అంతర్రాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్

అంతర్రాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్
  • ఆరు తులాల బంగారం, వెండి, కార్లు  స్వాధీనం

మహబూబ్ నగర్ అర్బన్, వెలుగు:  ​కార్లు రెంట్​కు తీసుకుని రెక్కీ నిర్వహించి తాళం వేసిన ఇండ్లలో దోపిడీలు చేస్తున్న అంతర్రాష్ట్ర దొంగల ముఠాను అరెస్టు చేసినట్లు ఎస్పీ వెంకటేశ్వర్లు చెప్పారు. బుధవారం జిల్లా కేంద్రంలోని ‌సీసీఎస్ పోలీస్ స్టేషన్ లో నిందితులను మీడియాకు చూపించారు. భూత్పూర్​–హైదరాబాద్ హైవే తోపాటు సంగారెడ్డి, ముంబై, పుణె వైపు రూట్​లోని ఇండ్లల్లో దోపిడీలకు పాల్పడే ఈ ముఠాకు హైదరాబాద్ టోలీచౌకీకి చెందిన మహమ్మద్ సోహెల్ ఖురేషి లీడర్​గా ఉన్నాడు. ఇతడిపై 21 దొంగతనం కేసులున్నాయి. ఇతడు మహ్మద్ ​అబ్రారూద్దీన్, సలీం బిన్ అలీ, మహ్మద్ ​సోహైల్, షేక్​ ఇస్మాయిల్ లతో టీం ఏర్పాటు చేసుకుని  దొంగతనాలు చేస్తున్నాడు. అబ్రారూద్దీన్, సలీం బిన్ అలీ, మహ్మద్​సోహైల్ ఈ మధ్యే పీడీ యాక్ట్​పై జైలుకు వెళ్లి వచ్చారు. ఖురేషి కూడా వేరే కేసులో జైలు నుంచి బయటకు వచ్చాడు. వీరంతా గత నెల 23న రాజాపూర్, బాలానగర్ పోలీస్​స్టేషన్ల పరిధిలో రెండు దొంగతనాలు చేశారు. తర్వాత భూత్పూర్ మండలం పోతులమడుగులో పెట్రోల్​పంప్​లో రూ.3500 పెట్రోల్​ పోయించుకుని డబ్బులివ్వకుండా పారిపోయారు. దీంతో వారు పోలీసులకు సమాచారమివ్వడంతో  పోలీసులు ఎంక్వైరీ మొదలుపెట్టారు. విచారణలో ఆ రెండు చోట్ల చోరీలు చేసింది వీరేనని తేలింది. నిఘా పెట్టి  బుధవారం జడ్చర్ల నేతాజీనగర్​లోని ఓ ఇంట్లో ఉండగా అదుపులోకి తీసుకున్నారు.  నలుగురు నిందితులు హైదరాబాద్ కు చెందిన వారు కాగా, షేక్ ​ఇస్మాయిల్ బీదర్ కు చెందినవాడు. వీరి నుంచి 6 తులాల బంగారం, ఐదున్నర తులాల వెండి, రెండు కార్లు, రెండు బైక్ లు, కంప్యూటర్, టీవీ, సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై  మళ్లీ పీడీ యాక్ట్ నమోదు చేస్తామని ఎస్పీ చెప్పారు. రాజాపూర్,​భూత్పూర్, మిడ్జిల్, పాలమూరు రూరల్ పోలీసులకు ఎస్పీ రివార్డులు అందజేశారు. అడిషనల్ ఎస్​పీ రాం కుమార్ , డీఎస్పీ కిషన్, జడ్చర్ల రూరల్ ఇన్​స్పెక్టర్​జములప్ప పాల్గొన్నారు.