
న్యూఢిల్లీ: ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఈ ఏడాది ఏప్రిల్–-జూన్ మధ్యకాలంలో లీటరుకు పెట్రోల్‌ను రూ. 10 చొప్పున, డీజిల్‌ను రూ. 14 చొప్పున నష్టానికి అమ్మింది. దీంతో పోయిన రెండేళ్లలో మొదటిసారిగా సంస్థ నష్టం ప్రకటించాల్సి వచ్చింది. దేశంలోని అతిపెద్ద చమురు శుద్ధి ఇంధన రిటైలింగ్ సంస్థ అయిన ఈ కంపెనీ ఏప్రిల్–-జూన్‌లో రూ. 1,992.53 కోట్ల నికర నష్టాన్ని ప్రకటించింది. ఏడాది క్రితం ఇదే కాలంలో రూ. 5,941.37 కోట్ల నికర లాభం వచ్చింది. అంతకు ముందు జనవరి-–మార్చి క్వార్టర్లో రూ. 6,021.9 కోట్లు వచ్చాయి." ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ స్టాండెలోన్ ఇబిటా సంవత్సరానికి 88 శాతం తగ్గి రూ. 1,358.9 కోట్లకు పడిపోయింది. అందుకే రూ. 1,992.5 కోట్ల నికర నష్టాన్ని ప్రకటించాల్సి వచ్చింది. ‘‘ స్థూల రిఫైనింగ్ మార్జిన్లు (జీఆర్‌ఎంలు) బ్యారెల్‌కు 31.8 డాలర్ల చొప్పున ఉన్నప్పటికీ నష్టాలు తప్పలేదు. ఈ క్వార్టర్లో పెట్రోలు, డీజిల్‌కు రిటైల్ మార్జిన్లు బాగా తగ్గాయి. పెట్రోల్‌కు లీటరుకు రూ. 10 డీజిల్‌పై రూ. 14 చొప్పున నష్టం రావడంతో క్వార్టర్లో ఇన్వెంటరీ నష్టం రూ. 1,500-–1,600 కోట్లుగా ఉంటుందని అంచనా. కేంద్రం ఇదే క్వార్టర్లో పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించింది ”అని ఐసిఐసిఐ సెక్యూరిటీస్ తెలిపింది.
రేట్లను మార్చడం లే..
రిటైలర్లు రోజువారీ ధరలకు అనుగుణంగా పెట్రోల్, డీజిల్ ధరలను సవరించాల్సి ఉండగా, ఐఓసీ ఇతర ప్రభుత్వ యాజమాన్యంలోని సంస్థలు భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (బీపీసీఎల్) హిందూస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్‌పీసీఎల్) ఇన్పుట్ ధర పెరిగినప్పటికీ గత 116 రోజులుగా ధరలను మార్చడం ఆపేశాయి. సాధారణంగా, చమురు కంపెనీలు దిగుమతి రేట్ల ఆధారంగా రిఫైనరీ గేట్ ధరను లెక్కిస్తాయి. కానీ మార్కెటింగ్ విభాగం దిగుమతి ధర కంటే తక్కువ ధరలకు అమ్మితే నష్టాలు తప్పవు. ప్రభుత్వ ఇంధన రిటైలర్లు ప్రతిరోజూ అంతర్జాతీయ ధరతో రేట్లను సర్దుబాటు చేయాలి. భారతదేశం దిగుమతి చేసుకునే ముడి చమురు బాస్కెట్ బ్యారెల్‌కు ధర సగటున 109 డాలర్లు ఉంటుంది. రిటైల్ పంపులకు ఇచ్చే ధర బ్యారెల్‌కు 85-–86 డాలర్లు మించడం లేదు. ఐఓసీకి రెండేళ్లలో ఇదే తొలి క్వార్టర్ నష్టం. కంపెనీ చివరిసారిగా 2020 కంపెనీ జనవరి–-మార్చి క్వార్టర్ నష్టాన్ని ప్రకటించింది. ఇన్వెంటరీ నష్టాల కారణంగా అప్పుడు నష్టం వచ్చింది. "జీఆర్‌ఎంలు క్యూ1లో గరిష్ఠ స్థాయిలకు చేరాక బ్యారెల్‌కు 11.8 డాలర్ల స్థాయికి చేరుకున్నాయి. తక్కువ ఉత్పత్తి, ఎక్కువ ధరల కారణంగా మార్కెటింగ్ మార్జిన్లు మెరుగుపడ్డాయి. 2023 ఆర్థిక సంవత్సరం (ఏప్రిల్ 2022 నుండి మార్చి 2023 వరకు) తక్కువ నష్టాలే ఉండొచ్చు”అని ఈ రిపోర్టు పేర్కొంది.
ఐదు రాష్ట్రాల ఎన్నికలతో ఇబ్బందులు..
కీలకమైన ఐదు రాష్ట్రాల ఎన్నికలకు ముందు చాలా రోజులపాటు నష్టాలను భరించాల్సి వచ్చింది. పోయిన ఏడాది ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఐఓసీ, బీపీసీఎల్ హెచ్‌పీసీఎల్ రేట్లను సవరించడం నిలిపివేసింది. దాదాపు 137 రోజులను ధరలను యథాతథంగా ఉంచారు. ఈ ఏడాది ఏప్రిల్ ప్రారంభంలో ధరలను లీటరుకు రూ. 10 చొప్పున పెంచారు. రష్యా ఉక్రెయిన్‌పై దాడి చేసిన తర్వాత సరఫరా ఆందోళనలతో అంతర్జాతీయ చమురు ధరలు ఎన్నడూలేని స్థాయికి ఎగిశాయి. దీంతో మేనెలలో ప్రభుత్వం పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించింది. ఈ డబ్బును పెరుగుతున్న నష్టాలను తగ్గించడానికి ఉపయోగించకుండా కస్టమర్లకు బదిలీ చేశారు. దీంతో కంపెనీల నష్టాలు పెరుగుతున్నాయి.