సన్ రైజర్స్ కు హ్యాట్రిక్ ఓటమి

సన్ రైజర్స్ కు హ్యాట్రిక్ ఓటమి
  • దంచికొట్టిన డేవిడ్​, పావెల్​
  • కీలక మ్యాచ్‌‌లో ఢిల్లీ గెలుపు 
  • సన్​రైజర్స్​కు  హ్యాట్రిక్​ ఓటమి

ముంబై: బౌలింగ్‌‌లో ఫెయిలైన సన్‌‌రైజర్స్‌‌ హైదరాబాద్‌‌.. హ్యాట్రిక్‌‌ ఓటమిని మూటగట్టుకుంది. తన మాజీ టీమ్​పై డేవిడ్‌‌ వార్నర్‌‌ (58 బాల్స్‌‌లో 12 ఫోర్లు, 3 సిక్సర్లతో 92 నాటౌట్‌‌)తో పాటు  రొవ్‌‌మన్‌‌ పావెల్‌‌ (35 బాల్స్‌‌లో 3 ఫోర్లు, 6 సిక్సర్లతో 67 నాటౌట్‌‌) దంచికొట్టిన వేళ.. ఢిల్లీ క్యాపిటల్స్‌‌ కీలక విజయాన్ని అందుకుంది. దీంతో గురువారం జరిగిన మ్యాచ్‌‌లో డీసీ 21 రన్స్‌‌ తేడాతో హైదరాబాద్‌‌పై గెలిచింది. టాస్‌‌ ఓడిన  ఢిల్లీ తొలుత 20 ఓవర్లలో 207/3 స్కోరు చేసింది. ఛేజింగ్​లో హైదరాబాద్‌‌ 20 ఓవర్లలో 186/6కే పరిమితమైంది.  నికోలస్‌‌ పూరన్‌‌ (34 బాల్స్‌‌లో 2 ఫోర్లు, 6 సిక్సర్లతో 62), మార్‌‌క్రమ్‌‌ (25 బాల్స్‌‌లో 4 ఫోర్లు, 3 సిక్సర్లతో 42) పోరాడినా ప్రయోజనం లేకపోయింది. ఖలీల్‌‌ 3, శార్దూల్‌‌ 2 వికెట్లు తీశారు. వార్నర్‌‌కు ‘ప్లేయర్‌‌ ఆఫ్‌‌ ద మ్యాచ్’ అవార్డు లభించింది. 

వార్నర్‌‌, పావెల్‌‌ ధనాధన్​..

ఇన్నింగ్స్‌‌ ఐదో బాల్‌‌కే మన్‌‌దీప్‌‌ (0) వికెట్‌‌ కోల్పోయినా... ఢిల్లీ ఇన్నింగ్స్‌‌లో ఎక్కడా వేగం తగ్గలేదు. క్రీజులోకి వచ్చిన ప్రతి బ్యాటర్‌‌ భారీ షాట్లు కొట్టడంతో రన్‌‌రేట్‌‌ వాయువేగంతో దూసుకెళ్లింది. ఓ ఎండ్‌‌లో వార్నర్‌‌ పాతుకుపోగా, రెండో ఓవర్‌‌లో రెండు ఫోర్లతో మార్ష్‌‌ (10) టచ్‌‌లోకి వచ్చాడు.   ఉమ్రాన్‌‌ వేసిన నాలుగో ఓవర్‌‌లో వార్నర్‌‌ 4, 4, 6తో 21 రన్స్‌‌ రాబట్టాడు. అయితే ఐదో ఓవర్‌‌ ఫస్ట్‌‌ బాల్‌‌ను బౌండ్రీ దాటించిన మార్ష్‌‌ తర్వాతి బంతికి వెనుదిరిగాడు. ఈ దశలో వచ్చిన రిషబ్‌‌ పంత్‌‌ (26) ఉన్నంతసేపు అల్లాడించాడు. ఆరో ఓవర్‌‌లో వార్నర్‌‌ రెండు ఫోర్లతో పవర్‌‌ప్లేలో డీసీ 50/2 స్కోరు చేసింది. 8వ ఓవర్‌‌లో సిక్సర్‌‌తో వార్నర్‌‌ టీ20ల్లో 400 సిక్సర్ల వీరుడిగా నిలిచాడు. స్పిన్నర్‌‌ శ్రేయస్‌‌ గోపాల్‌‌ (1/34) వేసిన 9వ ఓవర్‌‌లో పంత్‌‌ 6,6,6, 4 కొట్టినా.. లాస్ట్‌‌ బాల్‌‌కు వెనుదిరిగాడు. ఫలితంగా మూడో వికెట్‌‌కు 48 రన్స్‌‌ భాగస్వామ్యం ముగిసింది. రెండు వికెట్లు పడినా వార్నర్‌‌ జోరు తగ్గకపోవడంతో ఫస్ట్‌‌ టెన్‌‌లో డీసీ 91/3తో నిలిచింది. 11వ ఓవర్‌‌లో పావెల్‌‌ సిక్సర్‌‌తో జోరు పెంచాడు. ఆ వెంటనే వార్నర్‌‌ ఫోర్‌‌తో 34 బాల్స్‌‌లో ఫిఫ్టీ మార్క్‌‌ అందుకున్నాడు. 13, 14 ఓవర్లలో సిక్స్‌‌, ఫోర్‌‌తో వార్నర్‌‌ మరింత రెచ్చిపోగా, తర్వాతి ఓవర్‌‌లో పావెల్‌‌ ఇచ్చిన ఈజీ క్యాచ్‌‌ను విలియమ్సన్‌‌ డ్రాప్‌‌ చేశాడు. దీంతో ఐదు ఓవర్లలో 46 రన్స్‌‌ వచ్చాయి. ఇక్కడి నుంచి గేర్‌‌ మార్చిన పావెల్‌‌.. భువీ (1/25), అబాట్‌‌ (1/47), త్యాగీ (0/37), ఉమ్రాన్‌‌ (0/52) ఓవర్లలో 5 సిక్సర్లు, 3 ఫోర్లు బాదితే, వార్నర్‌‌ 4 ఫోర్లు దంచాడు. లాస్ట్‌‌ ఓవర్‌‌లో 19 రన్స్‌‌తో కలిపి ఆఖరి ఐదు ఓవర్లలో 70 రన్స్‌‌ వచ్చాయి. ఈ ఇద్దరు నాలుగో వికెట్‌‌కు 66 బాల్స్‌‌లో 122 రన్స్‌‌ జోడించడంతో డీసీ భారీ టార్గెట్‌‌ను నిర్దేశించింది.  

పూరన్‌‌, మార్‌‌క్రమ్‌‌ పోరాటం..

భారీ లక్ష్యాన్ని ఛేదించడంలో హైదరాబాద్‌‌ ఓపెనర్లు అభిషేక్‌‌ (7), విలియమ్సన్‌‌ (4) విఫలమయ్యారు. ఢిల్లీ పేస్‌‌ త్రయాన్ని దీటుగా ఎదుర్కోలేక 24 రన్స్‌‌కే వీళ్లు ఇద్దరూ వెనుదిరిగారు. వన్‌‌డౌన్‌‌లో వచ్చిన రాహుల్‌‌ త్రిపాఠి (22) రెండు ఫోర్లు, సిక్స్‌‌తో జోరు పెంచినా.. ఏడో ఓవర్‌‌లోనే వికెట్‌‌ ఇచ్చుకున్నాడు. 37/3 స్కోరు వద్ద వచ్చిన మార్‌‌క్రమ్‌‌, పూరన్‌‌ నిలకడగా ఆడటంతో.. పవర్‌‌ప్లేలో 35/2 స్కోరు చేసిన హైదరాబాద్‌‌.. ఫస్ట్‌‌ టెన్‌‌లో 63/3కి చేరింది. చేయాల్సిన రన్‌‌రేట్‌‌ భారీగా ఉండటంతో 11వ ఓవర్‌‌ నుంచి మార్‌‌క్రమ్‌‌ దూకుడు పెంచాడు. ఈ ఓవర్‌‌లో మూడు ఫోర్లతో పాటు కుల్దీప్‌‌ (1/40) వేసిన తర్వాతి ఓవర్‌‌లో రెండు భారీ సిక్సర్లు సంధించాడు. 13వ ఓవర్‌‌ లాస్ట్‌‌ బాల్‌‌కు మార్‌‌క్రమ్‌‌ ఔట్‌‌కావడంతో నాలుగో వికెట్‌‌కు 60 రన్స్‌‌ పార్ట్‌‌నర్‌‌షిప్‌‌ ముగిసింది. 14వ ఓవర్‌‌ నుంచి పూరన్‌‌ సిక్సర్లు, ఫోర్ల బాట పట్టాడు. నోర్జ్‌‌ (1/35), శార్దూల్‌‌ ఓవర్లలో మూడు సిక్సర్లు, ఓ ఫోర్‌‌ కొట్టినా, శశాంక్‌‌ (10) ఔట్‌‌కావడంతో రైజర్స్‌‌ మళ్లీ కష్టాల్లో పడింది. తర్వాత కొద్దిసేపటికే అబాట్‌‌ (7), పూరన్‌‌ ఔటయ్యారు. శ్రేయస్‌‌ గోపాల్‌‌ (9 నాటౌట్‌‌) రెండు బౌండ్రీలు బాదినా చేయాల్సిన రన్స్‌‌ ఎక్కువగా ఉండటంతో హైదరాబాద్‌‌కు ఓటమి తప్పలేదు. 

ఉమ్రాన్‌‌@157 కి.మీ వేగం

సన్‌‌రైజర్స్‌‌ స్పీడ్‌‌స్టర్‌‌ ఉమ్రాన్‌‌ మాలిక్‌‌ తన వేగంతో ఔరా అనిపిస్తున్నాడు. ఢిల్లీ ఇన్నింగ్స్​ చివరి ఓవర్​ నాలుగో బాల్‌‌ను అతను ఏకంగా 157 కి.మీ స్పీడుతో వేశాడు. దాంతో మెగా లీగ్​లో ఎక్కువ వేగంతో బౌలింగ్​ చేసిన ఇండియన్​గా రికార్డు సృష్టించాడు. ఓవరాల్​గా సెకండ్​ ఫాస్టెస్ట్​ బౌలర్​గా నిలిచాడు. రాజస్తాన్​కు ఆడిన ఆస్ట్రేలియా పేసర్‌‌ షాన్‌‌ టై అత్యధికంగా 157.71 కి.మీ వేగంతో బౌలింగ్​ చేసి టాప్​లో ఉన్నాడు.

వార్నర్‌‌ 89 ఫిఫ్టీలు

టీ20ల్లో అత్యధికంగా 89 హాఫ్‌‌ సెంచరీలు కొట్టిన ప్లేయర్‌‌గా వార్నర్‌‌ ప్రపంచ  రికార్డు సృష్టించాడు. 88 ఫిఫ్టీలతో ఉన్న క్రిస్‌‌ గేల్‌‌ను వెనక్కునెట్టాడు.

సంక్షిప్త స్కోర్లు

ఢిల్లీ: 20 ఓవర్లలో 207/3 (వార్నర్‌‌ 92*, పావెల్‌‌ 67*, భువనేశ్వర్‌‌ 1/25). 
హైదరాబాద్‌‌: 20 ఓవర్లలో 186/8 (పూరన్‌‌ 62, మార్‌‌క్రమ్‌‌ 42, ఖలీల్‌‌ అహ్మద్‌‌ 3/30).