
- ప్రాజెక్టు నిర్మాణం, మేడిగడ్డ కుంగుబాటుపై సీబీఐ ఎంక్వైరీ
- జరిపించాలని హైకోర్టులో కోదండరాం, కేఏ పాల్ పిటిషన్లు
- స్వయంగా వాదనలు వినిపించిన కేఏ పాల్
- తదుపరి విచారణను జూన్‌కు వాయిదా వేసిన కోర్టు
హైదరాబాద్, వెలుగు: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ దర్యాప్తు కోరుతూ దాఖలైన పిటిషన్లపై హైకోర్టు బుధవారం విచారణ చేపట్టింది. హైకోర్టు చీఫ్ జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ అనిల్‌కుమార్ జూకంటితో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్లపై బుధవారం వాదనలు విన్నది. తదుపరి విచారణను జూన్‌కు వాయిదా వేసింది. ప్రాజెక్టు నిర్మాణం, మేడిగడ్డ పియర్ల కుంగుబాటుపై సీబీఐ లేదా సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరామ్, ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్‌తో పాటు బక్క జడ్సన్, మరో ఇద్దరు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు.
కేఏ పాల్ స్వయంగా వాదనలు వినిపించారు. ‘దేశంలోనే అత్యంత అవినీతి జరిగిన ప్రాజెక్టు కాళేశ్వరం. వెంటనే సీబీఐ విచారణకు ఆదేశించాలి. తెలంగాణలోని 4 కోట్ల మందికి చెందిన రూ.లక్ష కోట్లకు సంబంధించిన అంశం ఈ ప్రాజెక్టు. సీబీఐ దర్యాప్తుతో పాటు భవిష్యత్తులో ప్రాజెక్టు నిర్వహణకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా వినియోగించుకునేలా నిపుణుల కమిటీని కూడా వేయాలి.
ఎన్నికలకు ముందు పలు సభలు, సమావేశాల్లో కాళేశ్వరంపై సీబీఐ విచారణ జరిపిస్తామన్న సీఎం రేవంత్.. అధికారంలోని రాగానే మాట మార్చారు. సీబీఐ విచారణ కోరకుండా.. రిటైర్డ్ జడ్జితో విచారణ అంటున్నారు’ అని పాల్ పేర్కొన్నారు. అయితే, ఈ కేసులో సీఎం పార్టీ కి సంబంధం లేదని, ఆయనపై చర్చ అవసరం లేదని ధర్మాసనం వ్యాఖ్యానించింది. పాల్ వాదనలను పలుసార్లు తప్పుబట్టింది. వాదనలు విన్న తర్వాత ఈ పిటిషన్లపై విచారణను వేసవి సెలవుల తర్వాతకు ధర్మాసనం వాయిదా వేసింది.