ముంబై నిలిచింది: ప్లే ఆఫ్స్​ ఆశలు సజీవం

ముంబై నిలిచింది:  ప్లే ఆఫ్స్​ ఆశలు సజీవం

షార్జా: చావోరేవో లాంటి మ్యాచ్​లో గెలిచిన ముంబై ఇండియన్స్‌‌ ప్లే ఆఫ్స్​ రేసులో నిలిచింది. బౌలింగ్‌‌లో కూల్టర్‌‌నైల్‌‌ (4/14), నీషమ్‌‌ (3/12) అదరగొట్టగా, బ్యాటింగ్‌‌లో ఇషాన్‌‌ కిషన్‌‌ (25 బాల్స్‌‌లో 5 ఫోర్లు, 3 సిక్సర్లతో 50 నాటౌట్‌‌) మెరుపులు మెరిపించడంతో.. మంగళవారం జరిగిన లీగ్‌‌ మ్యాచ్‌‌లో ముంబై 70 బాల్స్‌‌ మిగిలి ఉండగానే 8 వికెట్ల తేడాతో రాజస్తాన్‌‌ను చిత్తు చేసింది.  టాస్‌‌ ఓడి బ్యాటింగ్‌‌కు దిగిన రాజస్తాన్‌‌ 20 ఓవర్లలో 90/9 స్కోరుకే పరిమితమైంది. ఎవిన్‌‌ లూయిస్‌‌ (19 బాల్స్‌‌లో 3 ఫోర్లు, 1 సిక్స్‌‌తో 24) టాప్‌‌ స్కోరర్‌‌. తర్వాత ముంబై 8.2 ఓవర్లలో 94/2  స్కోరు చేసి గెలిచింది. కెప్టెన్‌‌ రోహిత్‌‌ శర్మ (13 బాల్స్‌‌లో 1 ఫోర్‌‌, 2 సిక్సర్లతో 22) మెరుపు ఆరంభాన్నిచ్చాడు. కూల్టర్‌‌నైల్‌‌కు ‘ప్లేయర్‌‌ ఆఫ్‌‌ ద మ్యాచ్‌‌’ అవార్డు లభించింది. ఓవరాల్​గా 13 మ్యాచ్​ల్లో ఆరో విజయం సాధించిన  ముంబై 12 పాయింట్లతో ఐదో ప్లేస్​కుచేరుకుంది. రన్‌‌రేట్‌‌ కూడా పెంచుకుంది. మరోవైపు లీగ్​లో ఎనిమిదో ఓటమితో రాయల్స్ (10 పాయింట్లు) ఏడో ప్లేస్​కు పడిపోయి..​ ప్లే ఆఫ్స్​ రేసు నుంచి దాదాపు వైదొలిగింది. 
పేస్‌‌.. తడాఖా
ముందుగా బ్యాటింగ్‌‌కు దిగిన రాజస్తాన్‌‌ను ముంబై పేసర్లు అద్భుతంగా కట్టడి చేశారు. కీలక మ్యాచ్‌‌ కావడంతో కూల్టర్‌‌నైల్‌‌, నీషమ్‌‌, బుమ్రా (2/14) సూపర్‌‌ బౌలింగ్‌‌తో ఆకట్టుకున్నారు. స్టార్టింగ్‌‌లో రాయల్స్‌‌ ఓపెనర్లు యశస్వి (12), లూయిస్‌‌ మెరుపు ఆరంభాన్నిచ్చే ప్రయత్నం చేశారు. సెకండ్‌‌ ఓవర్‌‌లో 6, 4, 4తో 15 రన్స్‌‌ రాబట్టి టచ్‌‌లోకి వచ్చారు. కానీ నాలుగో ఓవర్‌‌లో కూల్టర్‌‌నైల్‌‌ దెబ్బకు.. యశస్వి ఔట్‌‌కావడంతో వికెట్లపతనం మొదలైంది. ఆరో ఓవర్‌‌లో లూయిస్‌‌ను బుమ్రా ఎల్బీ చేయడంతో పవర్‌‌ప్లేలో రాయల్స్‌‌ 41/2 స్కోరు చేసింది. ఈ దశలో బౌలింగ్‌‌కు వచ్చిన నీషమ్‌‌.. రాజస్తాన్‌‌కు డబుల్‌‌ షాకిచ్చాడు. తన వరుస ఓవర్లలో కెప్టెన్‌‌ శాంసన్‌‌ (3), శివమ్‌‌ దూబే (3)ను ఔట్‌‌ చేయగా, కూల్టర్‌‌నైల్‌‌.. గ్లెన్‌‌ ఫిలిప్స్‌‌ (4)ను పెవిలియన్‌‌కు చేర్చాడు. 6 నుంచి 10 ఓవర్ల మధ్య 9 రన్స్‌‌కు 3 కీలక వికెట్లు కోల్పోవడంతో రాజస్తాన్‌‌ కోలుకోలేకపోయింది. మిల్లర్‌‌ (15), తెవాటియా (12) ఇన్నింగ్స్‌‌ను నిలబెట్టే ప్రయత్నం చేసినా... భారీ షాట్లు ఆడలేకపోయారు. దీంతో ఓవర్‌‌కు 4, 2, 6, 5 రన్స్‌‌ మాత్రమే వచ్చాయి. 15వ ఓవర్‌‌ నుంచి ముగ్గురు పేసర్లను మార్చిమార్చి ప్రయోగించిన రోహిత్‌‌ సక్సెస్‌‌ అయ్యాడు. 11 బాల్స్‌‌ తేడాలో తెవాటియా, శ్రేయస్‌‌ గోపాల్‌‌ (0), మిల్లర్‌‌ ఔటయ్యారు. చివర్లో చేతన్‌‌ సకారియా (6) నిరాశపర్చినా.. ముస్తాఫిజుర్‌‌ (8 నాటౌట్‌‌) ఓ భారీ సిక్సర్‌‌ బాదడంతో ఆ మాత్రం స్కోరైనా వచ్చింది. 


ఇషాన్‌‌ ధనాధన్​
చిన్న టార్గెట్‌‌ను ముంబై ఈజీగా ఛేజ్‌‌ చేసింది. 4, 6తో ఖాతా ఓపెన్‌‌ చేసిన రోహిత్‌‌.. సెకండ్‌‌ ఓవర్‌‌లో మరో సిక్స్​ కొట్టాడు.  కానీ సకారియా (1/36) బాల్‌‌కు షాట్‌‌ సరిగా కనెక్ట్‌‌ కాకపోవడంతో థర్డ్‌‌ ఓవర్‌‌లో ఔటయ్యాడు. ఇషాన్‌‌తో జతకలిసిన సూర్యకుమార్‌‌ (13) బౌండ్రీలతో జోరు చూపెట్టాడు. కానీ ఆరో ఓవర్‌‌లో ముస్తాఫిజుర్‌‌కు వికెట్‌‌ ఇచ్చుకోవడంతో సెకండ్‌‌ వికెట్‌‌కు 33 రన్స్‌‌ పార్ట్​నర్​షిప్​ బ్రేక్‌‌ అయ్యింది. ఓవరాల్‌‌గా  పవర్‌‌ప్లేలో ముంబై 56/2 స్కోరు చేసింది. ఇక బ్యాటింగ్‌‌ ఆర్డర్‌‌లో ముందుకొచ్చిన హార్దిక్‌‌ (5 నాటౌట్‌‌) నెమ్మదిగా ఆడినా, 8వ ఓవర్‌‌లో ఇషాన్‌‌ 4,6, 6 సహా 24 రన్స్‌‌ పిండుకున్నాడు. గెలవడానికి 72 బాల్స్‌‌లో 7 రన్స్‌‌ అవసరమైన దశలో 9వ ఓవర్‌‌లో ఇషాన్‌‌ వరుసగా 4, 6తో మ్యాచ్​ ముగించాడు. ఇషాన్‌‌, హార్దిక్‌‌ థర్డ్‌‌ వికెట్‌‌కు 18 బాల్స్‌‌లోనే 38 రన్స్‌‌ జోడించారు. 


సంక్షిప్త స్కోర్లు: 
రాజస్తాన్‌‌: 20 ఓవర్లలో 90/9 (లూయిస్‌‌ 24, కూల్టర్‌‌నైల్‌‌ 4/14, నీషమ్‌‌ 3/12). 
ముంబై: 8.2 ఓవర్లలో 94/2 (ఇషాన్‌‌ 50 నాటౌట్‌‌, రోహిత్‌‌ 22, ముస్తాఫిజుర్‌‌ 1/32).