ఢిల్లీ క్యాపిటల్స్ పై లక్నో విక్టరీ

ఢిల్లీ క్యాపిటల్స్ పై లక్నో విక్టరీ

నావి ముంబై:  చిన్న టార్గెట్‌‌‌‌ ఛేజింగ్‌‌లో చివరిదాకా పోరాడిన లక్నో సూపర్ జెయింట్స్ ఐపీఎల్15వ సీజన్​లో హ్యాట్రిక్‌‌ విక్టరీ సాధించింది. నాణ్యమైన బౌలింగ్‌‌కు తోడు క్వింటన్ డికాక్ (52 బాల్స్ లో 9 ఫోర్లు, 2 సిక్సర్లతో 80) సూపర్ హాఫ్ సెంచరీతో సత్తా చాటడంతో  గురువారం ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన మ్యాచ్​లో ఆరు వికెట్ల తేడాతో గెలిచింది. నాలుగు మ్యాచ్‌‌ల్లో లక్నోకు ఇది  వరుసగా మూడో విక్టరీ కాగా..  ఢిల్లీకి వరుసగా రెండో ఓటమి. టాస్ ఓడి  బ్యాటింగ్‌‌కు వచ్చిన ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో 149/3 స్కోరు చేసింది. ఓపెనర్ పృథ్వీ షా (34 బాల్స్ లో 9 ఫోర్లు, 2 సిక్సర్లతో 61) హాఫ్ సెంచరీతో రాణించాడు.  లక్నో బౌలర్లలో రవి బిష్నోయ్ (2/22) రెండు వికెట్లు తీశాడు. ఛేజింగ్ లో డికాక్‌‌  రాణించడంతో లక్నో 19.4 ఓవర్లలో 155/4 స్కోర్ చేసి గెలిచింది. డికాక్​కు ప్లేయర్‌‌ ఆఫ్‌‌ ద మ్యాచ్‌‌ లభించింది.  

పృథ్వీ దంచినా.. 

ఓపెనర్​ పృథ్వీ షా ఫటాఫట్​ ఇన్నింగ్స్​తో పవర్​ప్లేలోనే యాభై రన్స్​ వచ్చినప్పటికీ.. కెప్టెన్​ రిషబ్​ పంత్​(36 బాల్స్ లో 39 నాటౌట్), సర్ఫ్ రాజ్ (28 బాల్స్ లో 36 నాటౌట్)   స్టయిల్​కు భిన్నంగా నింపాదిగా ఆడటంతో ఢిల్లీ తక్కువ స్కోరుకే పరిమితమైంది. స్టార్టింగ్​లో మాత్రం పృథ్వీ షో నడిచింది. ఈ సీజన్​లో తొలి మ్యాచ్​ ఆడుతున్న వార్నర్​ (12 బాల్స్​లో 4) ఇబ్బంది పడ్డా షా  మాత్రం ఎక్కడా తగ్గలేదు.  రెండో ఓవర్లో బౌండ్రీల వేట ప్రారంభించిన షా.. తర్వాతి ఓవర్లో సిక్స్, ఫోర్ తో పాటు ఆవేశ్ ఖాన్ బౌలింగ్​లో హ్యాట్రిక్ ఫోర్లు బాదాడు. క్రునాల్​ వేసిన ఏడో ఓవర్​లో డబుల్​తో 30 బాల్స్​లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. గౌతమ్ బౌలింగ్​లో  6,4 కొట్టిన  పృథ్వీ..  తర్వాతి బంతికే ఔటవడంతో ఫస్ట్ వికెట్ కు 67 రన్స్ పార్ట్ నర్ షిప్ ముగిసింది. ఆ తర్వాత ఢిల్లీ ఇన్నింగ్స్​ పూర్తిగా డీలా పడ్డది. మళ్లీ బౌలింగ్​కు వచ్చిన బిష్నోయ్ వరుస ఓవర్లలో వార్నర్, పావెల్ (3)ను ఔట్ చేసి ఢిల్లీని దెబ్బకొట్టాడు. అతనితో పాటు గౌతమ్​, ఆండ్రూ టై కట్టుదిట్టంగా బౌలింగ్​ చేయడంతో పంత్​, సర్ఫ్​రాజ్​ సింగిల్స్​కే ఇబ్బంది పడ్డారు. 12వ ఓవర్​ను గౌతమ్​ మెయిడిన్​ చేశాడు. లీగ్​లో పంత్ ఒక ఓవర్లో పరుగులేమీ చేయకపోవడం ఇదే తొలిసారి.  తొలి 20 బాల్స్​లో పంత్​ 12 రన్సే చేయడంతో 15 ఓవర్లకు ఢిల్లీ 99/3తో నిలిచింది. టై వేసిన తర్వాతి ఓవర్లో పంత్ రెండు సిక్స్ లు, ఓ ఫోర్ బాదడంతో ఢిల్లీ ట్రాక్ లోకి వచ్చినట్లు కనిపించింది. ఆపై, అవేశ్​ బౌలింగ్​లో సర్ఫ్​రాజ్​ రెండు ఫోర్లు కొట్టాడు. కానీ, చివరి మూడు ఓవర్లలో ఒక్కటే ఫోర్​ ఇచ్చిన లక్నో బౌలర్లు.. ఢిల్లీని 150 లోపే కట్టడి చేశారు. 

డికాక్ వన్ మ్యాన్ షో

లక్నో ఇన్నింగ్స్‌‌లో డికాక్‌‌ హీరోగా నిలిచాడు. తను దంచినా మధ్యలో కాస్త తడబడ్డ సూపర్‌‌ జెయింట్స్‌‌ విజయం కోసం చివరి ఓవర్‌‌ దాకా ఆడాల్సి వచ్చింది. తొలుత  ఢిల్లీ బౌలర్లు లైన్ అండ్ లెంగ్త్ కు కట్టుబడటంతో ఓపెనర్లు రాహుల్ (24), డికాక్ సింగిల్స్, డబుల్స్ తోనే స్కోర్ ను ముందుకు నడిపారు. అన్రిచ్‌‌ వేసిన ఐదో ఓవర్లో డికాక్ హ్యాట్రిక్ ఫోర్లు, ఓ సిక్స్ బాదడంతో పవర్ ప్లే లో లక్నో స్కోర్ 48/0. ఇక పదో ఓవర్లో రాహుల్ ను కుల్దీప్ పెవిలియన్ పంపడంతో సగం ఇన్నింగ్స్ ముగిసేసరికి లక్నో 74/1తో నిలిచింది. కాగా, కుల్దీప్ వేసిన 12వ ఓవర్లో ఫోర్ తో డికాక్ హాఫ్ సెంచరీ (36 బాల్స్ లో) పూర్తి చేసుకున్నాడు. ఎవిన్ లూయిస్ (5) విఫలమైనా..డికాక్ కు దీపక్ హుడా(11) సపోర్ట్ ఇచ్చాడు.  దీంతో 15 ఓవర్లలో 111/2తో నిలిచిన లక్నోకు చివరి 30 బాల్స్ లో 39 రన్స్ అవసరమయ్యాయి. అయితే 16వ ఓవర్లో అన్రిచ్‌‌ రెండోసారి బీమర్ వేయడంతో అతడిని బౌలింగ్ నుంచి తప్పించాల్సి వచ్చింది. అతడి కోటాను పూర్తి చేసేందుకు బంతిని అందుకున్న కుల్దీప్ రెండు ఫోర్లు ఇచ్చినా డికాక్ ను ఔట్ చేసి ఢిల్లీకి బ్రేక్ ఇచ్చాడు. ఆపై హుడా, క్రునాల్ పాండ్యా (19 నాటౌట్) ఆచితూచి ఆడటంతో తర్వాతి రెండు ఓవర్లలో 9 రన్సే వచ్చాయి. దీంతో సమీకరణం 12 బాల్స్ లో 19గా మారింది. అయితే ముస్తాఫిజుర్ వేసిన 19వ ఓవర్లో సిక్స్ సహా మొత్తం 16 రన్స్ రావడంతో లక్నో విక్టరీకి ఆఖరి ఓవర్లో 5 రన్స్ కావాల్సి వచ్చింది. చివరి ఓవర్ ఫస్ట్ బాల్ కే హుడా ఔటైనా.. క్రీజులోకి వచ్చిన ఆయుష్ బదోని(10 నాటౌట్) ఫోర్, సిక్స్ తో మ్యాచ్‌‌ ముగించాడు.