PBKS vs GT: పంజాబ్ vs గుజరాత్.. గెలిచే జట్టేది?

PBKS vs GT: పంజాబ్ vs గుజరాత్.. గెలిచే జట్టేది?

ఐపీఎల్ లో నేడు (ఏప్రిల్ 21) పంజాబ్ కింగ్స్ తో గుజరాత్ టైటాన్స్ తలపడుతుంది. చండీఘర్ లోని ముల్లంపూర్ ఈ మ్యాచ్ కు ఆతిధ్యమిస్తుంది. కుర్రాళ్లతో నిండిన ఇరు జట్లు ఈ మ్యాచ్ లో గెలిచి ప్లే ఆఫ్ రేస్ లో నిలవాలని ఆరాటపడుతున్నాయి. రెండు జట్లు బలంగా ఉండడంతో ఈ మ్యాచ్ లో ఎవరు గెలుస్తారో ఆసక్తికరంగా మారింది. ఈ నేపథ్యంలో ఇరు జట్ల బలాబలాలను ఒకసారి పరీశీలిద్దాం . 

గుజరాత్ టైటాన్స్ :

ఐపీఎల్ లో గుజరాత్ పెద్దగా ప్రభావం చూపించట్లేదు. హార్దిక్ పాండ్య, మహమ్మద్ షమీ లాంటి స్టార్ ఆటగాళ్లు దూరమైనా లోటు ఆ జట్టులో కనిపిస్తుంది. కొత్త కెప్టెన్ గిల్ సారధ్యంలో ఇప్పటివరకు 7 మ్యాచ్ లాడితే మూడు మ్యాచ్ ల్లో విజయం సాధించింది. తొలి మ్యాచ్ లో ముంబైతో గెలిచి శుభారంభం చేసినా.. ఆ తర్వాత చెన్నై చేతిలో ఘోరంగా ఓడింది. అయితే సొంతగడ్డపై సన్ రైజర్స్ పై గెలిచి మళ్ళీ విజయాల బాట పట్టింది.  రాజస్థాన్ పై ఉత్కంఠ పోరులో గెలిచి ఆత్మ విశ్వాసాన్ని కూడగట్టుకున్నా.. ఢిల్లీ క్యాపిటల్స్ పై 89 పరుగులకే ఆలౌటై ఘోర పరాజయాన్ని చవి చూసింది. 

నేడు పంజాబ్ తో మరో కీలక పోరుకు సిద్ధమైంది. బ్యాటింగ్ లో గిల్ పర్వాలేదనిపిస్తున్నా స్థాయికి తగ్గట్టు ఆడలేకపోతున్నాడు. మూడో స్థానంలో బ్యాటింగ్ కు వస్తున్న సాయి సుదర్శన్ నిలకడగా రాణించడం ఆ జట్టుకు కలిసి వచ్చే అంశం. గాయం నుంచి తిరిగొచ్చిన మిల్లర్ గాడిలో పడాల్సి ఉంది. వీరందరూ మరోసారి రాణిస్తే గుజరాత్ కు తిరుగుండదు. గుజరాత్ బలమంతా వారి బౌలింగ్ అని చెప్పుకోవాలి. రషీద్ ఖాన్, నూర్ అహ్మద్, సాయి కిషోర్ లాంటి నాణ్యమైన స్పిన్నర్లు ఈ జట్టులో ఉన్నారు. మోహిత్ శర్మ ప్రతి మ్యాచ్ లో నిలకడగా రాణిస్తున్నాడు. ఉమేష్ యాదవ్ గాడిలో పడితే బౌలింగ్ సమస్యలు తీరిపోయినట్టే. 

పంజాబ్ కింగ్స్ :

టోర్నీలో బలహీనమైన జట్లలో పంజాబ్ ఒకటి. శిఖర్ ధావన్ మినహాయిస్తే ఆ జట్టులో అనుభవమున్న ప్లేయర్లు లేరు. అయితే యంగ్ ప్లేయర్లు శశాంక్ సింగ్, ఆశుతోష్ అద్భుతంగా రాణించడంతో మరోసారి పంజాబ్ వీరిద్దరిపైనే ఆశలు పెట్టుకుంది. ధావన్ అందుబాటులో లేకపోయినా సామ్ కరణ్ నిలకడగా రాణిస్తున్నాడు. బెయిర్ స్టో, లివింగ్ స్టోన్ లాంటి స్టార్ ఆటగాళ్లు ఇప్పటివరకు స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేదు. ఇక బౌలింగ్ లో హరిప్రీత్ బ్రార్ ఒక్కడే రాణిస్తున్నాడు. అర్షదీప్ పర్వాలేదనిపిస్తున్నా.. హర్షల్ పటేల్, రబడా లాంటి పేసర్లు భారీగా పరుగులు సమర్పించుకుంటున్నారు. 

ఆదుకుంటాడనుకున్న రూసో, సిమ్రాన్ సింగ్ ఘోరంగా విఫలమవుతున్నారు. బౌలింగ్ లో గాడిలో పడకపోతే పంజాబ్ ఈ మ్యాచ్ లో ఓడిపోవడం ఖాయం. ఇప్పటివరకు ఆడిన 7 మ్యాచ్ ల్లో రెండు మ్యాచ్ ల్లో మాత్రమే విజయం సాధించింది. తొలి మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ తో గెలిచి శుభారంభం చేసినా ఆ తర్వాత వరుసగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, లక్నో సూపర్ జయింట్స్ చేతిలో పరాజయం పాలైంది. గుజరాత్ పై గెలిచినా.. ఆ తర్వాత వరుసగా మూడు మ్యాచ్  ల్లో ఓడిపోయింది.        

రెండు జట్ల బలాబలాలను పరిశీలిస్తే ఈ మ్యాచ్ లో పంజాబ్ పటిష్టంగా కనిపిస్తుంది. సొంతగడ్డపై ఆడుతుండడం పంజాబ్ కు  అనుకూలంగా మారింది. శశాంక్ సింగ్, ఆశుతోష్ ఫామ్ తో మరో విజయాన్ని అందుకోవచ్చు. మరోవైపు గుజరాత్ స్థాయికి తగ్గట్టుగా రాణిస్తేనే విజయం దక్కుతుంది. ఈ మ్యాచ్ లో పంజాబ్ కు 60 శాతం గెలిచే అవకాశాలు ఉంటే.. గుజరాత్ కు 40 శాతం ఉంది. ఎవరు గెలిచి రెండు పాయింట్స్ తమ ఖాతాలో వేసుకుంటారో చూడాలి.   

పంజాబ్ కింగ్స్ ప్లేయింగ్ 11 (అంచనా ):

ప్రభ్‌సిమ్రాన్ సింగ్, సామ్ కర్రాన్, రిలీ రోసౌ, లియామ్ లివింగ్‌స్టోన్, జితేష్ శర్మ, శశాంక్ సింగ్, అశుతోష్ శర్మ, హర్‌ప్రీత్ బ్రార్, కగిసో రబాడ , హర్షల్ పటేల్ , అర్ష్‌దీప్ సింగ్

గుజరాత్ టైటాన్స్ ప్లేయింగ్ 11(అంచనా ):

శుభమాన్ గిల్ (కెప్టెన్), వృద్ధిమాన్ సాహా (వికెట్ కీపర్), సాయి సుదర్శన్, డేవిడ్ మిల్లర్, అభినవ్ మనోహర్, షారుక్ ఖాన్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్ , నూర్ అహ్మద్, స్పెన్సర్ జాన్సన్, ఉమేష్ యాదవ్