నస్పూర్, వెలుగు: సింగరేణిలో పెండింగ్ సమస్యలు వెంటనే పరిష్కరించాలని ఐఎన్టీయూసీ సెక్రటరీ జనరల్ జనక్ ప్రసాద్ డిమాండ్ చేశారు. ఆదివారం నస్పూర్ ప్రెస్ క్లబ్లో మీడియాతో మాట్లాడుతూ.. సింగరేణి యాజమాన్యం కార్మికులపై అవలంభిస్తున్న మొండివైఖరి, తీసుకునే తప్పుడు నిర్ణయాలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.
గుర్తింపు సంఘం అసమర్థత కారణంగా కొత్త హక్కులు సాధించుకోలేకపోతున్నామని, ఉన్న హక్కులు కోల్పోయే పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. మెడికల్ బోర్డు జాప్యం, 150 మస్టర్ల సర్క్యులర్, ట్రాన్స్ఫర్ పాలసీ వంటి నిర్ణయాలు కార్మికులను ఇబ్బందులకు గురిచేస్తున్నాయని, వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.
పంచాయితీ ఎన్నికల విధుల్లో పాల్గొన్న సింగరేణి సిబ్బందికి ఓటీ మంజూరు చేయాలని యాజమాన్యాన్ని కోరారు. సొంతింటి కల సాధన, పెర్క్స్‌పై ఇన్‌కమ్ ట్యాక్స్ మాఫీ, కార్మికులకు సంక్షేమ పథకాల అమలు వంటి కీలక డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి, త్వరగా అమలయ్యేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఐఎన్టీయూసీ నాయకులు జెట్టి శంకర్ రావు, కాంపెల్లి సమ్మయ్య, శ్యామ్, రవీంద్ర రెడ్డి, గరిగె స్వామి, భీంరావు, చందు, మనోజ్ తదితరులు పాల్గొన్నారు.
