తెలంగాణలో పెట్టుబడులు పెట్టండి : భట్టి విక్రమార్క

తెలంగాణలో పెట్టుబడులు పెట్టండి : భట్టి విక్రమార్క
హైదరాబాద్​, వెలుగు: పారిశ్రామికవేత్తలు సంపద సృష్టికర్తలు అని.. రాష్ట్రంలో సింగపూర్ నుంచి పెట్టుబడులను ఆహ్వానిస్తున్నామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. గురువారం ఆయన కౌన్సిల్ జనరల్ ఆఫ్ రిపబ్లిక్ ఆఫ్ సింగపూర్ ఎడ్గర్ పాంగ్ బృందంతో సచివాలయంలో చర్చలు జరిపారు. రాష్ట్రంలో పెట్టుబడులను ఆహ్వానించే విషయంలో ప్రభుత్వం సీరియస్​గా ఉందని భట్టి స్పష్టం చేశారు. ఇక్కడ మౌలిక సదుపాయాలు అద్భుతంగా ఉన్నాయని సింగపూర్ బృందానికి వివరించారు. ఔటర్ రింగ్ రోడ్ నిర్మాణంతో హైదరాబాద్​లో పెట్టుబడుల భూమ్ ఏర్పడిందన్నారు.

 రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాలని కలిపేలా తాజాగా రీజినల్ రింగ్ రోడ్ నిర్మాణం జరుగుతోందన్నారు. రాష్ట్రంలో పట్టణ, గ్రామీణ ప్రాంతాల సమగ్ర అభివృద్ధికి క్లస్టర్ జోన్ల వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఫార్మా, టెక్స్​టైల్​, ఐటీ క్లస్టర్లు ఏర్పాటు చేసి అభివృద్ధిని ప్రోత్సహిస్తున్నామన్నారు. మూసీ నదీ పరీవాహక ప్రాంతం అంతటిని కమర్షియల్, చిల్డ్రన్ పార్క్, మాల్స్ నిర్మాణం చేసి ఆర్థిక కార్యకలాపాలు వేగవంతం చేసే ఆలోచనలో ఉన్నామన్నారు. ఇటీవల జపాన్ కు చెందిన జైకా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తిగా ఉన్నట్టు సింగపూర్ బృందంతో డిప్యూటీ సీఎం చెప్పారు. 

రాష్ట్రంలో బీఈఎంఎల్​ సంస్థను పెట్టండి

రాష్ట్రంలో భారత్ ఎర్త్ మూవర్స్ లిమిటెడ్(బీఈఎంఎల్)​ సంస్థలను ఏర్పాటు చేయాలని ఆ కంపెనీ ప్రతినిధులను భట్టి కోరారు. అందుకు అవసరమైన భూమి, ఇతర వనరులు, సాయాన్ని అందిస్తామన్నారు. గురువారం సచివాలయంలో బీఈఎంఎల్​ కంపెనీ సీఎండీ శంతను రాయ్ బృందంతో డిప్యూటీ సీఎం సమావేమయ్యారు. మెట్రో రైల్ కోచ్ లు, రక్షణ, మైన్స్ వంటి రంగాల్లో తమ కంపెనీ పని చేస్తుందని సీఎండీ శంతను రాయ్ డిప్యూటీ సీఎంకు వివరించారు. హైదరాబాద్​లో మెట్రో విస్తరణకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్నందున తాము రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పనిచేయడానికి ఆసక్తిగా ఉన్నట్టు బీఈఎంఎల్​ సీఎండీ తెలిపారు.