IPL 2024: ఐపీఎల్ చరిత్రలోనే ఖరీదైన ఆటగాడు.. ఒక్కో బాల్‌కు 7 లక్షలు

IPL 2024: ఐపీఎల్ చరిత్రలోనే ఖరీదైన ఆటగాడు.. ఒక్కో బాల్‌కు 7 లక్షలు

క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా తిలకిస్తున్న ఐపీఎల్ మినీ వేలం ఊహించిన దానికంటే ఎక్కువ మజాను పంచుతోంది. ఆసీస్ బౌలర్లు మిచెల్ స్టార్క్, పాట్ క‌మిన్స్  కోట్లు కొల్లగొట్టారు. 16 ఐపీఎల్ చరిత్రలో కొత్త రికార్డులు సృష్టించారు. ఆసీస్ లెఫ్టార్మ్ పేస‌ర్ మిచెల్ స్టార్క్(Mitchell Starc) ఐపీఎల్ చ‌రిత్ర‌లోనే అత్య‌ధిక ధ‌ర ప‌లికిన ఆటగాడిగా నిలిచాడు. కోల్‌క‌తా నైట్ రైడ‌ర్స్(కేకేఆర్) యాజమాన్యం రూ.24.75 కోట్లు వెచ్చించి అతన్ని చేజిక్కించుకుంది.

అంతకుముందు త‌న స‌హ‌చ‌రుడు, ఆసీస్ కెప్టెన్ పాట్ క‌మిన్స్(రూ.20.5 కోట్లు) పలకగా, స్టార్క్ ఆ రికార్డును బ‌ద్ధ‌లు కొట్టాడు. రూ. 2 కోట్ల‌ క‌నీస ధ‌రతో వేలంలోకి వచ్చిన ఈ యార్క‌ర్ కింగ్ కోసం కోల్‌క‌తా నైట్ రైడ‌ర్స్, గుజ‌రాత్ టైటాన్స్ నువ్వానేనా అన్నట్టు పోటీ ప‌డ్డాయి. అయితే, చివరి నిమిషంలో గుజరాత్ వెనక్కు తగ్గడంతో అతడు కోల్‌క‌తా వశం అయ్యాడు.

ఒక్కో బాల్‌కు 7 లక్షలు

స్టార్క్ కోసం కేకేఆర్ ఫ్రాంచైజీ వెచ్చించిన రూ. 24.75 కోట్ల ధరను పరిశీలిస్తే, ఐపీఎల్ 2024 సీజన్‌లో అతను ఒక్కో బంతికి సగటున 7 లక్షలు అందుకోనున్నాడు. ఈ టోర్నీ లీగ్ దశలో ప్రతి జట్టు 14 మ్యాచ్‌లు ఆడనుంది. ఈ 14 మ్యాచ్‌లలో అతడు తన నాలుగు ఓవర్ల కోటాను బౌలింగ్ చేస్తే.. మొత్తంగా 336 బంతులు వేస్తాడు. ఈ లెక్కన సగటున బంతికి రూ. 7,36,607 సంపాదిస్తాడు. అదే కోల్‌క‌తా నైట్ రైడ‌ర్స్ జట్టు ప్లేఆఫ్‌కు చేరి ఫైనల్స్ కు దూసుకెళ్లినా ఒక్కో బాల్‌కు 5 లక్షలు పైబడే అందుకోనున్నాడు.

ఈ లెక్కలు తెలిసి అభిమానులు నోరెళ్ళ బెడుతున్నారు. ఒక్కో బాల్‌కు 7 లక్షలు ఏంట్రా బాబోయ్ అని కామెంట్లు పెడుతున్నారు. మరోవైపు, రూ.20.5 కోట్లు ధరకు సన్ రైజర్స్ సొంతం చేసుకున్న పాట్ క‌మిన్స్ పైనే ఇదే చర్చ జరుగుతోంది.మరి వీరిద్దరూ ఆ ధరకు న్యాయం చేస్తారో లేదో చూడాలి.