జిల్లాలో ఇతర మున్సిపాలిటీలో రెబల్స్ బెడద నెలకొన్నది. మంచిర్యాల కార్పొరేషన్లో 60 డివిజన్లకు గాను ఒక్కో పార్టీ నుంచి ఇద్దరు ముగ్గురు నామినేషన్లు వేశారు. కాంగ్రెస్ అభ్యర్థులను ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్‌రావు రెండు రోజుల క్రితమే ప్రకటించినప్పటికీ సోమవారం రాత్రి వరకూ బీఫామ్స్ ఇవ్వలేదు.
మిగిలిన వారంతా నామినేషన్లు విత్ డ్రా చేసుకోవాలని, లేదంటే క్రమశిక్షణ చర్యలు తప్పవని వార్నింగ్ ఇవ్వడంతో చాలామంది విత్ డ్రా చేసుకోవడానికి సిద్ధమైనట్టు సమాచారం. బీఆర్ఎస్, బీజేపీలు క్యాండిడేట్లను ఖరారు చేసినప్పటికీ నిన్న రాత్రి వరకూ లిస్టు ప్రకటించలేదు. పార్టీలో ఇంటర్నల్‌గా లీకులు ఇచ్చి మిగిలిన వారు విత్ డ్రా చేసుకోవాలని ఆర్డర్ పాస్ చేశారు. మరోవైపు పలువురు అభ్యర్థులు రెబల్స్‌ను బరినుంచి తప్పించేందుకు బేరసారాలు సాగిస్తున్నట్టు తెలిసింది.
ఆదిలాబాద్ మున్సిపాలిటీలో..
జిల్లాలోని ఆదిలాబాద్ఏకైక మున్సిపాలిటీలో పాగా వేసేందుకు అన్ని పార్టీలు ఫోకస్ పెట్టాయి. అన్ని పార్టీల్లో రెబెల్స్ బెడద కనిపిస్తోంది. ఒక్కో వార్డు నుంచి ఆయా నామినేషన్లు దాఖలు చేశారు. కానీ బీఫామ్ ఎవరికి వస్తుందో అని మాత్రం టెన్షన్ నెలకొంది. ముఖ్యంగా అధికార కాంగ్రెస్ పార్టీలో కౌన్సిలర్ టికెట్ కోసం తీవ్ర పోటీ నెలకొంది. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన తాజా మాజీ కౌన్సిలర్లకు టెన్షన్ పట్టుకుంది.
బీఫామ్ వస్తుందా, లేదా అనే సందిగ్ధంలో పడ్డారు. మొత్తం 49 వార్డుల్లో 772 నామినేషన్లు దాఖలయ్యాయి. కాంగ్రెస్ లో అత్యధికంగా 266, బీఆర్ఎస్ 135, బీజేపీ నుంచి 128 మంది నామినేషన్లు వేశారు. ఒకవేళ బీఫామ్ రాకపోయినా ఇండిపెండెంట్గాబరిలో ఉంటామని ప్రచారం చేసుకుంటున్నారు
