మాజీ ఎంపీ సంతోష్‌‌‌‌ కుమార్‌‌‌‌‌‌‌‌ అక్రమ పట్టాపై విచారణ

మాజీ ఎంపీ సంతోష్‌‌‌‌ కుమార్‌‌‌‌‌‌‌‌ అక్రమ పట్టాపై విచారణ

బోయినిపల్లి, వెలుగు:  రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండలం కొదురుపాక గ్రామానికి చెందిన మాజీ సీఎం కేసీఆర్​తోడల్లుడు జోగినిపల్లి రవీందర్​రావు కొడుకు మాజీ ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్ బీపీఎల్ కోటా కింద​ అక్రమ పట్టా పొందాడన్న ఫిర్యాదుపై రెవెన్యూ సిబ్బంది శుక్రవారం విచారణ చేశారు. మానువాడలో నిర్మించిన మిడ్​మానేరు ప్రాజెక్టులో కొదురుపాక గ్రామం మునిగిపోయింది. 

ప్రభుత్వం వీరికి కొత్తగా ఆర్అండ్​ఆర్​ కాలనీ నిర్మించింది. ఈ కాలనీలో జోగినిపల్లి సంతోష్ కుమార్​ అక్రమంగా పట్టా పొందాడని, అలాగే హైదరాబాద్‌‌‌‌లో నివాసం ఉంటున్న ఆయన కూతురు సౌమ్య, సిరిసిల్ల మండలం పెద్దూరు గ్రామానికి చెందిన రవీందర్‌‌‌‌‌‌‌‌రావు సోదరుడు గండ్ర రమణారావు సైతం ప్యాకేజీ పొందారని మిడ్​మానేరు నిర్వాసితుల ఐక్య వేదిక అధ్యక్షుడు, కాంగ్రెస్​ బీసీ సెల్​ జిల్లా అధ్యక్షుడు కూస రవీందర్​ ఈ నెల 6న సీఎం ప్రజావాణిలో ఫిర్యాదు చేశాడు. 

కలెక్టర్​ఆదేశాల మేరకు ఈ నెల 29న బోయినిపల్లి ఆర్ఐ విచారణ జరిపారు. ఆర్డీవో, తహసీల్దార్​ కార్యాలయాల్లో ముంపు గ్రామాల నిర్వాసితులకు కేటాయించిన ఇండ్ల స్థలాల పట్టా, ప్యాకేజీ వివరాలను పరిశీలించినట్లు సమాచారం.