హైదరాబాద్, వెలుగు: ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలను ఈ నెల 14, 15 తేదీల్లో అసెంబ్లీలోని స్పీకర్ కార్యాలయంలో శాసన సభాపతి గడ్డం ప్రసాద్ సమక్షంలో పిటిషనర్లు అయిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేల తరఫున వారి అడ్వకేట్లు క్రాస్ ఎగ్జామినేషన్ చేయనున్నారు.
ఈ రెండ్రోజులపాటు ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలు తెల్లం వెంకట్రావ్, సంజయ్, పోచారం శ్రీనివాస్ రెడ్డి, అరికెపూడి గాంధీ, వారి తరఫున అడ్వకేట్లు క్రాస్ ఎగ్జామినేషన్ ను ఎదుర్కోనున్నారు. ఈ నేపథ్యంలో రెండురోజులు అసెంబ్లీ ఆవరణలో ఆంక్షలు విధిస్తున్నట్లు కార్యదర్శి నర్సింహాచార్యులు మీడియాకు తెలిపారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మినహా ఎవరికీ రెండ్రోజులపాటు అసెంబ్లీ ఆవరణలోకి అనుమతి లేదన్నారు. మీడియా పాయింట్ వద్ద ఎవరూ మాట్లాడవద్దని కోరారు.
