ఫార్మా పీఎల్​ఐతో రూ. 25 వేల కోట్ల విలువైన పెట్టుబడులు

ఫార్మా పీఎల్​ఐతో రూ. 25 వేల కోట్ల విలువైన పెట్టుబడులు

న్యూఢిల్లీ: ఫార్మా  స్యూటికల్స్‌‌‌‌కు ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకం (పీఎల్​ఐ) కింద ఈ ఏడాది సెప్టెంబర్ నాటికి రూ. 25,813 కోట్ల విలువైన పెట్టుబడులు వచ్చాయి. ఫలితంగా  56,171 కొత్త ఉద్యోగాలు వచ్చాయని ప్రభుత్వం శుక్రవారం తెలిపింది.   ఫార్మాస్యూటికల్స్ విభాగం (డీఓపీ).. పేదలకు,  నిరుపేదలకు సరసమైన ధరలకు నాణ్యమైన జనరిక్ మందులను అందించడానికి 2023లో 10 వేల రిటైల్ అవుట్‌‌‌‌లెట్‌‌‌‌లను ప్రారంభించాలనే లక్ష్యాన్ని 'ప్రధాన్ మంత్రి భారతీయ జనౌషధి పరియోజన' సాధించిందని పేర్కొంది. ఫార్మాస్యూటికల్స్ కోసం ప్రొడక్షన్​ లింక్​డ్​ ఇన్సెంటివ్​ (పీఎల్​ఐ) పథకం భారతదేశంలోని ఉత్పత్తి సామర్థ్యాలను పెంపొందిస్తుంది. 

ఈ రంగంలో పెట్టుబడులను,  ఉత్పత్తిని పెంచుతుంది. పథకం  మొత్తం వ్యయం రూ. 15 వేల కోట్లు కాగా,   2020–-2021 నుంచి 2028–-29 వరకు అమల్లో ఉంటుంది. పథకం కింద 55 మంది దరఖాస్తుదారులు ఎంపిక చేశారు. వీటిలో రూ. 17,275 కోట్ల పెట్టుబడితో ఇన్-విట్రో డయాగ్నోస్టిక్స్ (ఐవీడీ) పరికరాల కోసం ఐదు  దరఖాస్తులు వచ్చాయి.  ఈ పథకం కింద ఈ ఏడాది సెప్టెంబర్ నాటికి రూ. 25,813 కోట్ల విలువైన పెట్టుబడులు రాగా, 56,171 మందికి ఉపాధి లభించిందని ప్రభుత్వం తెలిపింది. ఎంపికైన దరఖాస్తుదారులు/కంపెనీలు చేసిన విక్రయాల విలువ రూ. 1,16,121 కోట్లు కాగా, ఇందులో రూ. 75,141 కోట్ల విలువైన ఎగుమతులు ఉన్నాయి. 

ఈ పథకం ప్రత్యేకమైన కేటగిరీ ఫార్మాస్యూటికల్స్/ఐవీడీ పరికరాలు తయారు అవుతాయి. ప్రధాన్ మంత్రి భారతీయ జన్ ఔషధి పరియోజన (పీఎంబీజేపీ) కింద నవంబర్ 30, 2023 నాటికి, దేశవ్యాప్తంగా 10,006 ప్రధాన్ మంత్రి భారతీయ జనౌషధి కేంద్రాలు (పీఎంబీజేకేలు) --పనిచేస్తున్నాయి. ఈ దుకాణాల్లో 206 మందులు,  13 శస్త్రచికిత్స పరికరాలు కొత్తగా చేర్చారు. మొత్తం 1,965 మందులు,  293 సర్జికల్ పరికరాలను కొనొచ్చు.