
న్యూఢిల్లీ: ఐపీఎల్‌లో చావోరేవో తేల్చుకోవాల్సిన మ్యాచ్‌లో సన్ రైజర్స్ హైదరాబాద్ బంపర్ విక్టరీ కొట్టింది. రాజస్థాన్‌తో గురువారం జరిగిన మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో రైజర్స్ విజయం సాధించింది. ఈ గెలుపులో ఎస్‌ఆర్‌హెచ్ మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్ మనీశ్ పాండే, విజయ్ శంకర్ కీలక పాత్ర పోషించారు. వీళ్లిద్దరూ మూడో వికెట్‌కు అజేయంగా 140 రన్స్ జోడించి జట్టును గెలుపు తీరాలకు చేర్చారు. ఓపెనర్లు డేవిడ్ వార్నర్, జానీ బెయిర్‌స్టోను ఔట్ చేసి జోరు మీదున్న ఆర్చర్‌ను పాండే, శంకర్ దీటుగా ఎదుర్కొన్నారు. ఆర్చర్ బౌలింగ్‌ను ఎదుర్కోవడానికి పక్కా ప్లానింగ్‌తో బరిలోకి దిగామని పాండే చెప్పుకొచ్చాడు.
‘జోఫ్రాను ఎదుర్కోవడానికి మేం ప్రణాళికలు వేశాం. లెగ్ స్పిన్నర్లతోపాటు ఇండియన్ బౌలర్లపై అటాక్ చేయాలని నిర్ణయించుకున్నాం. క్రీజులోకి వెళ్లిన కొద్ది సేపటికే నేను కుదుకున్నా. విజయ్ కూడా మంచి టచ్‌లోకి వచ్చాడు. దీంతో గేమ్‌ను ఆఖరు వరకు తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నాం. ఆర్చర్ మాపై విరుచుకుపడతాడని తెలుసు. అతడిపై ప్లాన్ ప్రకారం ఆడాం. ఈ మ్యాచ్‌లో నుంచి కొన్ని సానుకూల విషయాలను టోర్నీ ఆసాంతం కొనసాగించాలని అనుకుంటున్నాం’ అని మనీశ్ పాండే చెప్పాడు. మనీశ్ మీద ఒత్తిడి పడకూడదని తాను హిట్టింగ్‌కు వెళ్లినట్లు విజయ్ శంకర్ పేర్కొన్నాడు.