ఎల్​ఐసీ ఐపీఓ కోసం ఎదురుచూపులు

ఎల్​ఐసీ ఐపీఓ కోసం ఎదురుచూపులు

మనదేశంలోనే అతిపెద్ద బీమా కంపెనీ ఎల్ఐసీ ప్రకటించే ఐపీఓలో పెట్టుబడి కోసం కొత్త ఇన్వెస్టర్లు ఆశగా చూస్తున్నారు. ఐపీఓ ప్రకటన రాగానే భారీ సంఖ్యలో అప్లికేషన్లు అందే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఓవర్​సబ్​స్క్రిప్షన్​ వల్ల మెజారిటీ కొత్త ఇన్వెస్టర్లు నిరాశపడతారని అంచనా. ఈ పరిస్థితి రాకుండా చేయడానికి రిటైల్ ఇన్వెస్టర్లకు ప్రభుత్వం ఎక్కువ ఇంపార్టెన్స్​ ఇవ్వాలని మార్కెట్​ ఎనలిస్టులు సూచిస్తున్నారు. అందరికంటే ముందే సాధారణ ఇన్వెస్టర్లకు షేర్లు అమ్మాక, ఇన్​స్టిట్యూషనల్​ ఇన్వెస్టర్లకు కేటాయించాలని అంటున్నారు. 

న్యూఢిల్లీ: స్టాక్​ మార్కెట్లో ఇప్పటి వరకు అడుగుపెట్టని వాళ్లు కూడా ఎల్ఐసీ ఐపీఓ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇది భారీ లాభాలను తెచ్చిపెట్టే అవకాశాలు ఉండటమే ఇందుకు కారణం. మరికొన్ని రోజుల్లో పబ్లిక్​ ఇష్యూ ప్రకటన వచ్చే అవకాశం ఉండటంతో చాలా మంది డీమాట్​ అకౌంట్లు ఓపెన్​ చేస్తున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరి లేదా మార్చిలోనే ఇష్యూ తెస్తామని ఎల్​ఐసీ ఇది వరకే ప్రకటించింది. రిటైల్​ ఇన్వెస్టర్లే కాదు.. ఇన్​స్టిట్యూషనల్​ ఇన్వెస్టర్ల చూపు కూడా ఎల్​ఐసీ ఐపీఓపైనే ఉంది. ఇటీవల వచ్చిన మెజారిటీ ఐపీఓలకు ఆశించిన డిమాండ్​ కనిపించింది. గత ఏడాది వచ్చిన లేటెంట్​ వ్యూ ఎనలిటిక్స్ ఐపీఓ 120 రెట్లు సబ్​స్క్రయిబ్​ అయింది. పారస్​ డిఫెన్స్‌‌ అండ్​ స్పేస్​ టెక్నాలజీస్​ పబ్లిక్​ ఇష్యూ 113 సార్లు సబ్​స్క్రయిబ్​ అయింది. అయితే లాట్లు పొందిన వారి సంఖ్య చాలా చాలా తక్కువ. ఇక ఎల్​ఐసీ ఐపీఓ ప్రకటన రాగానే ఎంతగా ఎగబడతారో ఈజీగానే అంచనా వేయొచ్చు. పాత ఇన్వెస్టర్లతోపాటు కొత్త వాళ్లూ షేర్ల కోసం దరఖాస్తులు గుమ్మరిస్తారు. ఇదంతా ఓకే కానీ, చాలా ఐపీఓలు లిస్టింగ్​ గెయిన్స్​ ఇచ్చినప్పటికీ, తరువాత నిలదొక్కుకోవడం లేదు. షేర్లు నష్టాలపాలవుతున్నాయి. ఉదాహరణకు 2008లో రిలయన్స్​ పవర్​ మెగా ఐపీఓ వచ్చింది. అప్పుడు బ్రోకర్ హౌజ్​లు సూపర్​స్టార్​ హీరో సినిమా ఫస్ట్​ షో మాదిరిగా కిక్కిరిసి కనిపించేవి. జనం ఎగబడి షేర్లు కొన్నారు. తీరాచూస్తే మొదటిరోజే షేరు 17 శాతం నష్టంతో లిస్టయింది. పది సంవత్సరాల తరువాత కూడా ఈ షేరు లిస్టింగ్​ధరను చేరుకోలేకపోయింది. 

ఎల్​ఐసీ ఐపీఓకు ఎందుకు డిమాండ్​?
ఎక్స్​పర్టుల అంచనాల ప్రకారం.. ఎల్​ఐసీ ఐపీఓకు కూడా రిలయన్స్​ పవర్​ ఐపీఓ మాదిరే గిరాకీ ఉంటుంది కానీ లిస్టింగ్​రోజు నష్టాలు వచ్చే అవకాశాలు చాలా తక్కువ. ఎందుకంటే ఎల్​ఐసీ ఇండియాలోనే అతిపెద్ద ప్రభుత్వ ఇన్సూరెన్స్​ కంపెనీ. బీమా మార్కెట్లో లీడర్ ​కూడా. ప్రైవేటైజేషన్ తరువాత కూడా కంపెనీ చాలా బలంగా ఉంటుంది. గత 20 ఏళ్లలో మనదేశంలో కొత్తగా ఎన్నో కంపెనీలు బీమా రంగంలోకి వచ్చినా ఎల్​ఐసీకి ఆదరణ చెక్కుచెదరలేదు. బ్యాంకింగ్, టెలికంలోని నంబర్​ వన్​ కంపెనీలు ఇన్సూరెన్స్​ బిజినెస్​లు మొదలుపెట్టినా, ఎల్​ఐసీ బిజినెస్​ తగ్గలేదంటే దీని సత్తా ఏంటో అర్థం చేసుకోవచ్చు. అంతేకాదు ఎల్ఐసీ.. ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఇన్సూరెన్స్​ కంపెనీతోపాటు అత్యంత విలువైన ఇన్సూరెన్స్​ బ్రాండ్లలో దీనిది పదోస్థానం. మొదటిసారి స్టాక్​ మార్కెట్లకు వచ్చే వాళ్లు ఎల్​ఐసీ షేర్లు కొంటే దీర్ఘకాలంలో చాలా డబ్బు సంపాదించవచ్చని వెంచురా సెక్యూరిటీస్ ​సీఈఓ, డైరెక్టర్ హేమంత్​ మజీతియా అన్నారు. ఎల్​ఐసీ ఐపీఓ రాకతో మార్కెట్లో హడావుడి మరింత పెరుగుతుందని హేమంత్​ వంటి ఎనలిస్టులు చెబుతున్నారు. 2021 నవంబర్ 30 నాటికి సెంట్రల్ డిపాజిటరీ సర్వీసెస్ (ఇండియా) లిమిటెడ్ (సీడీఎస్​ఎల్​)కు 5.26 కోట్లకు పైగా డీమాట్ ఖాతాలు ఉన్నాయి. నేషనల్ సెక్యూరిటీస్ డిపాజిటరీ లిమిటెడ్ (ఎన్​ఎస్​డీఎల్​)కు దాదాపు 2.45 కోట్ల ఖాతాలు ఉన్నాయి. ఇవి మరింత పెరుగుతాయని ఎనలిస్టులు చెబుతున్నారు. 

రిటైల్​ ఇన్వెస్టర్లను ఎంకరేజ్​ చేయాలె..
ఎల్​ఐసీ బ్రాండ్  బలం చాలా మంది ఇన్వెస్టర్లను ఆకర్షించడం ఖాయం.  ఇలాంటి వాళ్లు ఉత్సాహంగా డీమాట్ ఖాతాను తెరుస్తారు. కానీ ఓవర్‌‌‌‌‌‌‌‌సబ్‌‌‌‌స్క్రిప్షన్ కారణంగా అందరూ అలాట్‌‌‌‌మెంట్ పొందడం మాత్రం సాధ్యం కాదు. ఈక్విటీ పెట్టుబడి ప్రయాణం మొదలుకాకముందే కొందరు నిరాశతో వెనుదిరిగే ప్రమాదం ఉంది.“ఈ పరిస్థితి రాకుండా ఉండాలంటే రిటైల్ ఇన్వెస్టర్లకు అనుకూలంగా ఐపీఓ రూల్స్​ను మార్చాలి. ఎల్​ఐసీ ఐపీఓ రిటైల్ స్థాయిలో క్యాపిటల్ మార్కెట్‌‌‌‌ను మరింతగా పెంచుకోవడానికి ప్రభుత్వానికి పెద్ద అవకాశాన్ని ఇస్తుంది. రిటైల్​ ఇన్వెస్టర్లకు ఇంపార్టెన్స్​ ఇస్తామని హామీ ఇవ్వాలి. ఇన్​స్టిట్యూషనల్​ ఇన్వెస్టర్ల కంటే ముందే రిటైల్ ఇన్వెస్టర్లకు షేర్లు ఇవ్వాలని ప్రభుత్వం   ఆదేశిస్తే బాగుంటుంది”అని హేమంత్​ పేర్కొన్నారు. ఐపీఓ రాకముందే మొదట ఇన్​స్టిట్యూషన్ల బయర్స్​కు, తరువాత క్వాలిఫైడ్​ ఇన్​స్టిట్యూషనల్​ బయర్స్​కు​ ఎక్కువ షేర్లు ఇవ్వడం వల్ల రిటైల్​ ఇన్వెస్టర్లకు తక్కువ షేర్లే మిగులుతున్నాయి.