MI vs RR: ముంబై vs రాజస్థాన్.. గెలుపెవరిది?

MI vs RR: ముంబై vs రాజస్థాన్.. గెలుపెవరిది?

ఐపీఎల్ లో నేడు మరో హై వోల్టేజ్ మ్యాచ్ కు రంగం సిద్ధమైంది. రాజస్థాన్ రాయల్స్ తో ముంబై ఇండియన్స్ తలపడనుంది. ముంబైలోని వాంఖడే స్టేడియం ఈ మ్యాచ్ కు ఆతిధ్యమిస్తుంది. ఇరు జట్లు బలంగా ఉండడంతో మ్యాచ్ హోరాహోరీగా సాగడం ఖాయంగా కనిపిస్తుంది. సాయంత్రం 7:30 నిమిషాలకు మ్యాచ్ ప్రారంభమవుతుంది. ఈ మ్యాచ్ లో ఇరు జట్ల బలాబలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు ఒకసారి చూద్దాం

ముంబై ఇండియన్స్ :

టోర్నీలో ముంబై జట్టుకు ఇప్పటివరకు మంచి ఆరంభం లభించలేదు. స్టార్లతో కళకళాడుతున్న ఆ జట్టు.. ఆడిన రెండు మ్యాచ్ ల్లో బోణీ కొట్టలేకపోయింది. తొలి మ్యాచ్ లో గుజరాత్ చేతిలో 6 పరుగుల తేడాతో.. సన్ రైజర్స్ హైదరాబాద్ తో 31 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. బ్యాటింగ్ లో రాణిస్తే బౌలింగ్ లో విఫలం కావడం.. బౌలింగ్ లో రాణిస్తే బ్యాటింగ్ లో విఫలం కావడం ఆ జట్టుకు ప్రతి కూలంగా మారింది. బ్యాటింగ్ లో తిలక్ వర్మ, రోహిత్ శర్మ మినహా ఎవరు నిలకడగా రాణించడం లేదు. ఇక బౌలింగ్ విషయానికి వస్తే బుమ్రా మాత్రమే పొదుపుగా బౌలింగ్ చేస్తుంటే.. మిగిలినవారందరూ ధారాళంగా పరుగులు సమర్పించుకుంటున్నారు. కెప్టెన్ హార్దిక్ పాండ్య అటు ఆటగాడిగా, ఇటు కెప్టెన్ గా విఫలమవడం జట్టుకు ప్రధాన సమస్యగా మారింది. 

                          
ముంబై తొలిసారి ఈ టోర్నీలో సొంతగడ్డపై ఆడుతుండడం ఆ జట్టుకు ఊరట. ఇక్కడ రికార్డ్స్ అన్ని ముంబైకు అనుకూలంగా ఉన్నాయి. ఓపెనర్ ఇషాన్ కిషాన్ గాడిలో పడాల్సి ఉంది. మిడిల్ ఆర్డర్ లో పాండ్య, టిం డేవిడ్ రాణించడంపైనే ఈ మ్యాచ్ లో ముంబై విజయవకాశాలు ఆధారపడి ఉన్నాయి. బౌలింగ్ లో తొలి మ్యాచ్ లో ఘోరంగా విఫలమైన మఫాకా స్థానంలో శ్రీలంక యార్కర్ల వీరుడు నువాన్ తుషార తుది జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. స్పిన్నర్లు ఇప్పటివరకు ఈ టోర్నీలో పెద్దగా ప్రభావం చూపలేదు. షామ్స్ మూలాని , సీనియర్ స్పిన్నర్ పీయూష్ చావ్లా రాణిస్తే ముంబైకి ఈ మ్యాచ్ లో తిరుగుండదు

రాజస్థాన్ రాయల్స్ :

ఐపీఎల్ లో అత్యంత పటిష్టమైన జట్లలో రాజస్థాన్ రాయల్స్ ఒకటి. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో ఆ జట్టు సమతుల్యంగా కనిపిస్తుంది. ఇప్పటివరకు టోర్నీలో ఆడిన రెండు మ్యాచ్ లోనూ విజయం సాధించి ఆత్మవిశ్వాసంతో కనిపిస్తుంది. ఈ రోజు ముంబైకు సొంతగడ్డపై షాకిచ్చి హ్యాట్రిక్ విజయాన్ని అందుకోవాలని చూస్తుంది. తొలి మ్యాచ్ లో లక్నోపై 20 పరుగుల తేడాతో.. రెండో మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ తో 12 పరుగులతో విజయాన్ని అందుకుంది.

బ్యాటింగ్ లో రాజస్థాన్ పెద్దగా ఆకట్టుకోలేదు. రియాన్ పరాగ్, సంజు శాంసన్ మినహాయిస్తే ఎవరూ చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ ఆడలేదు. ముఖ్యంగా పరాగ్ రాయల్స్ జట్టులో టాప్ ఫామ్ లో ఉన్నాడు. తొలి మ్యాచ్ లో 43, రెండో మ్యాచ్ లో 85 పరుగులు చేసి జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఢిల్లీతో జరిగిన మ్యాచ్ లో 35 పరుగులకే 3 వికెట్లు పడినా.. ఒంటరి పోరాటం చేసి జట్టు స్కోర్ ను 180 పరుగులకు చేర్చాడు. ఓపెనర్లు జైస్వాల్, బట్లర్ ఆడిన రెండు మ్యాచ్ ల్లో విఫలమయ్యారు. వీరిద్దరూ తమ ఫామ్ అందుకుంటే ముంబైకు కష్టాలు తప్పవు.
 
ఇక బౌలింగ్ విషయంలో ఆ జట్టు దుర్బేధ్యంగా కనిపిస్తుంది. బోల్ట్, బర్గర్, ఆవేశ్ ఖాన్, సందీప్ శర్మలతో పేస్ విభాగం పటిష్టంగా కనిపిస్తుంది. అశ్విన్, చాహల్ రూపంలో ఇద్దరూ నాణ్యమైన స్పిన్నర్లు ఉండనే ఉన్నారు. వీళ్ళ బౌలింగ్ తట్టుకొని ఆడటం ముంబై జట్టుకు పెద్ద సవాలే. ముఖ్యంగా డెత్ ఓవర్లలో సందీప్ శర్మ, ఆవేశ్ ఖాన్ అద్భుతంగా బౌలింగ్ చేస్తూ మ్యాచ్ లను గెలిపిస్తున్నారు. 

ఇరు జట్లను పరిశీలిస్తే ఈ మ్యాచ్ ముంబై ఇండియన్స్ బ్యాటింగ్, రాజస్థాన్ రాయల్స్ బౌలర్ల మధ్య జరిగే పోరులా కనిపిస్తుంది. సొంతగడ్డపై ఆడుతుండడంతో ఈ మ్యాచ్ లో ముంబైకు ఎక్కువగా విజయావకాశాలు ఉండొచ్చు. ముంబైకు 55 శాతం గెలిచే ఛాన్స్ ఉంటే రాజస్థాన్ కు 45 శాతం అవకాశాలు ఉన్నాయి. మొత్తానికి ఈ మ్యాచ్ లో పటిష్టమైన రాజస్థాన్ ను ఓడించి ముంబై ఈ టోర్నీలో బోణీ కొడుతుందో లేదో సొంతగడ్డపై ముంబైకు షాక్ ఇచ్చి రాజస్థాన్ వరుసగా మూడో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంటుందో చూడాలి.