ఇవాళ యూపీలో ఇన్వెస్టర్ల సదస్సు

ఇవాళ యూపీలో ఇన్వెస్టర్ల సదస్సు

లక్నో: యూపీ ఇన్వెస్టర్స్ సమ్మిట్ 3.0ను ప్రధానమంత్రి నరేంద్రమోడీ ప్రారంభించనున్నారు. లక్నోలోని ఇందిరాగాంధీ ప్రతిష్టాన్​లో జరిగే ఇన్వెస్టర్స్​ సమ్మిట్​లో శుక్రవారం ఉదయం 11 గంటలకు ప్రధాని మోడీ పాల్గొంటారు. రూ.80 వేల కోట్లతో చేపట్టే 1,406 ప్రాజెక్టులకు ప్రధాని ఒకేసారి భూమి పూజ చేస్తారు. ఈ కార్యక్రమంలో దేశంలోని ప్రముఖ పారిశ్రామికవేత్తలు గౌతం అదానీ, కుమార మంగళం బిర్లా, సజ్జన్ జిందాల్, అనంత్​ అంబానీ తదితరులు పాల్గొంటారు. ఈ సమ్మిట్​లో పాల్గొనేందుకు విశాక ఇండస్ట్రీస్​ చైర్మన్ వివేక్ వెంకటస్వామి గురువారమే లక్నో చేరుకున్నారు. ఉత్తరప్రదేశ్​ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్​తో ఆయన భేటీ అయ్యారు.

పరౌంఖ్ గ్రామానికి రాష్ట్రపతి, ప్రధాని

సమ్మిట్ తర్వాత 1.45 గంటలకు కాన్పూర్​లోని పరౌంఖ్ గ్రామానికి చేరుకుంటారు. అక్కడ రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్​తో కలిసి పత్రి మాతా మందిర్​ను సందర్శిస్తారు. 2 గంటల సమయంలో అంబేద్కర్​ భవన్​ను, 2.15 గంటలకు మిలన్​ కేంద్రను పరిశీలిస్తారు. మిలన్​ కేంద్ర అనేది రాష్ట్రపతి పూర్వీకుల ఇల్లు. దానిని ప్రజా ప్రయోజనం కోసం ఉపయోగించేందుకు ఆయన డొనేట్​ చేశారు. ప్రస్తుతం దానిని కమ్యూనిటీ సెంటర్​గా మార్చారు. 2.30 గటంలకు పరౌంఖ్​ గ్రామంలో జరిగిన పబ్లిక్​ మీటింగ్​లో ప్రధాని, రాష్ట్రపతి పాల్గొంటారు.