IPL 2024: ఒక్కడి కోసం వంద కోట్లు!.. పాండ్యా ట్రేడింగ్ వెనుక కోట్ల రూపాయల వ్యాపారం

IPL 2024: ఒక్కడి కోసం వంద కోట్లు!.. పాండ్యా ట్రేడింగ్ వెనుక కోట్ల రూపాయల వ్యాపారం

ఐపీఎల్ 2024 మినీ వేలానికి కొద్ది రోజుల ముందు భారత ఆల్‌రౌండ‌ర్ హార్దిక్ పాండ్యా ముంబై ఇండియన్స్ చెంతకు చేరిన విషయం తెలిసిందే. ఐపీఎల్ ట్రేడ్ విండో ద్వారా ముంబై.. గుజ‌రాత్ టైటాన్స్ నుంచి అతన్ని కొనుగోలు చేసింది. అయితే.. ఈ ఆల్‌రౌండ‌ర్ కోసం అంబానీ కుటుంబం ఏకంగా రూ.100 కోట్లు గుజ‌రాత్‌కు ముట్టచెప్పిందని నివేదికలు వస్తున్నాయి.

ఇండియన్ ఎక్స్ ప్రెస్ నివేదిక ప్రకారం.. హార్దిక్ బదిలీ కోసం ముంబై ఇండియన్స్..  గుజ‌రాత్‌కు భారీ రుసుము చెల్లించినట్లు వెల్లడించింది. నిర్దిష్ట సంఖ్య ఎంతనేది తెలియరానప్పటికీ, టైటాన్స్ కు బదిలీ ఫీజుగా రూ .100 కోట్లు చెల్లించి ఉండొచ్చని అంచనా వేసింది. ఇప్పుడు ఈ అంశం క్రికెట్ ప్ర‌పంచాన్ని కుదిపేస్తోంది. ఒక్కడి కోసం వంద కోట్లు ఖర్చు పెట్టారా..! అని అందరూ ఆశ్చర్యపోతున్నారు. నిజానికి ఒక సీజన్ లో ఒక ఐపీఎల్ ప్రాంచైజీ ఆటగాళ్లపై ఖర్చు చేయాల్సిన మొత్తం అది(రూ.100 కోట్లు). అలాంటిది పాండ్యా ఒక్కడి కోసం నీతా అంబానీ అంత ధైర్యం ఎందుకు చేసిందని అందరూ ఆరా తీస్తున్నారు.

మిషన్ 2025

పాండ్యా కోసం ముంబై ఇండియన్స్ అంతలా పరితపించడానికి ప్రధాన కారణం 2025 మెగా వేలం. 2025 సీజన్‌కు ముందు ప్రతి జట్టు ముగ్గురు ఆటగాళ్లను మాత్రమే అంటిపెట్టుకొని.. మిగిలిన వారందరిని వేలంలోకి వదలాలి. అదే జరిగితే ముంబై.. సూర్యకుమార్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా సహా మరో ఆటగాడిని అంటిపెట్టుకోవచ్చు. ప్రస్తుతానికి రోహిత్ శర్మ క్రికెట్ కెరీర్‌కు ఎలాంటి ముప్పు లేనప్పటికీ వచ్చే ఏడాది అతను క్రికెట్ నుంచి తప్పుకోవచ్చన్న ఊహాగానాలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే అతని స్థానంలో జట్టును నడిపించగల ఆటగాడిగా పాండ్యాను ముంబై ఎంచుకొని ఉండొచ్చనేది నివేదికల ద్వారా స్పష్టమవుతోంది. 

వ్యాపార కోణం..!

ఐపీఎల్ ప్రాంచైజీల్లో ముంబై ఇండియన్స్ అతి పెద్ద మార్కెట్ బ్రాండ్ గా ఉన్న విషయం తెలిసిందే. 2021 సీజన్ లో సీవీసీ క్యాపిటల్ ఐపీఎల్ లో భాగం కావడానికి ముంబైకి రూ.5625 కోట్లు చెల్లించింది. అలాగే, అంబానీ కుటుంబానికి వ్యాపార సామ్రాజ్యం ఉంది. కానీ గుజ‌రాత్ కు అలా కాదు. పాండ్యాతో జరిగిన వాణిజ్య ఒప్పందంతో గుజరాత్ పర్సు రూ.15 కోట్లు పెరగడం అందుకు మంచిగా భావించింది. అలాగే, ఈ డీల్ ద్వారా వచ్చే ఆదాయం తమకు లాభదాయకమని భావించడంతో అతన్ని వదులుకుకోవడానికి ఇష్టపడిందని సమాచారం.