మేడిగడ్డ ఘటనపై విచారణ జరిపించండి .. సీవీసీకి బక్క జడ్సన్​ ఫిర్యాదు

మేడిగడ్డ ఘటనపై  విచారణ జరిపించండి ..  సీవీసీకి బక్క జడ్సన్​ ఫిర్యాదు

హైదరాబాద్, వెలుగు: కట్టిన మూడేండ్లలోనే మేడిగడ్డ బ్యారేజీ 5 అడుగులు మేర కుంగిపోయిందని, దీనిపై సమగ్ర విచారణ జరిపించాలని సెంట్రల్​ విజిలెన్స్​ కమిషన్​ను కాంగ్రెస్​ నేత బక్క జడ్సన్​ కోరారు. ఈ మేరకు గురువారం ఆయన సీవీసీకి ఫిర్యాదు చేశారు. మేడిగడ్డ బ్యారేజీ కుంగడంలో ఎలాంటి కుట్ర కోణం లేదని స్వయంగా జయశంకర్​ భూపాలపల్లి జిల్లా ఎస్పీ రిపోర్ట్​ ఇచ్చారని గుర్తు చేశారు. నేషనల్​ డ్యామ్​ సేఫ్టీ అథారిటీ కూడా మేడిగడ్డ బ్యారేజీపై రిపోర్ట్​ ఇచ్చిందని తెలిపారు.

 150 ఏండ్ల కిందట కాటన్​ కట్టిన బ్యారేజీ, 50 ఏండ్ల కిందట కాంగ్రెస్​ హయాంలో కట్టిన శ్రీశైలం, నాగార్జున సాగర్​, నిజాంసాగర్​, శ్రీరామ్​ సాగర్​ వంటి డ్యామ్​లు ఇంత వరకు చెక్కు చెదరలేదన్నారు. కానీ, సీఎం కేసీఆర్​ కట్టించిన కాళేశ్వరం మూడేండ్లయినా కాకముందే మునిగిపోతున్నదని, బ్యారేజీ కుంగుతున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతికి పాల్పడి వేలాది కోట్లు సంపాదించుకున్నారని ఆరోపించారు. 

ఈ నేపథ్యంలోనే సీఎం కేసీఆర్​, హరీశ్​ రావుల ఎలక్షన్​ అఫిడవిట్లు, ఆస్తుల వివరాల ఆధారంగా విచారణ జరిపించి చర్యలు తీసుకోవాలని సీవీసీని కోరారు. బ్యారేజీ ప్రధాన కాంట్రాక్టర్​ సాయంతో 8 మంది ఇంజనీర్లు, అధికారులు అవినీతికి పాల్పడి బ్యారేజీని నాణ్యత లేకుండా నిర్మించారని ఆరోపించారు.