IPL 2024: ముంబై జట్టులో మరో వివాదం.. పాండ్యా కెప్టెన్సీపై విదేశీ క్రికెటర్ అసంతృప్తి

IPL 2024: ముంబై జట్టులో మరో వివాదం.. పాండ్యా కెప్టెన్సీపై విదేశీ క్రికెటర్ అసంతృప్తి

ఏ ముహూర్తాన హార్దిక్ పాండ్యా.. ముంబై ఇండియన్స్ జట్టు పగ్గాలు చేపట్టాడో కానీ, ఆరోజు నుంచి అతనికి నిద్ర కూడా కరువైంది. జట్టు ఓటములకు అతన్ని బాధ్యుణ్ణి చేస్తూ విమర్శించని అభిమాని లేరు. పోనీ, సహచర ఆటగాళ్ల నుంచైనా అతనికి మద్దతు లభిస్తోందా..! అంటే అదీ లేదు. మైదానంలో అతని మాట ఎవ్వరూ వినట్లేరు. అతని నిర్ణయాలకు తలూపుతూనే.. రోహిత్ శర్మ చెప్పినట్లుగా నడుచుకుంటున్నారు. వీటన్నిటినీ పక్కనపెడితే, ఇప్పుడు ఏకంగా ఆ జట్టు విదేశీ ఆటగాడు ఒకరు.. పాండ్యా కెప్టెన్సీని విమర్శిస్తూ నెట్టింట పోస్ట్ పెట్టాడు. 

గురువారం(ఏప్రిల్ 19) ముల్లన్‌పూర్ వేదికగా ముంబై ఇండియన్స్, పంజాబ్ కింగ్స్‪ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ ఆఖరి ఓవర్ వరకూ హోరాహోరీగా సాగింది. మొదట ముంబై 192 పరుగుల భారీ స్కోర్ చేసినప్పటికీ.. పాండ్యా కెప్టెన్సీ పొరపాట్ల వల్ల మ్యాచ్ కోల్పోయేలా కనిపించింది. అదే ఆ జట్టు ఆల్ రౌండర్, ఆఫ్ఘన్ క్రికెటర్ మహమ్మద్ నబీకి ఆగ్రహాన్ని తెప్పించింది. దీంతో ఈ విదేశీ క్రికెటర్.. తనకు బౌలింగ్ ఇవ్వకపోవడం పట్ల పాండ్యాను విమర్శిస్తూ నెట్టింట పోస్ట్ పెట్టారు. 

Also Read:ప్రేయసితో నిశ్చితార్థం చేసుకున్న మహిళా క్రికెటర్

"కొన్నిసార్లు కెప్టెన్లు తీసుకునే నిర్ణయాలు చాలా వింతగా ఉంటాయి. ప్రజలను ఆశ్చర్యపరుస్తాయి! నబీ ఇవాళ బౌలింగ్ చేయలేదు!.." అని నబీ.. పాండ్యా నిర్ణయాలను వ్యతిరేకిస్తూ పోస్ట్ పెట్టాడు. కొద్దిసేపటి అనంతరం అతను ఆ పోస్ట్ డిలీట్ చేసినప్పటికీ.. అప్పటికే జరగరాని నష్టం జరిగిపోయింది. నెటిజెన్స్.. స్క్రీన్ షాట్లను విచ్చవిడిగా ప్రచారం చేశారు. నిజానికి నబీ.. గొప్ప ఆల్ రౌండర్. వికెట్లు పడగొట్టకపోయినా.. పరుగులు ఇవ్వకుండా కట్టడి చేయగల సమర్థుడు. అలాంటి అతన్ని విస్మరించడం పాండ్యా చేసిన తప్పని నెటిజెన్స్ కామెంట్లు చేస్తున్నారు.