హైదరాబాద్ రైజర్స్‌ పుంజుకునేనా ?.. నేడు ముంబైతో ఢీ

హైదరాబాద్ రైజర్స్‌ పుంజుకునేనా ?.. నేడు ముంబైతో ఢీ
  • మ్యాచ్ పై కరోనా నీలి నీడలు.. సాఫీగా సాగేనా..?

న్యూఢిల్లీ: కరోనా దెబ్బకు ఐపీఎల్‌‌పై నీలినీడలు కమ్ముకున్న వేళ.. పాయింట్స్‌‌ టేబుల్‌‌ల్లో చివరి ప్లేస్‌‌లో ఉన్న సన్‌‌రైజర్స్‌‌ హైదరాబాద్‌‌.. డిఫెండింగ్‌‌ చాంపియన్‌‌ ముంబై ఇండియన్స్‌‌తో రెండోసారి తలపడనుంది. ఏడు మ్యాచ్‌‌ల్లో ఆరింటిలో ఓడిన ఎస్‌‌ఆర్‌‌హెచ్‌‌ మంగళవారం జరిగే పోరులో ముంబైతో టఫ్‌‌ ఫైట్‌‌ ఎదుర్కోనుంది. ప్లే ఆఫ్స్‌‌ రేసులో నిలవాలంటే మిగిలిన ఏడు మ్యాచ్‌‌ల్లో కనీసం ఆరైనా నెగ్గాల్సిన పరిస్థితి తెచ్చుకున్న హైదరాబాద్‌‌కు ఈ పోరు చావోరేవో లాంటిదే. కొత్త కెప్టెన్‌‌ కేన్‌‌ విలియమ్సన్‌‌ సారథ్యంలో గత పోరులో రాజస్తాన్‌‌ చేతిలో చిత్తుగా ఓడిన రైజర్స్‌‌ డీలా పడింది. ముంబైపై గెలిస్తే మాత్రం కాన్ఫిడెన్స్‌‌ అమాంతం పెరగడం ఖాయం. కానీ, డిఫెండింగ్‌‌ చాంప్‌‌ను ఓడించాలంటే అద్భుతం చేయాల్సిందే. ముఖ్యంగా బౌలింగ్‌‌లో ఎస్‌‌ఆర్‌‌హెచ్‌‌ చాలా ఇంప్రూవ్‌‌ అవ్వాల్సి ఉంది.  అలాగే, బ్యాటింగ్‌‌లో కూడా తడబాటును వీడాల్సిందే. వార్నర్‌‌పై వేటు తర్వాత బెయిర్‌‌స్టోతో ఇన్నింగ్స్‌‌ ఆరంభించిన మనీశ్‌‌ పాండే ఆకట్టుకున్నా.. ఎప్పట్లానే మిడిలార్డర్‌‌ ప్రభావం చూపలేకపోయింది. ఈ సమస్యను పరిష్కరిస్తేనే  ఆరెంజ్‌‌ ఆర్మీ  పుంజుకోగలదు. మరోవైపు వరుసగా రెండు విక్టరీలతో  ముంబై ఫుల్‌‌ జోష్‌‌లో ఉంది. పైగా, పొలార్డ్‌‌ విధ్వంసకర ఇన్నింగ్స్‌‌తో చెన్నైపై భారీ టార్గెట్‌‌ను ఛేజ్‌‌ చేయడం, మిడిలార్డర్‌‌ క్లిక్‌‌ అవడంతో టీమ్‌‌ కాన్ఫిడెన్స్‌‌ రెట్టింపైంది. అదే ఊపుతో హైదరాబాద్‌‌ను మరోసారి ఓడించాలని చూస్తోంది. అయితే, కేకేఆర్‌‌ టీమ్‌‌లో ఇద్దరు ప్లేయర్లు, ఢిల్లీ గ్రౌండ్‌‌ స్టాఫ్‌‌లో కొందరు కరోనా బారిన పడడంతో  రెండు జట్లూ సోమవారం ప్రాక్టీస్‌‌ చేయలేదు. మ్యాచ్‌‌పై కూడా అనుమానాలు నెలకొన్నాయి.