మధ్యంతర బడ్జెట్ X పూర్తి బడ్జెట్​..రెండింటి మధ్య తేడాలు ఎన్నో

మధ్యంతర బడ్జెట్ X పూర్తి బడ్జెట్​..రెండింటి మధ్య తేడాలు ఎన్నో

బిజినెస్​ డెస్క్, వెలుగు ​: 2024-–25 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్‌‌‌‌‌‌‌‌ను ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెడతారు. ఇది మధ్యంతర బడ్జెట్. ఎందుకంటే మరికొన్ని నెలల్లో లోక్‌‌‌‌‌‌‌‌సభకు ఎన్నికలు జరగనున్నాయి. మధ్యంతర బడ్జెట్ అనేది సాధారణ ఎన్నికలు సమీపిస్తున్నప్పుడు లేదా కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు ప్రభుత్వం సమర్పించే తాత్కాలిక ఆర్థిక ప్రణాళిక.

కొత్త ప్రభుత్వం పూర్తి స్థాయి బడ్జెట్‌‌‌‌‌‌‌‌ను రూపొందించి సమర్పించే వరకు ప్రభుత్వ వ్యయ అవసరాలను తీర్చడానికి ఇది తాత్కాలిక ఏర్పాటుగా పనిచేస్తుంది. ఏటా మార్చి 31న ఆర్థిక సంవత్సరం ముగిసే వరకు యూనియన్ బడ్జెట్ అమల్లో ఉంటుంది. కాబట్టి ఆ తేదీ వరకు మాత్రమే ప్రభుత్వానికి హక్కులు ఉంటాయి. కొత్త ప్రభుత్వం ఏర్పడే వరకు జరిగే ప్రభుత్వ వ్యయానికి, మధ్యంతర కాలంలో ఖర్చులను భరించడానికి ప్రస్తుత ప్రభుత్వానికి పార్లమెంటు అనుమతి అవసరం. అందుకే మధ్యంతర బడ్జెట్‌‌‌‌‌‌‌‌ విడుదలవుతుంది. 

మధ్యంతర బడ్జెట్​లో​ ఏముంటాయంటే..

మధ్యంతర బడ్జెట్‌‌‌‌‌‌‌‌లో సాధారణంగా వ్యయం, రాబడి, ఆర్థిక లోటు, ఆర్థిక పనితీరు,  రాబోయే ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన అంచనాలు ఉంటాయి.  ఇందులో ఎలాంటి ప్రధాన విధాన ప్రకటనలూ ఉండవు. ఎన్నికల కమిషన్ ప్రవర్తనా నియమావళి ప్రకారం, మధ్యంతర బడ్జెట్ ఓటర్లను ప్రభావితం చేసే ఏ పెద్ద పథకాన్నీ చేర్చకూడదు. ప్రస్తుత ప్రభుత్వం మధ్యంతర బడ్జెట్‌‌‌‌‌‌‌‌తో ఆర్థిక సర్వేను సమర్పించాల్సిన అవసరం లేదు.

మధ్యంతర బడ్జెట్ ద్వారా పార్లమెంటు ఎన్నికలకు ముందు జీతాల వంటి ముఖ్యమైన ప్రభుత్వ ఖర్చులను తీర్చడానికి పార్లమెంటు వోటాన్​ అకౌంట్‌‌‌‌‌‌‌‌ను ఆమోదిస్తారు.   ఎలాంటి చర్చ లేకుండానే దీనికి ఆమోదం దక్కుతుంది. వోటాన్​ అకౌంట్​ సాధారణంగా రెండు నెలల వరకు చెల్లుబాటు అవుతుంది  అవసరమైతే పొడిగించవచ్చు.

ప్రాధాన్యం,  ప్రభావం

భారతదేశ ఆర్థిక ప్రణాళిక,  పాలనను అర్థం చేసుకోవడంలో ఈ బడ్జెట్‌‌‌‌‌‌‌‌ల మధ్య తేడా ఎంతో కీలకం. మధ్యంతర బడ్జెట్ ఆర్థిక స్థిరత్వానికి కీలకం కాగా, పూర్తి-సంవత్సర బడ్జెట్ రోడ్‌‌‌‌‌‌‌‌మ్యాప్‌‌‌‌‌‌‌‌గా పనిచేస్తుంది. ఇది మొత్తం ఆర్థిక సంవత్సరానికి దేశ ఆర్థిక దిశను నిర్దేశిస్తుంది. మధ్యంతర బడ్జెట్‌‌‌‌‌‌‌‌లు ప్రభుత్వ మార్పు సమయంలో ఆర్థిక అంతరాయాన్ని నివారిస్తాయి.  

పూర్తి-సంవత్సర బడ్జెట్‌‌‌‌‌‌‌‌లు ఆర్థిక వృద్ధి, మూలధన పెట్టుబడి  సాంఘిక సంక్షేమ కార్యక్రమాల కోసం నిర్ణయాలు తీసుకుంటాయి. పూర్తి -సంవత్సరం బడ్జెట్ పెట్టుబడిదారుల సెంటిమెంట్‌‌‌‌‌‌‌‌ను ప్రభావితం చేస్తుంది. ఎందుకంటే ఇది వివిధ రంగాలు,  సంస్కరణల పట్ల ప్రభుత్వ వైఖరిని తెలియజేస్తుంది. ఇది ఆర్థిక కార్యకలాపాలను నడిపిస్తుంది.

మధ్యంతర బడ్జెట్ X వోటాన్​ ఎకౌంట్​

మధ్యంతర బడ్జెట్​లో ఖర్చులతోపాటు రసీదులూ ఉంటాయి. వోటాన్ ఎకౌంట్​ ప్రభుత్వ వ్యయాన్ని మాత్రమే చూపిస్తుంది. లోక్‌‌‌‌‌‌‌‌సభలో మధ్యంతర బడ్జెట్‌‌‌‌‌‌‌‌ను చర్చించి, ఆమోదించాలి. వోటాన్​ అకౌంట్లో​ ముఖ్యమైన ఖర్చులు మాత్రమే ఉంటాయి. దీనిని ఎటువంటి చర్చ లేకుండా లోక్‌‌‌‌‌‌‌‌సభ ఆమోదిస్తుంది. మధ్యంతర బడ్జెట్ పన్ను విధానంలో మార్పులను ప్రతిపాదిస్తుంది.

వోటాన్​ఖాతాలో పన్నుల ఊసే ఉండదు.  మధ్యంతర బడ్జెట్ పూర్తి బడ్జెట్‌‌‌‌‌‌‌‌ను పోలి ఉంటుంది కానీ కొన్ని నెలల వరకు మాత్రమే అంచనాలను కలిగి ఉంటుంది. అయితే మధ్యంతర బడ్జెట్ ద్వారా వోటాన్​ -ఖాతాను ఆమోదిస్తారు. మధ్యంతర బడ్జెట్ ఏడాది పొడవునా చెల్లుబాటవుతుంది. వోటాన్​ అకౌంట్ సాధారణంగా 2 నెలల వరకు అమల్లో ఉంటుంది.